హిమాచల్‌లో బీజేపీదే హవా
అడ్డుకునే యత్నాల్లో కాంగ్రెస్
6 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు
కాంగ్రెస్ సర్కారుకు విషమ పరీక్షే!
పేరులో మంచు ఉన్నా హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ సెగలు కక్కుతుంటాయి. రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీ 1985 నుంచీ కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తాజాగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది.
రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మారుతున్నా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 2009 నుంచీ బీజేపీదే పై చేయి. గత రెండు ఎన్నికల్లో 4 సీట్లూ ఆ పార్టీయే క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. పదేళ్లుగా ఒక్క ఎంపీ సీటూ గెలవలేని పేలవమైన రికార్డును ఎలాగైనా మెరుగు పరుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది...
ఆపరేషన్ కమలం...
సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. బీజేపీ దీన్ని యథాశక్తి ఎగదోస్తూ ఆపరేషన్ కమలానికి తెర తీసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికలు దీనికి మరింత ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన హర్‡్ష మహాజన్‌ను బలం లేకపోయినా బీజేపీ రాజ్యసభ పోటీలో నిలిపింది.
ముగ్గురు స్వతంత్రులతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ అనూహ్యంగా బీజేపీకి ఓటేయడంతో హర్‡్షకు, కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి 34 ఓట్లు వచ్చాయి. లాటరీలో హర్‡్షనే విజయం వరించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురూ ఇప్పటికే బీజీపీలో చేరారు.
ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 34కు పడిపోయి సర్కారు సంక్షోభంలో పడింది. బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయేలా ఉంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తామని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో ఆ ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ లోక్‌సభతో పాటే జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్‌కు ప్రాణసంకటం...!
తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లోక్‌సభ, 6 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు కాంగ్రెస్‌కు విషమపరీక్షగా మారాయి. ఎమ్మెల్యే సీట్లు బీజేపీ పరమైతే రాష్ట్రంలో ప్రభుత్వం కమలనాథుల పరమవుతుంది. రామ మందిరం, హిందుత్వ, అభివృద్ధి నినాదాలతో బీజేపీ హోరెత్తిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, సామాజిక న్యాయం, సంక్షేమం తదితరాలను కాంగ్రెస్ నమ్ముకుంది. హమీర్పూర్ నుంచి రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐదోసారి ఎంపీగా విన్నింగ్ షాట్ కొట్టేందుకు బరిలోకి దిగుతున్నారు.
ఆయన హిమాచల్‌కు రెండుసార్లు సీఎంగా చేసిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ తనయుడు. మండి స్థానంలో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ‘క్వీన్’ కంగనా రనౌత్ బీజేపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాజ వంశీయుడు, మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో 2021లో మండికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ విజయం సాధించడంతో బీజేపీ బలం మూడుకు తగ్గింది.
సర్వేల మాటేంటి?
దాదాపు అన్ని సర్వేలూ బీజేపీ హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ ఖాయమని అంచనా వేస్తున్నాయి.
పర్యాటక స్వర్గధామమైన హిమాచల్‌లో ఓటర్ల మూడ్ ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా మారుతుంటుంది. కాంగ్రెస్, బీజేపీలే ఇక్కడ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. కానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. 68 అసెంబ్లీ స్థానాల్లో 40 చోట్ల నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 4 లోక్‌సభ స్థానాల్లో సిమ్లాను ఎస్సీలకు కేటాయించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment