‘వైద్య’ అడ్మిషన్లపై గందరగోళం
హైకోర్టు తీర్పు ఇచ్చినా భర్తీపై అస్పష్టత
► స్టే ఎత్తివేతకు పిటిషన్ వేయాలని ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్ణయం
► ప్రభుత్వంతో ఒప్పందం జరగనందున భర్తీకి ఒప్పుకోబోమని స్పష్టీకరణ
► రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం.. ఆప్షన్లు ఇస్తున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లపై గందరగోళం కొనసాగుతోంది. ఫీజులు పెంచుతూ తెలంగాణ సర్కారు విడుదల చేసిన జీవోలను హైకోర్టు నిలుపుదల చేయడం, ప్రవేశాలను యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో స్టే ఎత్తివేతకు ప్రైవేటు మెడికల్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేయాలని తాజాగా నిర్ణయించాయి. అలాగే అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి లేఖ రాశాయి.
కన్వీనర్ కోటా సీట్లకు శుక్రవారం మొదలైన వెబ్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోరాయి. దీంతో ఆరోగ్య విశ్వవిద్యాలయం గందరగోళంలో పడింది. అడ్మిషన్ల ప్రక్రియపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం పీజీ వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి కావాలి. ఇంకా 18 రోజులే గడువు ఉంది. దీంతో అడ్మిషన్లు పూర్తవుతాయా లేదా అనే సందేహాలతో వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వెనక్కు తగ్గని మెడికల్ కాలేజీలు
మొదటి నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు మొండిగానే వ్యవహరిస్తున్నాయి. ఫీజులు పెంచకుంటే పీజీ వైద్య సీట్లను తమ కాలేజీల నుంచి ఉపసంహరించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం.. అడిగినట్లుగా అన్ని రకాల ఫీజులను గణనీయంగా పెంచింది. క్లినికల్ ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకైతే మూడేళ్లకు ఏకంగా రూ.2.17 కోట్లు పెంచేసింది. దీంతో ఆందోళన చెందిన వైద్య విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో స్టే విధిస్తూ తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు వెలువడినా ప్రైవేటు కాలేజీలు వెనక్కు తగ్గడంలేదు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లి పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టంచేస్తున్నాయి.
ఫీజులకు సంబంధించి మూడు నెలల కిందటే ఏఎఫ్‌ఆర్‌సీకి లేఖ రాశామని చెబుతున్నాయి. ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం జరగకుండానే వెబ్ కౌన్సెలింగ్‌కు ఎలా వెళ్లారంటూ ఆరోగ్య వర్సిటీని ప్రశ్నిస్తున్నాయి. ‘హైకోర్టు స్టే విధించాక మాకు ఎలాంటి నోటీసు రాలేదు. కాబట్టి వెబ్ కౌన్సెలింగ్ జరగకుండా చూడాలని వర్సిటీకి లేఖ ఇచ్చాం. అయినా ఎంవోయూ జరగకుండా ఎలా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు’అని ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు ప్రశ్నిస్తున్నారు. ‘ఫీజులు పెంచకుంటే మాకు గిట్టుబాటు కాదు. తక్కువ ఫీజులతో పీజీ కోర్సులను నడిపించడం సాధ్యంకాదు. అవసరమైతే కాలేజీలను బంద్ పెడతాం’అని ఆయన ‘సాక్షి’తో అన్నారు. హైకోర్టుకు వెళ్లాలా, సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే దానిపై సోమవారం నాటికి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
వెబ్ కౌన్సెలింగ్‌పై ముందుకే
ప్రైవేటు మెడికల్ కాలేజీలు కౌన్సెలింగ్ నిలిపివేయాలని కోరినా అది సాధ్యం కాదని ఆరోగ్య వర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కొన్ని సీట్లల్లో విద్యార్థులు చేరిపోయారు. ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో మొదటి కౌన్సెలింగ్ తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు, అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు శుక్రవారం రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ మొదలైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కౌన్సెలింగ్ ముగుస్తుంది. ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్ రద్దు చేయమని కోరినా ఇప్పటికే ప్రారంభమైనందున వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను రద్దు చేయడం కుదరదని, కాబట్టి కొనసాగిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
ప్రైవేటు కాలేజీల్లోని 267 కన్వీనర్ కోటా సీట్లకు, మైనారిటీలోని 46 కన్వీనర్ కోటా సీట్లకు, కొత్తగా కేటాయించిన 100 సీట్లకు, అలాగే మొదటి కౌన్సెలింగ్‌లో మిగిలినపోయిన నిమ్స్‌లోని 51 సీట్లకు, ఓయూ, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో మిగిలిపోయిన 236 సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటిరోజు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని, అయితే ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటామని కరుణాకర్‌రెడ్డి వివరించారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు.
నెలాఖరుకు పూర్తి కావాల్సిన ప్రక్రియ
సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. హైకోర్టు స్టే ఇవ్వడం, ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేయాలని కోరుతుండటంతో అడ్మిషన్లపై గందరగోళం నెలకొనడంతో అడ్మిషన్ల ప్రక్రియ పూర్త య్యే పరిస్థితి కనిపించడం లేదు. పొడిగింపు కోరే అవకాశముంది.