సాక్షి, హైదరాబాద్: వైద్య విధాన పరిషత్‌లో స్పెషలిస్టు వైద్యుల భర్తీ మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది. మూడు నెలల కిందట 919 మందిని నియమిస్తే 500 మంది వరకు ఇప్పుడు విధులకు హాజరు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మిగిలిన వారిలో 128 మంది దూరా భారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్నారు. మరికొందరేమో విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో ఎంతో ఆశించి చేసిన స్పెషలిస్టుల భర్తీ ఆశాభంగం కలిగించింది. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారితో పోస్టులు భర్తీ చేయాలనుకున్నా ఉన్నతస్థాయి నుంచి అనుమతి రాకపోవడంతో ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ నోటిఫికేషన్ జారీచేసిన తర్వాతే భర్తీ ప్రక్రియ జరుగుతుందని వైద్య విధాన పరిషత్ వర్గాలు చెబుతున్నాయి.
ఇష్టమైన పోస్టింగ్ దక్కక..
తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా వైద్య విధాన పరిషత్‌లో 919 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించిన సంగతి తెలిసిందే. 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్ నగరంలోని 14 ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో వైద్యులను భర్తీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఆర్థోపెడిక్–47, రేడియాలజీ–50, డెర్మటాలజీ–20, ఫోరెన్సిక్–28, జనరల్ మెడిసిన్–68, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్–09, పల్మనరీ–39, ఆప్తమాలజీ–34, సైకియాట్రిక్–22, ఎనస్తీషియా–156, ఈఎన్‌టీ–17, పాథాలజీ–55, జనరల్ సర్జన్స్–78, ఓబీజీ–146, పీడియాట్రిక్స్–150 పోస్టులను భర్తీ చేశారు. వైద్యులకు వారి సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆసుపత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. అలాగే సుదూర ప్రాంతాలకు భార్యాభర్తలను వేరు చేసేలా వేశారని మరికొందరు గగ్గోలు పెట్టారు. ఇలా పోస్టింగులు ఇస్తే తమకు ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని దాదాపు 128 మంది కొలువులను వదులుకోవడం ఉన్నతస్థాయిలో చర్చనీయాంశమైంది.
వెబ్‌కౌన్సెలింగ్ కోసం విన్నపాలు..
కోర్టులో సమస్య ఉండటంతో ఆగమేఘాల మీద భర్తీ ప్రక్రియ జరిగింది. కాబట్టి అనేకమందికి అనుకున్నచోట ఉద్యోగం దక్కలేదు. ఇదే పరిస్థితి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల పరిధిలోని వైద్యుల భర్తీలోనూ జరిగితే వాటిని మార్చేందుకు ప్రత్యేకంగా దరఖాస్తులను ఆహ్వానించారు. ఏకంగా 250 మంది వరకు తమకు ఇచ్చిన పోస్టింగ్‌లను మార్చాలని కోరారు. వారికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లను ఖరారు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వైద్యులకు ఉత్తర్వులు ఇవ్వలేదు. అలాగే వైద్య విధాన పరిషత్‌లోనూ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి వారిచ్చిన ఆప్షన్ల ప్రకారం స్పెషలిస్టు వైద్యుల పోస్టుల్లో మార్పులు చేయాలని పలువురు కోరుతున్నారు. దీనివల్ల పోస్టింగ్‌లలో వెసులుబాటు దొరికి విధులకు హాజరుకావడానికి వీలుంటుందని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
వైద్యుల నియామకం.. ఫలితం శూన్యం
Published Mon, Oct 29 2018 2:16 AM | Last Updated on Mon, Oct 29 2018 2:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment