
పూజా హెగ్డే(Pooja Hegde ).. మొన్నటి వరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. కానీ ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.. కొత్తగా వచ్చిన హీరోయిన్లు దూసుకెళ్లడంతో కాస్త వెనుకబడింది. దీంతో టాలీవుడ్‌ని వదిలేసి బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఈ పొడుగు కాళ్ల సుందరికీ నిరాశే ఎదురైంది. దీంతో పూజాకి అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు లభించట్లేదు. కోలీవుడ్‌లో మాత్రం రెండు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది. దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగణ్’తో పాటు కాంచన 4లోనూ పూజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ రెండు చిత్రాలు తప్ప పూజా చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఇలాంటి తరుణంలో పూజాగా ఓ ‘సూపర్’ చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేయబోతుందట.
‘కావాలయ్యా’తరహాలో ..
రజనీకాంత్(Rajinikanth ) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’(Coolie Movie) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. ఆ పాటకి పూజా హెగ్డేతో స్టెప్పులేయించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం పూజాని సంప్రదించారట. పాట నచ్చడంతో పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. రజనీకాంత్‌తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నాడని సమాచారం.
పూజాకి కొత్తేమి కాదు
స్పెషల్ పాటల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేమి కాదు.హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్‌ని ఉర్రూతలూగించింది. ఆ పాటకి పూజా వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్ 3లోనూ పూజా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్‌తో కలిసి ‘స్పెషల్’ స్టెప్పులేసేందుకు పూజా రెడీ అయింది. ఇక కూలీ విషయానికొస్తే.. లోకేశ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజనీ సరికొత్తగా కనిపించబోతున్నాడట. ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ నెలలో ఈప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment