12, 13న ‘పీజీ మెడికల్’ కౌన్సెలింగ్
నోటిఫికేషన్ జారీచేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్, డిప్లొమా సీట్ల అడ్మిషన్ల కోసం ఈ నెల 12, 13 తేదీల్లో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13 సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ కౌన్సెలింగ్ నిమ్స్ సహా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పీజీ మెడికల్ సీట్లకు మాత్రమే నిర్వహించారు. ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల సీట్ల ఫీజుల వ్యవహారం తేలక పోవడంతో మొదటి విడత కౌన్సెలింగ్ ప్రభుత్వ సీట్లకే పరిమితమైంది.
మంగళవారం పీజీ సీట్ల ఫీజుల పెంపుపై జీవో జారీచేయడంతో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ సీట్లతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మైనారిటీ కోటా సీట్లకు మాత్రం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కాగా, మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ దాదాపు 600 సీట్లకు నిర్వహించగా, విద్యార్థులు చేరకపోవడంతో 238 సీట్లు మిగిలిపోయాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. తదుపరి కౌన్సెలింగ్‌లో నిమ్స్ తదితర ప్రముఖ కాలేజీల్లో సీటు వస్తుందన్న ఆశతోనే చాలా మంది చేరలేదని భావిస్తున్నారు.