రాజకీయ సిఫార్సుల మేరకే ఉద్యోగుల బదిలీలు
ఎమ్మెల్యేల మాటే నెగ్గింది
వంత పాడిన ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వెబ్ కౌన్సెలింగ్.. నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు’ అంటూ సర్కారు పలికిన పలుకులు మాటల వరకే అని తేలిపోయింది. నిబంధనల్ని తోసిరాజనడం.. అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావడంతో ఉద్యోగుల బదిలీలన్నీ పక్క పక్క మండలాలకు, పక్క గ్రామాలకే పరిమితం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే బదిలీలు చేయాలని ఆదేశించారు. సాయంత్రానికి కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల మాట వినండని పరోక్షంగా హితబోధ చేయడంతో ఉద్యోగుల బదిలీలు ప్రహసనంగా జరిగిపోయాయి. ఆన్‌లైన్ ద్వారానే బదిలీలు ఉంటాయని ప్రకటించినా కొందరు ఉద్యోగులు కీలక ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం నేతల చెంతకు పరుగులు తీశారు.
ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి తమకు అనుకూలంగా ఉండే వారి కోసం పైరవీలు చేశారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులను మాత్రమే కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేస్తుండగా.. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సెలింగ్ విధానం వల్ల ఎటువంటి అక్రమాలకు తావు ఉండదని అందరూ భావించారు. ఈ నిబంధనలతో ఉద్యోగుల్లో కొందరు తమకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో అని హడలిపోయారు. వెంటనే ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. దీంతో కథ మారిపోయింది. దీంతో వారు తమకు అనుకూలమైన వారిని తమ నియోజకవర్గంలోనే ఉండేలా చక్రం తిప్పారు.
నిబంధనలు గాలికి..
వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటివరకూ ఏజెన్సీలో పనిచేయని ఉద్యోగుల్ని గుర్తించి వారిని అక్కడకు పంపించాలి. ఏజెన్సీ ఏరియాలో పనిచేసిన వారిని అర్బన్ ప్రాంతాలకు తీసుకురావాల్సి ఉంది. జిల్లాలో ఈ నిబంధనలను కాదని బదిలీలు జరిగాయి. ఉద్యోగ సంఘాల్లో సభ్యులుగా ఉన్న కొందరు.. సంఘ కార్యవర్గ పదవిలో ఉన్నట్టు చెప్పుకుని వారు ప్రస్తుతం ఉంటున్న స్థానాల నుంచి కదల లేదు.
దివ్యాంగులకు మొండిచేయి
దివ్యాంగులకు బదిలీల నుంచి మినహాయించాలనే నిబంధన ఉన్నా దానిని కూడా పక్కనపెట్టి ఇష్టం వచ్చిన రీతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు. ఖజానా శాఖలో ఒక అంధ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడంపై తీవ్ర దుమారం రేగింది. సర్వే శాఖలోనూ ఒక అంధ ఉద్యోగిని బదిలీ చేయడంపై సాక్షాత్తు ఏలూరు ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే పెద్దగా పలుకుబడి, ఆదాయం రాని విభాగాల్లో మాత్రం బదిలీలు యథాతథంగా జరిగిపోయాయి. రెవెన్యూ విభాగంలో ఆదాయం వచ్చే ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం భారీగా చెల్లింపులకు కూడా సిద్ధమైనట్టు ఆరోపణలు వచ్చాయి. వీఆర్వోలు, ఆర్‌ఐలు చక్రం తిప్పడంతో వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయకుండా అక్కడికక్కడే ఉద్యోగాలు కట్టబెట్టారు. దుగ్గిరాల వీఆర్వోను కిలోమీటరు దూరం కూడా లేని శనివారపుపేటలో నియమించారు. వట్లూరు వీఆర్వోను సైతం కిలోమీటరు దూరంలో ఉన్న సత్రంపాడులో నియమించారు.
సాఫ్ట్‌వేర్ పనిచేయలేదు
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన బదిలీల సాఫ్ట్‌వేర్ పనిచేయలేదు. దీంతో వెబ్ కౌన్సెలింగ్ బదిలీలు కాస్తా సాధారణ బదిలీలుగా మారాయి. జిల్లాస్థాయిలో ప్రారంభించిన వెబ్ బదిలీల ప్రక్రియ కొంత ఫలితాన్నిచ్చినా చివరకు రాజకీయ బదిలీలుగా మారడంతో ఆ ప్రక్రియ వల్ల ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
నిబంధనలు తూచ్
Published Wed, Jun 22 2016 8:29 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement