పారా మెడికల్ డిగ్రీ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్
25 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీలో పారామెడికల్ (నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ) కోర్సుల్లో అడ్మిషన్లకు జరిగే వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా ర్యాంకుల ప్రకారం ఏ హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనైనా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావచ్చు.
అన్ రిజర్వుడు 15 శాతం సీట్ల కోసం హాజరయ్యే తెలంగాణ అభ్యర్థులు మాత్రం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరుకావాలి. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న పీహెచ్ అభ్యర్థులు, పోస్టు బేసిక్ నర్సింగ్ (రెండేళ్ల) కోర్సుకు దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 28న విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరు కావాలి. మెరిట్ లిస్టు, ర్యాంకు కార్డులు, నోటిఫికేషన్ వివరాలు యూనివర్సిటీ ( హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఇన్, హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లలో పొందవచ్చు. అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనప్పుడు వాడకంలో ఉన్న సొంత ఫోన్ నంబర్‌ను నమోదు చేయించుకోవాలి.