వెబ్‌ కౌన్సెలింగ్‌ అయోమయం! | Teacher Transfer Process on Web Counseling in Technical Issues | Sakshi
Sakshi News home page

వెబ్‌ కౌన్సెలింగ్‌ అయోమయం!

Published Sun, Jun 24 2018 5:02 AM | Last Updated on Sun, Jun 24 2018 5:02 AM

Teacher Transfer Process on Web Counseling in Technical Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన వెబ్‌ కౌన్సెలింగ్‌ తొలి రోజే గందరగోళానికి దారితీసింది. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు, దానికి తోడు స్పౌజ్‌ పాయింట్లు ఉన్న టీచర్లకు అతి తక్కువ ఆప్షన్లు, ఒకే పోస్టును రెండుసార్లు చూపడం మొదలైనవి టీచర్లను తీవ్ర అయోమయానికి గురిచేశాయి. బదిలీ ప్రక్రియలో భాగంగా శనివారం గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్‌ఎం)కు విద్యా శాఖ వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంలు శనివారం ఉదయం నుంచే కంప్యూటర్ల ముందుకు చేరారు. రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్‌ఎం కేటగిరీలో 2,209 మంది బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 541 మందికి తప్పనిసరి బదిలీ కానుండగా.. 1,668 మంది ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండటంతో బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు.

సతాయించిన సాంకేతిక సమస్యలు
జీహెచ్‌ఎంల వెబ్‌ కౌన్సెలింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తక్కువ మంది టీచర్లే ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ట్రెజరీ సంఖ్య, మొబైల్‌ నంబర్‌ను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే ఉద్యోగి మొబైల్‌కు ఓటీపీ(వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఉద్యోగికి సంబంధించిన వెబ్‌ పేజీ తెరుచుకుంటుంది. కానీ వివరాలు నమోదు చేసిన వెంటనే ఓటీపీ రావడం లేదు. దీంతో పలుమార్లు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. ఓటీపీ నమోదు తర్వాత ఉద్యోగి ఖాళీలను ఆప్ట్‌ చేసుకుంటూ ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్‌ తెరుచుకోవడం.. ఆప్షన్లు ఇస్తున్న సమయంలో పేజీ రీడింగ్‌లో తీవ్ర జాప్యంతో ఆప్షన్లు ఇవ్వడానికి రెండు గంటలపాటు వేచి చూడాల్సి వస్తోందని జీహెచ్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. లాగ్‌ అవుట్‌ కాకపోవడం, వెబ్‌ఆప్షన్లు సేవ్‌ కాకపోవడం లాంటి సమస్యలతో జీహెచ్‌ఎంలు ఇబ్బంది పడ్డారు.

తప్పనిసరి అయితే అన్నీ ఎంచుకోవాలి..
ఒకేచోట ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన టీచర్లకు తప్పనిసరి బదిలీ కానుంది. తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న టీచర్లు వెబ్‌ కౌన్సెలింగ్‌లో చూపిన ఖాళీలన్నింటికి ఆప్షన్‌ ఇవ్వాలి. అలా అయితేనే వెబ్‌ కౌన్సెలింగ్‌ పేజీ పూర్తవుతుంది. కొన్నింటికే ఆప్షన్లు ఇస్తే.. సీనియార్టీ ఆధారంగా సదరు జీహెచ్‌ఎంకు అందులో పేర్కొన్న స్థానం దక్కకుంటే.. మిగతా ఖాళీ స్థానాన్ని సాఫ్ట్‌వేర్‌ ఆటోమేటిక్‌గా కేటాయిస్తుంది. దీంతో ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ఖాళీలన్నీ చూపాలని విద్యాశాఖ ఇలా వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చేసింది. ఈ ప్రక్రియతో టీచర్లు ఇబ్బంది పడ్డారు.

ఇక స్పౌజ్‌ పాయింట్లున్న టీచర్ల పరిస్థితి విచిత్రంగా మారింది. స్పౌజ్‌ పని చేసే చోటు నుంచి జీహెచ్‌ఎం పనిచేస్తున్న చోటు మధ్య ఉన్న దూరాన్నే సాఫ్ట్‌వేర్‌ ప్రామాణికంగా తీసుకోవడంతో.. ఆ కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాళీలే వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. దీంతో వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. దూరం తక్కువగా ఉంటే తక్కువ ఖాళీలు చూపడంతో కొందరు టీచర్లకు నాలుగైదు స్థానాలకు మించి ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే వెబ్‌సైట్‌లో ఖాళీ స్థానాలు కొన్ని రెండేసిసార్లు చూపించడంతో టీచర్లు తికమకపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement