spouse issue
-
గూడు చెదిరి.. గుండె పగిలి..
ఖమ్మం: శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో.. దుండగుల బారి నుంచి సమాజాన్ని కాపాడటంలో పోలీసులదే కీలక పాత్ర. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అనుక్షణం ప్రజారక్షణ కోసం పరి తపిస్తూ.. ఓ వైపు లా అండ్ ఆర్డర్.. మరోవైపు కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో దంపతులిద్దరూ కూడా సేవలందించేవారున్నారు. అలాంటి వారికి పెద్ద కష్టమే వచ్చింది. ఉద్యోగం ఉందన్న ఓ ఆశ తప్పితే వారి జీవితంలో సుఖసంతోషాలు కరువై నరకయాతన అనుభవిస్తున్నారు. భర్త ఒకచోట.. భార్య మరోచోట.. వారి పిల్లలు ఇంకోచోట.. ఇలా గూడు చెదిరిన పక్షుల వలె స్పౌజ్ పరిధిలోని కానిస్టేబుళ్లు కన్నీళ్లను దిగమింగుకుని విధులకు హాజరవుతున్నారు. కుటుంబం, విధులు అనే రెండింటి మధ్య తల్లడిల్లుతూ ఆగమ్యగోచరంగా మారిన తమ తలరాత ఎప్పుడు మారుతుందోనంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు. 317 జీఓతో చెల్లాచెదురు తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా 2021లో తీసుకొచ్చిన 317 జీఓ పోలీస్ శాఖలో ఒకే జిల్లాలో పనిచేసుకుంటున్న దంపతులకు శాపంగా మారిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణలో భాగంగా సిబ్బందిని కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దంపతులు చెరో జిల్లాలకు బదిలీ అయ్యారు. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేయడంతో భార్య ఒకచోట, భర్త మరోచోట విధులు నిర్వర్తిస్తూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారి ఆలనా, పాలన, చదువు, ఇలా ప్రతిదీ కష్టంగా మారడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవాలంటే ఆ బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంపతులిద్దరూ పోలీసులే.. కానీ.. ఉద్యోగమున్నా అటు పిల్లలను చూసుకోలేక, ఇటు కుటుంబాన్ని పట్టించుకోక దంపతులిద్దరూ బాధను దిగమింగుకుంటూ విధులకు హాజరవుతున్నారు. ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్నా సంతోషం కరువైందని, కుటుంబం దగ్గరగా లేకపోవడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు మానసికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కనీసం కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు మాట్లాడుకోలేని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కరుణ చూపి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు మొరపెట్టుకుంటున్నారు. పిల్లల భవిష్యత్‌ను అర్థం చేసుకుని తమకొక దారిచూపాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుల మాదిరి కరుణ చూపండి.. క్రమబదీ్ధకరణ సమయంలో ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్ లిస్టులో ఉంచి దంపతులైన ఉద్యోగుల బదిలీలను నిలిపివేసింది. తాజాగా ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. గత నెల 26న విద్యాశాఖ 13 జిల్లాల్లోని దంపతులైన ఉపాధ్యాయులను (స్పౌజ్) ఒకే జిల్లాకు బదిలీ చేసింది. అయితే ఎస్జీటీల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న స్పౌజ్ పరిధిలోని ఉద్యోగులను కూడా బదిలీ చేయాలని పోలీసులు ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. కానిస్టేబుళ్ల స్థాయిలో స్పౌజ్ కింద పనిచేసే వారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మంది ఉంటారు. బదిలీ అవకాశం కల్పించమని దరఖాస్తు చేసుకొని సంవత్సరం దాటినప్పటికీ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇబ్బంది ఉందని సిక్ లీవ్, ఎర్న్ లీవ్స్ అడిగినప్పటికీ బందోబస్తు ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో సెలవులకు కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిసింది. అసలే సెలవులు లేని ఉద్యోగం, పిల్లలను చూసుకునేందుకు ఒక పూట అనుమతి తీసుకుని ఇంటికి బయలు దేరినా మార్గమధ్యలో ఎమర్జెన్సీ డ్యూటీ అని ఫోన్ వస్తే కుటుంబాన్ని చూడకుండానే వెనుదిరిగే పరిస్థితి ఉందని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. పోలీసులు మినహా మిగతా ఉద్యోగులకు తమకేమైనా సమస్య వస్తే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలుపుతారు. కానీ పోలీసులకు అలాంటి పరిస్థితి ఉండదు. యూనిఫాం వేసుకున్న రోజే వారు ఆ హక్కును కోల్పోతారు. ప్రభుత్వం తమ దీనగాథను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో భార్య కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇటీవల రెండు సంవత్సరాలు వయసు కలిగిన చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సి వచి్చంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు విధి నిర్వహణలో ఉండడం, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్ చేసి చెప్పగా వారు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. నాలుగైదు గంటల తర్వాత వారు ఆసుపత్రికి వెళ్లాల్సి వచి్చంది. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారిని ఆసుపత్రిలో చేరి్పంచలేక, మరోవైపు విధులను వదిలేసి రాలేక వారు నరకయాతన అనుభవించారు. -
వెబ్ కౌన్సెలింగ్ అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన వెబ్ కౌన్సెలింగ్ తొలి రోజే గందరగోళానికి దారితీసింది. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, దానికి తోడు స్పౌజ్ పాయింట్లు ఉన్న టీచర్లకు అతి తక్కువ ఆప్షన్లు, ఒకే పోస్టును రెండుసార్లు చూపడం మొదలైనవి టీచర్లను తీవ్ర అయోమయానికి గురిచేశాయి. బదిలీ ప్రక్రియలో భాగంగా శనివారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం)కు విద్యా శాఖ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంలు శనివారం ఉదయం నుంచే కంప్యూటర్ల ముందుకు చేరారు. రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎం కేటగిరీలో 2,209 మంది బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 541 మందికి తప్పనిసరి బదిలీ కానుండగా.. 1,668 మంది ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండటంతో బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. సతాయించిన సాంకేతిక సమస్యలు జీహెచ్‌ఎంల వెబ్ కౌన్సెలింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తక్కువ మంది టీచర్లే ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ట్రెజరీ సంఖ్య, మొబైల్ నంబర్‌ను వెబ్సైట్లో నమోదు చేస్తే ఉద్యోగి మొబైల్‌కు ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఉద్యోగికి సంబంధించిన వెబ్ పేజీ తెరుచుకుంటుంది. కానీ వివరాలు నమోదు చేసిన వెంటనే ఓటీపీ రావడం లేదు. దీంతో పలుమార్లు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. ఓటీపీ నమోదు తర్వాత ఉద్యోగి ఖాళీలను ఆప్ట్ చేసుకుంటూ ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ తెరుచుకోవడం.. ఆప్షన్లు ఇస్తున్న సమయంలో పేజీ రీడింగ్‌లో తీవ్ర జాప్యంతో ఆప్షన్లు ఇవ్వడానికి రెండు గంటలపాటు వేచి చూడాల్సి వస్తోందని జీహెచ్ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. లాగ్ అవుట్ కాకపోవడం, వెబ్ఆప్షన్లు సేవ్ కాకపోవడం లాంటి సమస్యలతో జీహెచ్ఎంలు ఇబ్బంది పడ్డారు. తప్పనిసరి అయితే అన్నీ ఎంచుకోవాలి.. ఒకేచోట ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన టీచర్లకు తప్పనిసరి బదిలీ కానుంది. తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న టీచర్లు వెబ్ కౌన్సెలింగ్‌లో చూపిన ఖాళీలన్నింటికి ఆప్షన్ ఇవ్వాలి. అలా అయితేనే వెబ్ కౌన్సెలింగ్ పేజీ పూర్తవుతుంది. కొన్నింటికే ఆప్షన్లు ఇస్తే.. సీనియార్టీ ఆధారంగా సదరు జీహెచ్‌ఎంకు అందులో పేర్కొన్న స్థానం దక్కకుంటే.. మిగతా ఖాళీ స్థానాన్ని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్‌గా కేటాయిస్తుంది. దీంతో ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ఖాళీలన్నీ చూపాలని విద్యాశాఖ ఇలా వెబ్‌సైట్‌ను అప్డేట్ చేసింది. ఈ ప్రక్రియతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇక స్పౌజ్ పాయింట్లున్న టీచర్ల పరిస్థితి విచిత్రంగా మారింది. స్పౌజ్ పని చేసే చోటు నుంచి జీహెచ్ఎం పనిచేస్తున్న చోటు మధ్య ఉన్న దూరాన్నే సాఫ్ట్వేర్ ప్రామాణికంగా తీసుకోవడంతో.. ఆ కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాళీలే వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. దీంతో వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. దూరం తక్కువగా ఉంటే తక్కువ ఖాళీలు చూపడంతో కొందరు టీచర్లకు నాలుగైదు స్థానాలకు మించి ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే వెబ్సైట్లో ఖాళీ స్థానాలు కొన్ని రెండేసిసార్లు చూపించడంతో టీచర్లు తికమకపడ్డారు. -
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల
సాక్షి, మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు సంబంధించి సీనియార్టీ జాబితాను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈమేరకు ఉపాధ్యాయులు ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయో పరిశీలిస్తూ తమ స్థానాన్ని వెతుక్కునే పనిలో పడ్డారు. ఇంకోపక్క వివిధ ప్రిపరెన్షియల్ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు సమర్పించిన పత్రాలు సరైనవేనా అని పరిశీలించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక తక్కువ పాయింట్లు వచ్చినా, పూర్తి స్తాయిలో పాయింట్లు రాకపోయినా ఉపాధ్యాయులు అధికారులకు మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. చాలా మంది తమకు నాలుగో కేటగిరీ పాఠశాలలకు సంబంధించి పాయింట్లు కలపలేదని చెబుతుండగా.. స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నా తక్కువ పాయింట్లు కలిపిన నేపథ్యంలో మరికొందరు దరఖాస్తు వెనక్కి తీసుకుంటున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్‌లో అధికారులు ఉపాధ్యాయులకు నమోదైన పాయింట్ల వివరాలను పరిశీలిస్తున్నారు. -
కౌన్సెలింగ్‌లో ‘స్పౌజ్’ రగడ!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా శనివారం స్థానిక సైన్స్ సెంటర్లో జరిగిన పండిట్ల బదిలీల కౌన్సెలింగ్‌లో ‘స్పౌజ్’పై రగడ జరిగింది. నిబంధనలు విరుద్ధంగా స్పౌజ్ కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీస్థానాలు కేటాయిస్తున్నారంటూ పలువురు టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏవైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా రాసిస్తే విచారించి చర్యలు తీసుకుంటామని, అంతేతప్ప ఇలా కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని డీఈఓ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. చెన్నేకొత్తపల్లి మండలంలో స్పౌజ్ పని చేస్తుంటే గార్లదిన్నె మండలానికి బదిలీ చేశారని, అలాగే కూడేరు మండలంలో స్పౌజ్ పని చేస్తుంటే ఆ మండలంలో ఖాళీలున్నా కూడా గార్లదిన్నె మండలం ఎటా కేటాయిస్తారని పలువురు టీచర్లు ప్రశ్నించారు. అలాగే కదిరి చుట్టుపక్కల మండలాల్లో పని చేస్తూ స్పౌజ్ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్న పలువురు ఉపాధ్యాయులు ఆయా మండలాల్లో ఖాళీలున్నా కదిరి మండలానికి వచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై టీచర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అందరికీ సర్దిచెప్పిన డీఈఓ చివరకు కౌన్సెలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి రాత్రి 9 గంటల సమయానికి కౌన్సెలింగ్ పూర్తయింది. పండిట్లతో పాటు, ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు ఆదివారం జనరేట్ అయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. డీఈఓ పూల్‌లో ఉన్న టీచర్ల సంగతేంటి ? ఇదిలా ఉండగా రేషనలైజేషన్ ప్రభావంతో పోస్టులు లేక పలువురు టీచర్లు డీఈఓ ఫూల్లో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఏదో ఒక చోట పని చేస్తుంటేనే జీతాలు చేయడానికి వీలుంటుంది. మొత్తం 61 మంది టీచర్లు డీఈఓ పూల్‌లో ఉన్నారు. తెలుగు పండిట్లు 18 మంది, హిందీ పండిట్లు 11 మంది, పీఈటీలు 32 మంది ఉన్నారు. వీరిపై వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే బదిలీ అయిన వారంతా వారివారి స్కూళ్లలో చేరిపోతే మిగులు టీచర్లను ఎక్కడ చూపించాలనేది విద్యాశాఖకు అంతుచిక్కడం లేదు. వాస్తవానికి వీరందరిని ఎస్జీటీ అగైనెస్ట్ పోస్టులకు సర్దుబాటు చేసి జీతాలకు ఇబ్బంది లేకుండా చూడాలని భావించారు. అయితే రాష్ట్ర అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డీఈఓ పూల్‌లో ఉన్న టీచర్లు ఆందోళనలో ఉన్నారు. వీరి విషయంలో ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు.