జేఎన్‌టీయూ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : తనిఖీల్లో బయటపడ్డ లోపాలను సరిదిద్దుకున్న కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) హైదరాబాద్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చకపోవడం, కొన్ని కోర్సులకు అఫిలియేషన్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించారు.
తనిఖీలు నిర్వహించిన వర్సిటీ వర్గాలు పలు లోపాలను ఎత్తిచూపాయని, దీనిపై అప్పీల్ దాఖలు చేశామని, లోపాలను సవరించుకున్న ఆధారాలను సమర్పించినా తమ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చలేదని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. సదరు కాలేజీల్లో మరోసారి తనిఖీలు నిర్వహించి లోపాలను సవరించుకున్న కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీతో పాటు తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఏఐసీటీఈ తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
ఆ కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి
Published Sat, Jul 9 2016 12:25 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement