మెడికల్ పీజీ అడ్మిషన్లకు వెబ్ కౌన్సెలింగ్
♦ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు
♦ ఏయూలో షెడ్యూల్ విడుదల
విశాఖ మెడికల్: ఈ ఏడాది నుంచి మెడికల్ పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో సీట్ల కేటాయింపునకు వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ టి.రవిరాజు చెప్పారు. శనివారం ఆంధ్రా వైద్య కళాశాలలో ఆయన 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలివిడత పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థి ఎంపిక చేసుకొని వదిలేసిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ వరకూ ఎంపిక చేసుకొనే అవకాశం ఉండేది కాదని, వెబ్ కౌన్సెలింగ్ విధానంలో వాటిని ఎప్పటికప్పుడు ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు.
కౌన్సెలింగ్ సమాచారం...
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఈ నెల 20 నుంచి 23 వరకు.
కేంద్రాలు: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, విశాఖపట్నంలోని ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ , హైదరాబాద్ జేఎన్‌టీయూ.
సీట్లు: 2,587, కన్వీనర్ కోటా: 1,905, మేనేజ్‌మెంట్ కోటా: 682.
వెబ్ ఆప్షన్ల నమోదు: 21 నుంచి 25 వరకు.
మొత్తం కాలేజీలు: 39, ప్రభుత్వ కాలేజీలు:13, ప్రైవేటు కాలేజీలు:26
మొత్తం సీట్లు: ఏయూ పరిధిలో ప్రభుత్వ కోటా సీట్లు: 396, ప్రైవేటు కాలేజీల్లో: 545, ఎస్‌వీ పరిధిలో 235, 236, ఉస్మానియా పరిధిలో 530, 484 సీట్లు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ కోటా సీట్లు: 61, వీటిలో స్థానికులకు 85 శాతం సీట్లు.
ఈ నెల 27వ తేదీన సీట్లు కేటాయించి విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ పంపిస్తామని వీసీ రవిరాజు తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌లో సీటు అలాట్‌మెంట్ వివరాలు చూసుకోవచ్చని చెప్పారు. రెండో విడత డెంటల్ పీజీ కౌన్సెలింగ్‌ను మే 31 తరువాత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.కుమార్, సామాజిక వైద్య విభాగాధిపతి ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు.