సాక్షి, చెన్నై : మక్కల్ మండ్రంలో జిల్లాకు ఐదు లక్షల మంది చొప్పున సభ్యుల్ని చేర్చడం లక్ష్యంగా తలైవా రజనీ నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టుగా అడుగుల వేగాన్ని పెంచారు. చెన్నైలో శుక్రవారం మక్కల్ మండ్రం ఏర్పాటు కాగా, ఇక అన్ని జిల్లాల్లో ఈ మండ్రం విస్తరించేందుకు చర్యలు చేపట్టారు.
రాజకీయ పార్టీ ఏర్పాటు కసరత్తుల్లో బిజీబిజీగా ఉన్న రజనీకాంత్, ముందుగా తన అభిమానుల్ని ఏకం చేస్తూ, మద్దతుదారుల్ని, ప్రజల్ని ఆకర్షించే విధంగా రజనీ మక్కల్ మండ్రంను కథానాయకుడు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో సభ్యులను చేర్చేందుకు అభిమాన లోకం ఉరకలు పరుగులు తీస్తూ వస్తున్నాయి. అదే సమయంలో అభిమానులకు ఎలాంటి పదవులు ఆ మండ్రంలో లేని దృష్ట్యా, అందుకు తగ్గ కార్యాచరణపై రజనీ దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా రజనీ మక్కల్ మండ్రంకు కార్యవర్గాలను ప్రకటించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తూ వస్తున్నారు. ఇందులో మైనారిటీలు, దళిత సామాజికవర్గానికి చెందిన వారికి పెద్ద పీట వేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాల మేళవింపుతో ఈ కార్యవర్గాలు ఉండే విధంగా చర్యలు తీసుకునే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా జిల్లాకు కనీసం ఐదు లక్షల మంది సభ్యుల్ని ఈ మండ్రంలో చేర్పించడం, ఈ లక్ష్యాన్ని జిల్లాల్లో చేరిన అనంతరం పార్టీ ప్రకటనను రజనీ చేసే అవకాశాలు ఉన్నట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ ఐదులక్షల మంది ద్వారా పార్టీ సభ్యత్వాన్ని మరింత విస్తృతం చేయడానికి వీలు ఉంటుందన్న భావనతో రజనీ అడుగుల వేగంగా సాగుతున్నట్టు చెబుతున్నారు.
చెన్నైలో మక్కల్ మండ్రం: ఇక, శుక్రవారం చెన్నైలో మక్కల్ మండ్రంను ఏర్పాటు చేశారు. చేట్‌పేట్‌లోని మంగళాపురంలో ఈ మండ్రంను ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. రజనీ మక్కల్ మండ్రం నిర్వాహకులు రాందాసు, సూర్య, రవి, రజనీ సెల్వం ఇందులో పాల్గొన్నారు. ఇక, తిరుప్పూర్‌లోని రజనీ అభిమానుల్ని ఏకం చేస్తూ సమావేశం సాగింది. రజనీ మక్కల్ మండ్రంకు తిరుప్పూర్‌లో ఇప్పటి వరకు రెండున్నర లక్షల మంది సభ్యులు చేరినట్టు, మరో రెండున్నర లక్షల్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అభిమానులు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment