ఇంజినీరింగ్ కళాశాలల సీటు పాట్లు
Published Wed, Sep 4 2013 5:32 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
ఎచ్చెర్ల క్యాంపస్,న్యూస్‌లైన్: ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు మంగళ, బుధవారాల్లో ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. దీంతో ప్రవేటు కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్లపై దృష్టి పెట్టాయి. ఇంజినీరింగ్ సీట్లు కనీసం 50 శాతం నిండినా కళాశాలలు సజావుగా నిర్వహించవచ్చు. లేకుంటే మాత్రం ఆర్థికంగా ఇక్కట్లు తప్పవు. 50 శాతం దాటి అడ్మిషన్లు గత ఏడాది మూడు కళాశాలల్లో మాత్రమే నమోదయ్యాయి. రెండు కళాశాలల్లో మూడేళ్ల నుంచి ఒక్క సీటు కూడా బోణీ కొట్టడం లేదు. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు అడ్మిషన్లపై దృష్టిపెట్టాయి. దీనికోసం ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించాయి.
బోధకులు, ట్యూషన్ సెంటర్లు విద్యార్థులను చేర్చితే రూ.5 వేలు కూడా ఇస్తున్నారు. మరికొన్ని కళాశాలలు బిల్డింగ్, కాలేజ్ డెవలప్‌మెంట్ ఫీజుల్లో రాయతీలు కూడా ఇస్తున్నాయి. అయినప్పటికీ ప్రవేశాల జాడ కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు పక్క రాష్ట్రాలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో చేరారు. ఇంజినీరింగ్‌కు ఉపాధి అవకాశాలు తగ్గడం, అవసరానికి మించి కళాశాలలు నెలకొనడంతో ప్రైవేటు యాజమాన్యాల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడాది జిల్లాలో 3628 కన్వీనర్ సీట్లు ఉండగా, 1605 మాత్రమే నిండాయి. 1272 మేనేజ్‌మెంట్ సీట్లలో సగభాగం కూడా నిండలేదు. జిల్లాలో ఏటా సుమారు 4500 మంది వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ రాస్తున్నా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం అంతమంది హాజరుకావడం లేదు. 2009లో 2212, 2010లో 2909, 2011లో 2370, 2012లో 2375, 2013లో 3910 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు.
వీరిలో దాదాపు సగం మంది విజయనగరం, విశాఖపట్నంకు చెందిన విద్యార్థులే ఉన్నారు. జిల్లాకు చెందిన సగం మంది విద్యార్థులు బయిట జిల్లాల కళాశాలల్లో చేరి పోతున్నారు. అక్కడ నుంచి జిల్లాలోని కళాశాలలకు మాత్రం ఆ స్థాయిలో విద్యార్థులు రావడం లేదు. దీంతో ఏటా అడ్మిషన్లు తగ్గుతున్నాయి. పాత కళాశాలల్లోకూడా అడ్మిషన్ల పరిస్థితి ఆశాజనకంగా లేదు. అందుకే కళాశాలలు శ్రీకాకుళం పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో వెబ్ ఆప్షన్ హెల్ప్‌లైన్ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. చేరుతామని హామీ ఇచ్చిన విద్యార్థుల ఆప్షన్లు దగ్గరుండి నమోదు చేస్తున్నారు. సీట్లు నిండడానికి ఎవరి ప్రయత్నాలు చేస్తుండగా, రెండు కళాశాలలు మాత్రం చేతులెత్తేశాయి.
Advertisement