550, 111 జీవోలకు సవరణ | Higher Education Department Orders About Seat Replacement | Sakshi
Sakshi News home page

550, 111 జీవోలకు సవరణ

Published Sat, Nov 14 2020 3:59 AM | Last Updated on Sat, Nov 14 2020 3:59 AM

Higher Education Department Orders About Seat Replacement - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాసంస్థల్లోని సీట్ల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు 550, 111లను సవరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన జీవోల్లోని నిబంధనలపై స్పష్టత ఇస్తూ, ఎలాంటి సందేహాలకు తావులేకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఆయా సీట్లను మెరిట్‌ ప్రకారం భర్తీ చేసేలా తాజాగా సవరణలు ఉత్తర్వులు జారీచేశారు. వీటి ప్రకారం...

► మెరిటోరియస్‌ రిజర్వుడ్‌ అభ్యర్థి స్లైడింగ్‌తో వేరే కాలేజీలో సీటు పొందితే ఖాళీ అయ్యే ఓపెన్‌ కేటగిరీ సీటును మెరిట్‌ ప్రకారం అదే రిజర్వుడ్‌ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ చేస్తారు.
► మెరిటోరియస్‌ రిజర్వుడ్‌ అభ్యర్థి స్లైడింగ్‌ ద్వారా కేటాయింపు అయిన కాలేజీలోని సీటులో చేరని పక్షంలో ఖాళీ అయిన ఓపెన్‌ కేటగిరీ సీటును తిరిగి ఓపెన్‌ కేటగిరీగానే పరిగణిస్తారు.
► మెరిటోరియస్‌ రిజర్వుడ్‌ అభ్యర్థి ఖాళీచేసే సీటును పొందిన అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థి కూడా ఆ సీటులో జాయిన్‌ కాని పక్షంలో..అదే రిజర్వుడ్‌ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ అయ్యేవరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక వేర్వేరుగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌
ఇలావుండగా కమిటీ చేసిన సిఫారసులతో మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అమల్లోకి తెస్తోంది.  
► ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌లు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీనికిముందు అన్నీ కలిపి చేయడం వల్ల ఒకింత గందరగోళానికి దారితీసేది. 
► అభ్యర్థులు ప్రాధాన్యత ప్రకారం ఒకేసారి తమకు నచ్చినన్ని ఆప్షన్లు ఇచ్చుకొనేలా చేస్తున్నారు. తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఇవ్వరు. గతంలో ఆప్షన్లను పలుమార్లు మార్చుకునేందుకు అవకాశం ఉండేది. 
► ఈసారి ఒక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన అభ్యర్థి దానిలో జాయినయినట్లు ఆన్‌లైన్‌ ద్వారా రిపోర్టు చేస్తేనే తదుపరి కౌన్సెలింగ్‌కు, స్లైడింగ్‌కు అనుమతిస్తారు. 
► గతంలో ఒక కౌన్సెలింగ్‌లో కాలేజీలో సీటు వచ్చిన అభ్యర్థి అందులో జాయినయినట్లు ఆప్షన్‌ ఇవ్వకున్నా తదుపరి కౌన్సెలింగ్‌కు, స్లైడింగ్‌కు అవకాశముండేది అలా స్లైడింగ్‌లతో ఆప్షన్లు ఇస్తూ ఆ అభ్యర్థి చివరకు ఎక్కడా జాయిన్‌ కాకుంటే ఆ సీట్లు ఖాళీగా మేనేజ్‌మెంటుకు మిగిలేవి. చివరకు ఇదో పెద్ద అక్రమాల తంతుగా మారింది. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ దీనికి కొంతవరకు అడ్డుకట్టవేసేలా జాయినింగ్‌ రిపోర్టును తప్పనిసరి చేస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement