నచ్చలేదని నొచ్చుకున్నారు.. | Doctors protest against Posting | Sakshi
Sakshi News home page

నచ్చలేదని నొచ్చుకున్నారు..

Published Thu, Aug 2 2018 1:03 AM | Last Updated on Thu, Aug 2 2018 1:04 AM

Doctors protest against Posting  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వానికి వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు ఇష్టమైన చోట పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్నే వదులుకోవడం వైద్య విధాన పరిషత్‌లో సంచలనం కలిగించింది. ఇష్టారాజ్యంగా పోస్టింగులు ఇవ్వడంతో తమకు ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని దాదాపు 200 మంది కొలువులను వదులుకోవడం చర్చనీయాంశంమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగ్‌ ఇవ్వా లని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్‌ చేస్తోంది.

మరోవైపు ఇష్టం వచ్చినట్లు ఎవరికి పోస్టింగులు ఇవ్వలేదని, గడువులోగా విధుల్లో చేరని వారం తా ఉద్యోగం కోల్పోయినట్లేనని వైద్య విధాన పరిషత్‌ స్పష్టం చేసింది. ఇటీవల తయారు చేసిన జాబితాలోని మిగిలిన వారితో ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు యోచిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కీలకమైన కంటి వెలుగు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు అధికారులకు ఇబ్బందికరంగా మారాయి.  

700 మందే చేరిన వైనం..  
రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో 911 మంది స్పెషలిస్ట్‌ వైద్యులను ఇటీవల నియమించారు. జూలై 6న ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చారు. పోస్టులు దక్కించుకున్న వారిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. కొందరి వైద్యులకు వారి సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆస్పత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చారు. మరికొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్య మొదలైంది.

పైరవీలు చేయించుకున్న వారికి మంచి పోస్టింగులు దక్కాయని, మిగిలిన వారికి అన్యాయం జరిగిందని కొందరు విమర్శిస్తున్నారు. దీంతో తాము కావాలను కున్న చోటు దక్కలేదని 200 మంది స్పెషలిస్టు వైద్యు లు విధుల్లో చేరేందుకు నిరాకరించారు. జూలై 29నే ఉద్యోగంలో చేరే గడువు ముగిసింది. మరోవైపు చేరిన 700 మందిలో దాదాపు సగం మంది తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధులకు హాజరుకావడం లేదని సమాచారం. వైద్యులకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఆప్షన్లు ఇచ్చి పోస్టింగ్‌ కేటాయించి ఉంటే బాగుండేదన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి..  
ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇవ్వడంతో దాదాపు 200 మంది స్పెషలిస్టు వైద్యులు ఉద్యోగంలో చేరలేదు. వైద్యులకు నచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగులు ఇవ్వాలి.    – డాక్టర్‌ ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు

జాబితాలోని ఇతరులకు ఇస్తాం..  
చాలామంది స్పెషలిస్టు వైద్యులు విధుల్లో చేరలేదు. విధుల్లో చేరని వారంతా ఉద్యోగం కోల్పోయినట్లే. ప్రస్తుతం ఏం చేయాలన్న దాని పై ప్రభుత్వంతో చర్చిస్తాం. అవసరమైతే ఇటీవల తయారు చేసిన జాబితాలో మిగిలిన వారికి పోస్టింగ్‌ ఇస్తాం.     – డాక్టర్‌ శివప్రసాద్, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement