Telangana government doctors association
-
నచ్చలేదని నొచ్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్నే వదులుకోవడం వైద్య విధాన పరిషత్‌లో సంచలనం కలిగించింది. ఇష్టారాజ్యంగా పోస్టింగులు ఇవ్వడంతో తమకు ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని దాదాపు 200 మంది కొలువులను వదులుకోవడం చర్చనీయాంశంమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వా లని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇష్టం వచ్చినట్లు ఎవరికి పోస్టింగులు ఇవ్వలేదని, గడువులోగా విధుల్లో చేరని వారం తా ఉద్యోగం కోల్పోయినట్లేనని వైద్య విధాన పరిషత్ స్పష్టం చేసింది. ఇటీవల తయారు చేసిన జాబితాలోని మిగిలిన వారితో ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు యోచిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కీలకమైన కంటి వెలుగు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు అధికారులకు ఇబ్బందికరంగా మారాయి. 700 మందే చేరిన వైనం.. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను ఇటీవల నియమించారు. జూలై 6న ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చారు. పోస్టులు దక్కించుకున్న వారిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. కొందరి వైద్యులకు వారి సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆస్పత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చారు. మరికొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. పైరవీలు చేయించుకున్న వారికి మంచి పోస్టింగులు దక్కాయని, మిగిలిన వారికి అన్యాయం జరిగిందని కొందరు విమర్శిస్తున్నారు. దీంతో తాము కావాలను కున్న చోటు దక్కలేదని 200 మంది స్పెషలిస్టు వైద్యు లు విధుల్లో చేరేందుకు నిరాకరించారు. జూలై 29నే ఉద్యోగంలో చేరే గడువు ముగిసింది. మరోవైపు చేరిన 700 మందిలో దాదాపు సగం మంది తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధులకు హాజరుకావడం లేదని సమాచారం. వైద్యులకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, ఆప్షన్లు ఇచ్చి పోస్టింగ్ కేటాయించి ఉంటే బాగుండేదన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.. ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇవ్వడంతో దాదాపు 200 మంది స్పెషలిస్టు వైద్యులు ఉద్యోగంలో చేరలేదు. వైద్యులకు నచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగులు ఇవ్వాలి. – డాక్టర్ ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు జాబితాలోని ఇతరులకు ఇస్తాం.. చాలామంది స్పెషలిస్టు వైద్యులు విధుల్లో చేరలేదు. విధుల్లో చేరని వారంతా ఉద్యోగం కోల్పోయినట్లే. ప్రస్తుతం ఏం చేయాలన్న దాని పై ప్రభుత్వంతో చర్చిస్తాం. అవసరమైతే ఇటీవల తయారు చేసిన జాబితాలో మిగిలిన వారికి పోస్టింగ్ ఇస్తాం. – డాక్టర్ శివప్రసాద్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ -
ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డా. రవిశకర్లు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం కోఠిలోని తెలంగాణ వైద్యభవన్‌లో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షులుగా వీరేశం, కోశాధికారిగా నాగేందర్, ఉపాధ్యక్షులుగా లింగంగౌడ్, అన్న ప్రసన్న, సంజీవ్‌కుమార్, కార్యదర్శులుగా నర్సింగ్‌రావు, కిరణ్, షరీఫ్, లేగాల శ్రీనివాస్‌లు ఎన్నికగా శాశ్వత ఆహ్వానితులుగా కృష్ణారావు, సుబోద్‌కుమార్, ఎక్స్అఫిషియో సభ్యులుగా చింతా రమేష్‌లు ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీని రాష్ట్రంలోని వివిధ జిల్లాల వైద్యులు ఘనంగా సన్మానించారు. పవర్ ఇంజనీర్స్ అధ్యక్షుడిగా సుధాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎ.సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పి.రత్నాకర్‌రావు ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 17న నిర్వహించిన ఎన్నికల ఫలితాలు ఆదివారం ప్రకటించారు. -
సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాల్సిందే: టీజీజీడీఏ ‘గాంధీ’ యూనిట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సీమాంధ్ర వైద్యులంతా వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రిలో బుధవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, సిద్దిపేట రమేష్‌లు తెలిపారు. సమావేశ అనంతరం టీజీ జీడీఏ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. -
రేపు వైద్యుల సంఘం ఎన్నికలు
- ఆస్పత్రుల్లో హోరెత్తుతున్న ప్రచారం - సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్న వైనం సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వవైద్యుల సంఘం యూనిట్ల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. నిత్యం రోగులతో కిక్కిరిసిపోయే ఆయా ప్రభుత్వ ఆస్పత్రులన్ని తాజాగా ఆయా అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. తెలంగాణలో 17 యూనిట్లకు ఈనెల 12న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగునున్నాయి. వీటిలో ఉస్మానియా యూనిట్-1, యూనిట్-2, గాంధీ యూనిట్, ఫెరిఫెరల్ యూనిట్(వైద్యవిధానపరిషత్ పరిధి), ఈఎస్ఐ యూనిట్, రంగారెడ్డి జిల్లా యూనిట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఒక్కో యూనిట్ పరిధిలో సుమారు 300మంది వైద్యులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నిన్నమొన్నటి వరకు ఉప్పునిప్పులా చిటపటలాడిన సీమాంధ్ర, తెలంగాణ వైద్యులు ఎన్నికల నేపథ్యంలో ఒకరినొకరు ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకుసాగుతున్నారు. -
11న టీ ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను రిటర్నింగ్ ఆఫీసర్, వర్ధన్నపేట ఎస్పీహెచ్ఓ డాక్టర్ ఎ.సాంబశివరావు ఆదివారం విడుదల చేశారు. ఈనెల 6, 7వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 8న నామినేషన్ల పరిశీలన, 9న నామినేషన్ల ఉపసంహరణ, 10న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్న ట్లు తెలిపారు. 11వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఎంహెచ్ఓ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.