హైదరాబాద్ : గుర్తింపును రద్దు చేసిన కళాశాలలకు ఊరటనిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జేఎన్‌టీయూ బుధవారం హైకోర్టును ఆశ్రయించింది. జేఎన్టీయూ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా కోర్టును ఆశ్రయించిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు అన్నింటిని వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఉన్నత విద్యామండలి బుధవారం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది.దీంతో హైకోర్టులో పిటిషన్ నేపథ్యంలో తెలంగాణలో సకాలంలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ పూర్తి చేసి, ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం సాధ్యమవుతుందా? లేదా అనే సందిగ్ధంలో ఉన్నత విద్యామండలి ఉంది.
కాగా హైదరాబాద్ జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు విషయంలో తలెత్తిన వివాదం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అనుబంధ గుర్తింపుపై ఇటీవల జేఎన్‌టీయూహెచ్ 220 కాలేజీల్లో పలు కోర్సులకు కోత విధించింది. ఫలితంగా దాదాపు 70 వేల వరకు సీట్లు తగ్గిపోయాయి. దీంతో పలు కాలేజీ యాజమన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు.దాంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు బుధవారం (8వ తేదీ) నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది.