సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలను ఖరారుచేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేడ్–2 హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, తత్సమాన కేటగిరీల టీచర్లు ఈ బదిలీల పరిధిలోకి వస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–54 విడుదల చేశారు. దీంతోపాటు ఆయా పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు సంబంధించి కూడా ప్రభుత్వం జీవో–53ని జారీచేసింది. బదిలీలు ఆన్‌లైన్లో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేయనున్నారు. ఈ ఉత్తర్వులు రావడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బదిలీల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇతర యాజమాన్యాల స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆయా విభాగాలు షెడ్యూల్ ఇవ్వనున్నాయి.
మార్గదర్శకాలు ఇలా..
– 2019–20 విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయిన టీచర్లకు, 5 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్–2 హెడ్మాస్టర్లకు బదిలీ తప్పనిసరి. ఏడాదిలో సగం రోజులు పూర్తి చేసినా పూర్తి ఏడాదిగానే పరిగణిస్తారు.
– అక్టోబర్ ఒకటి నుంచి రెండేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి వారు కోరుకుంటే తప్ప బదిలీ ఉండదు.
– బాలికోన్నత పాఠశాలల్లో పనిచేస్తూ అక్టోబర్ 1 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న పురుష టీచర్లకు బదిలీ తప్పనిసరి.
– అంధులైన టీచర్లను బదిలీల నుంచి మినహాయించారు. వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చు.
– టీచర్ల బదిలీలకు 85 ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లను ఖరారు చేశారు. కామన్ పాయింట్ల కింద 55, స్పెషల్ పాయింట్ల కింద 25, రీ అపోర్షన్ పాయింట్ల కింద 5గా నిర్ణయించారు.
– ప్రిఫరెన్షియల్ కేటగిరీల కింద దివ్యాంగులు, భర్త నుంచి విడిపోయిన వారు, భర్త చనిపోయిన వారికి ఎన్‌టైటిల్‌మెంటు పాయింట్లతో సంబంధం లేకుండా సీనియార్టీలో ప్రాధాన్యతనిస్తారు.
– తప్పుడు ధ్రువపత్రాలిచ్చే వారిపై.. వాటిని పరిశీలించకుండా కౌంటర్ సంతకం చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
– ఉత్తర్వులు అందుకున్నాక ఎవరైనా అనధికారికంగా గైర్హాజరైతే వారికి నో వర్క్ నో పే అమలుచేస్తారు.
టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఇలా..
టీచర్ల సర్దుబాటుకు సంబంధించి కేటగిరీల వారీగా పిల్లల సంఖ్యను అనుసరించి టీచర్ల సంఖ్యను నిర్ధారించారు.
– ప్రాథమిక పాఠశాలల్లో 151–200 విద్యార్థులుంటే ఒక హెచ్‌ఎం, 5గురు ఎస్జీటీలు..
– 121–150 వరకు ఐదుగురు ఎస్జీటీలు..
– 91–120 వరకు నలుగురు ఎస్జీటీలు..
– 61–90 వరకు ముగ్గురు ఎస్జీటీలు..
– 60 వరకు అయితే ఇద్దరు ఎస్జీటీలు..
– 200పైన ప్రతి 40 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎస్జీటీని నియమిస్తారు.
టీచర్ల బదిలీలకు ఓకే
Published Tue, Oct 13 2020 4:13 AM | Last Updated on Tue, Oct 13 2020 4:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment