విజయనగరం అర్బన్: విద్యాశాఖను తప్పుదారి పట్టించి బదిలీ పాయింట్లు వేసుకున్న ఉపాధ్యాయులపై విద్యాశాఖ కొరడా ఝుళిపించనుంది. అభ్యంతరాల సవరణ సమయంలో దొరికిన పలువురు ఉపాధ్యాయుల గుర్తించింది. వీరికి శ్రీముఖాలను ఇవ్వడానికి విద్యాశాఖ సిద్ధమైంది. జిల్లాలో 3,040 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా వారిలో 806 మంది వివిధ అంశాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు పెట్టుకున్నారు. అయితే ఫిర్యాదుల్లో సుమారు 25 మంది వరకు స్వీయ తప్పిదాలను సవరించాలని కోరినవే ఉన్నాయి. వీటిని విద్యాశాఖ సవరిస్తూనే చార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమయింది. ఈ మేరకు చార్జ్ మోమోలను బదిలీ ఆదేశాలు అందుకోకముందే సంబంధిత ఉపాధ్యాయుల చేతిలో పెట్టాలని చూస్తోంది. ఈ విషయాన్ని డీఈఓ జి.కృష్ణారావు ఖరారు చేశారు.
బదిలీ జాబితా పరిశీలన
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. టీచర్లు తాము బదిలీ కోరుకుంటున్న స్థానాలను వెబ్‌ఆప్షన్ల రూపంలో ప్రాధాన్య తా క్రమంలో ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వెబ్‌ఆప్షన్లు ఇచ్చిన స్థానాల కేటాయింపు ప్రక్రియ కోసం టీచర్లు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారుచేసి ఆన్‌లైన్‌లో పొందుపరిచిన ఉపాధ్యాయుల వ్యక్తిగత పనితీరు, సర్వీస్ పాయింట్ల తుది సీనియార్టీ జాబితా, పోస్టుల ఖాళీలు, పాఠశాలల విలీనాల జాబితాలను మరోసారి పరిశీలించాలని రాష్ట్రస్థాయి అధికారుల నుంచి జిల్లా విద్యాశాఖలకు తాజాగా ఆదేశాలొచ్చాయి. రేషనలైజేషన్ అమలు చేయడం వల్ల మిగిలిన పోస్టుల సంఖ్య, విలీనమైన పాఠశాలల సంఖ్యను చివరిసారిగా సరిచూసుకుని సంబంధిత ఆన్‌లైన్ తుదిజాబితాతో హైదరాబాద్ రావాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అలెర్ట్ అయింది. బుధవారం మరోసారి పరిశీలించుకుంది. ప్రధానంగా అభ్యంతరాలు, వినతులను సవరించిన అంశాల్లో ఒకటికి రెండుసార్లు చూసింది. ఈ మేరకు ఆన్‌లైన్ జాబితాను తీసుకుని బుధవారం సాయంత్రం విద్యాశాఖ సిబ్బంది పయనమయ్యారు.
రెండేళ్ల లోపు సర్వీసు పోస్టులపై ఖాళీలపై సందిగ్ధం
రెండేళ్ల లోపు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసినా ప్రస్తుతం వారు పనిచేస్తున్న స్థానాలు అరైజింగ్ వేకెన్సీలలో కనిపించలేదు. దీంతో వారు బదిలీ ఆప్షన్లలో తాము పనిచేస్తున్న స్థానాలను కూడా ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. తాము కోరుకున్న స్థానాల్లో తమకు పోస్టింగ్ రాకపోతే తాము ఎక్కడకు వెళ్లాల్సివస్త్తుందోనని మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల విషయంలో కూడా ఈ సమస్య ఎదురైంది. రెండేళ్లలోపు రిటైర్డ్ అయ్యే ప్రధానోపాధ్యాయుల స్థానాలు ఖాళీల జాబితాలో కనిపించకపోవడంతో ఈ స్థానాలను ఆప్షన్లు ఇచ్చేందుకు ఇతర ప్రధానోపాధ్యాయులకు అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన వెబ్‌సైట్‌లో పూర్తిస్థాయి సమాచారం పొందుపరచక పోవండంతో తాము నష్టపోతున్నామని ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు వాపోతున్నారు.
బదిలీ టీచర్లపై కొరడా..!
Published Thu, Oct 29 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM
Advertisement
Advertisement