Anbumani Ramadoss
-
కరోనా: ఇంట్లోనే చికిత్స మంచిది కాదు
చెన్నై : కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, పీఎంకే రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రాందాస్ అభిప్రాయపడ్డారు. కేసుల సంఖ్య పెరుగుతుందని ఇంటికి పంపించడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తె అవకావం ఉందని పేర్కొన్నారు. చాలామంది ఇళ్లలో ఐసోలేషన్ సదుపాయాలు ఉండవని దీని వల్ల సమస్య మరింత తీవ్రం అవుతుందని తెలిపారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు నిండిపోయాయని, కొత్తగా వైరస్ సోకిన వారు ఇళ్లలోనే ఉండి చికిత్స పొందాలన్న తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులు షాక్‌కి గురిచేశాయన్నారు. (49 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా) చెన్నైలోని కళాశాలలు, హాస్టళ్లు, హాళ్ళు ఇండోర్ స్టేడియంలను గుర్తించి కరోనా బాధితులకు ట్రీట్మెంట్ అందించాలని అన్బుమణి రాందాస్ రాష్ట్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. దీని వల్ల రోగులను ఇంటికి పంపించకుండా నిత్యం వైద్యుల సంరక్షణలో చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్న కొందరి ఇళ్లలో భౌతిక దూరం పాటించడం కూడా కష్టమైన అంశమేనన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ బాధితుల్ని ఇంటికి పంపిస్తే మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. (జ్వరం, గొంతు నొప్పితో హోం ఐసోలేషన్‌లో కేజ్రీవాల్) -
అన్బుమణి రాందాస్‌కు గుండెపోటు..!
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ సభ్యుడు అన్బుమణి రాందాస్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు. పీఎంకే యూత్వింగ్ అధ్యక్షుడిగా ఉన్న అన్బుమణి రాందాస్ ప్రస్తుతం తమిళనాడులోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. -
‘జయలలితకు భారతరత్న ఇవ్వకూడదు’
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను పీఎంకే యూత్వింగ్ నాయకుడు అన్బుమణి రాందాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి మచ్చలేని సమగ్ర వ్యక్తిత్వం, దేశ అభివృద్ధికి నిస్వార్థ కృషి చేసినవారికే ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని, ఈ పురస్కారం పొందే అర్హత జయలలితకు లేదని ఆయన పేర్కొన్నారు. జయలలిత 15 అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారని, ఆమెను నిర్దోషిగా వదిలేసిన కేసుకు సంబంధించి అప్పీల్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని రాందాస్ ’’ద హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే ఏకవ్యక్తి పార్టీ కావడంతో జయలలిత మృతితో తమిళనాడులో కొంత రాజకీయ శూన్యం ఏర్పడిందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రానున్న నాలుగున్నరేళ్లు అధికారంలో నిలుపాలన్న తాపత్రయంతోనే ఆ పార్టీ నేతలు శశికళకు అండగా నిలుస్తున్నారని అన్నారు. నిజానికి శశికళకు ప్రజామద్దతు లేదని చెప్పారు. జయలలిత ఏనాడు ఆమెను తన రాజకీయ వారసురాలిగా పరిగణించలేదని, ఒకవేళ పరిగణించి ఉంటే ఈపాటికే ఆమెకు పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చి ఉండేవారని వ్యాఖ్యానించారు. -
కుట్రతో ముంచేశారు!
టీనగర్: ఎన్నికల వ్యాపారంలో ఓడిపోయామని, రెండు ద్రావిడ పార్టీలు పథకం ప్రకారం ముంచేశాయని పీఎంకే యువజన సంఘం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల వ్యాపారంలో ఓడిపోయామని, ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచివున్నామన్నారు. లోకాయుక్త చట్టాన్ని ప్రవేశపెడతామని తాము ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని అన్నాడీఎంకే, డీఎంకేలు తమ మేనిఫెస్టోలోను పేర్కొన్నాయన్నారు. మద్యనిషేధాన్ని అమలు చేస్తామన్న నినాదాన్ని డిఎంకే కూడా ప్రకటించిందన్నారు. దీంతో పథకం ప్రకారం ద్రావిడ పార్టీలు తనను ఓడించాయన్నారు. అయినప్పటికీ ప్రజల మనస్సుల్లో నిలిచివున్నామన్నారు. తాను కేంద్ర మంత్రిగా వున్న సమయంలో ధర్మపురి జిల్లాలో కొత్త రైల్వే పథకాలు ప్రవేశపెట్టానని అన్నారు. నగదు అందుకోకుండా పీఎంకేకు ఓటు వేసిన 23 లక్షల మంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని, మరికొన్ని రోజుల్లో పార్టీ నిర్వాహక కమిటీ సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. పీఎంకేకు పెరిగిన ఓట్ల శాతం: రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి పతనం కగా పీఎంకేకు ఇబ్బంది లేకుండా పోయింది. 2011 ఎన్నికల్లో పీఎంకే 5.23 శాతం ఓట్లు పొందింది. ఈ దపా పిఎంకేకు 5.30 శాతం ఓట్లు లభించాయి. పీఎంకే ఓటు బ్యాంకులో 0.07 ఓట్లు పెరిగాయి. ఉత్తర జిల్లాలలో పీఎంకే అభ్యర్థులు 88 శాతం వన్నియర్ల ఓట్లను పొందినట్లు పరిశీలనలో తేలింది. -
'తమిళనాడులో పోలింగ్ వాయిదా వేయండి'
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి పీఎంకే నేత అన్బుమణి రాందాస్ విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని, సోమవారం(మే 16) జరగనున్న ఎన్నికల పోలింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. 'తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు పంచారు. వీరి నామినేషన్లు రద్దు చేసి ఎన్నికల పోలింగ్ ను తాత్కాలికం గా వాయిదా వేయాల'ని లేఖలో రాందాస్ కోరారు. డబ్బులు పంచుతున్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులను పట్టిచ్చిన తమ అభ్యర్థిపై కేసు పెట్టారని ఆయన ఈసీకి తెలిపారు. -
సినిమా వాళ్లే ముఖ్యమంత్రి కావాలా?
వేలూరు: సినిమా నుంచి వచ్చిన వారే ముఖ్యమంత్రి కావాలా చదివిన వారికి ఒక్కసారి అవకాశం కల్పించాలని పాట్టాలి మక్కల్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రామదాస్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పామాకా ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాల అభ్యర్థుల పరిచయ కార్యక్రమం వేలూరులో శుక్రవారం రాత్రి జరిగింది. అన్బుమణి మాట్లాడుతూ ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రతిఒక్కరిని వేడుకుంటున్నానని ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా రాష్ట్రంలో మార్చి మార్చి పాలన చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అవసరం లే దని రాష్ట్రంలో మార్పు అవసరమని ఆ మార్పు అన్బుమణితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రాష్ర్టంలో ఎవరితోనూ కూటమి పెట్టుకోకుండా పోటీ చేస్తున్న పార్టీ పామాకా మాత్రమే అన్నారు. తమకు ఎవరూ వ్యతిరేకం కాదని రాష్ట్రంలో ఒక్కసారి అన్బుమణికి అవకాశం కల్పించండి, పాలన సక్రమంగా చేయకుంటే రెండేళ్లోనే తాను రాజీనామా చేస్తానన్నారు. జయలలిత ప్రచార సమావేశంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారని ఇందుకు జయలలితపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతున్నా మద్యనిషేధం గురించి పట్టించుకోకుండా ప్రస్తుతం ఎన్నికలు రావడంతో మద్య నిషేధం జపం చేస్తున్నారన్నారు. పామాకా అధికారానికి వస్తే ఒక చుక్క కూడా మద్యం రాష్ట్రంలో ఉండదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని తనకు ఒక్కసారి అవకాశం కల్పించండి, ప్రతి నియోజక వర్గంలోనే తాను పోటీ చేస్తున్నట్లుగా భావించి మామిడి పండు చిహ్నంపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం అభ్యర్థులను పరిచయం చేశారు. వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాలకు చెందిన పామాకా అభ్యర్థులు పాల్గొన్నారు. -
వైఎస్ పాలనే ఆదర్శం
సాక్షితో పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ సాక్షి, చెన్నై: ‘అందరికీ అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందరికీ ఆదర్శనీయుడు. అందుకే తమిళనాడు రైతులకూ అటువంటి పాలనను అందించేందుకు వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని అసెంబ్లీకి పోటీ చేస్తున్నా’ అని పాట్టాలిమక్కల్ కట్చి (పీఎంకే) యువజన విభాగ అధ్యక్షుడు, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో రాందాస్‌ను ‘సాక్షి’ కలిసింది. ఐదు దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్బుమణి అన్నారు. ఈ రెండు పార్టీలు ఎంతటి దుర్భరమైన పాలన అందించినా భరించాల్సిందేనా, తమకు మరో గత్యంతరం లేదా అనేంతగా ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు పీఎంకే ముందుకొచ్చిందన్నారు. రైతన్నలను అక్కున చేర్చుకోవడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఆదర్శమని చెప్పారు. రైతు సంక్షేమం కోసం ఆయన అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఏపీ వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి రూ.18వేల కోట్లు కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పీఎంకే అధికారంలోకి వస్తే ఇదే పద్ధతిని అనుసరిస్తానని రైతులకు చెప్పినట్లు పేర్కొన్నారు. -
ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ ముందుకొచ్చా...
అవకాశం ఇవ్వండి...50 ఏళ్ల అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపిస్తా పీఎంకే పార్టీకి అధికారం ఇవ్వండి హొసూరు :50 ఏళ్ల అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తా, కేంద్రమంత్రిగా పలు దేశాలలో పర్యటించా, తనకు అవకాశమిస్తే రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తా ఆదరించండి అంటూ పీఎంకే పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు, ధర్మపురి ఎం.పి. పీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రామదాస్ కోరారు. మీ ఊరు, మీ అన్బుమణి పేరుతో రాష్ట్రంలోని 32 జిల్లాలో పర్యటిస్తూ వివిద ప్రముఖులతో, పార్టీ నాయకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి మీనాక్షి మహాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రాభివృద్దిపై, జిల్లా సమస్యలపై మాట్లాడారు. క్రిష్ణగిరి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్, జిల్లాలో సెజ్‌లను తీసుకువస్తానని, జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల పాలనలో క్రిష్ణగిరి జిల్లాలో ప్రాథమిక అవసరాలను కూడా తీర్చలేదని, ఈ రెండు ద్రవిడ పార్టీల వల్ల మంచి జరుగలేదని పేర్కొన్నారు. 50 ఏళ్ల ద్రవిడ పార్టీల పాలనలో అవినీతి, లంచగొండితనం వేళ్లూనిందన్నారు. మద్యం ఏరులైపారుతోందన్నారు. తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తామన్నారు. కేంద్ర మంత్రిగా దేశంలో పలు పథకాలను ప్రవేశపెట్టి దేశాధ్యక్షుల మన్ననలు పొందామని, ఇదే తరహాలో రాష్ట్ర అభివృద్ధికి మంచి పథకాలు రూపొందిస్తానని తెలిపారు. క్రిష్ణగిరి జిల్లాలో బడేదలావ్ చెరువు కాల్వ ఏర్పాటు చేసి అన్ని చెరువులకు నీరందిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని ఆరు మండలాలుగా విభజించి అభివృద్ధిని కేంద్రీకరణ చేస్తామని, నాణ్యమైన విద్య అందిస్తామని, రాష్ట్రంలో ఉచిత పథకాలను రద్దు చేస్తామని తెలిపారు. తమిళనాడుకు ద్రవిడ పార్టీల నుంచి మార్పు అవసరముందని, ప్రజలు మార్పును ఆశిస్తున్నారని సూచించారు. కార్యక్రమంలో పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు జీ.కే.మణి తదితరులు పాల్గొన్నారు. -
నేనే సీఎం అభ్యర్థి
- అన్భుమణి స్పష్టీకరణ పీఎంకే ఇప్పటికే తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు... తానే తమిళనాడు సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ యువజన నేత అన్భుమణి రాందాసు స్పష్టం చేశారు. పీఎంకే ఎన్నికల వ్యూహాలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకేలతో చేతులు కలిపే ప్రసక్తే లేదన్న నిర్ణయానికి పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు వచ్చిన విషయం తెలిసిందే. తమ నేతృత్వంలోనే కూటమి అని ప్రకటించి, తమ సీఎం అభ్యర్థిగా తనయుడు, యువజన నేత అన్భుమణి రాందాసు పేరును ప్రకటించేశారు. ప్రజాకర్షణ దిశగా అన్భుమణి రాష్ర్టంలో ఉరుకలు పరుగులు తీస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పీఎంకే మనసు మార్చుకోవచ్చన్న సంకేతాలు బయల్దేరాయి. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలన్నీ ఒకే కూటమి ఏర్పాటుతో ఎన్నికల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం బయల్దేరింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రజా కూటమి ఆవిర్భవించినా, అటు వైపుగా రాందాసు తొంగి చూడ లేదు. ఈ పరిస్థితుల్లో పీఎంకే ప్రజా కూటమి వైపుగా తొంగి చూసే అవకాశాలు కన్పిస్తున్నాయని, డిప్యూటీ ఇచ్చినా సర్దుకునే పరిస్థితులు ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఓ మీడియాకు అన్భుమణి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ ప్రచారానికి బలం చేకూర్చేట్టుగా మారింది. దీంతో మేల్కొన్న అన్భుమణి రాందాసు తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేనే లేదన్న సంకేతాల్ని పార్టీ వర్గాలకు, ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రజా కూటమితో కలసి పనిచేయడానికి సిద్ధం అన్నట్టుగా వచ్చిన వార్తల్ని ఖండించారు. కూటమి పాలనకు సిద్ధం అన్నామే గానీ, కూటమిగా ఇతరులతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అని చెప్పలేదని స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న తపనతో తమ పయనం సాగుతోందని, అంతే గానీ ఇతరులతోకలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, పీఎంకే నేతృత్వంలో పనిచేయడానికి వచ్చే పార్టీలను ఆహ్వానిస్తామని, ఆ కూటమికి తానే సీఎం అభ్యర్థి అని తెలిపారు. -
వైద్యుడి ఆవతారం ఎత్తిన కేంద్ర మాజీ మంత్రి
చెన్నై : పీఎంకే యువజన నేత, ఆ కూటమి సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసు చాలా కాలం తర్వాత వైద్యుడి అవతారమెత్తారు. చేతిలో స్టెతస్కోప్ పట్టుకుని నాడి పట్టి వైద్యుడిగా మందులు, మాత్రుల్ని అందించే పనిలో పడ్డారు. చెన్నైలో తన నేతృత్వంలో పలు చోట్ల స్వయంగా వైద్య శిబిరాల్లో అన్భుమణి మునిగి ఉన్నారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు స్వతహాగా వైద్యుడే. అందుకే యూపీఏ హయంలో ఆయనకు కేంద్రంలో కేబినెట్ హోదాతో ఆరోగ్య శాఖను కట్టబెట్టారు. స్వతహాగా వైద్యుడైన అన్భుమణి ఆ శాఖ మీద పూర్తి పట్టు సాధించారని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజకీయ పయనంలో బిజీగా ఉన్న అన్భుమణి తదుపరి తమిళనాట సీఎం తానే అన్న ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. ప్రజాకర్షణ పయనంలో బిజీగా ఉన్న అన్భుమణి రాందాసు తాజాగా చాలా కాలం అనంతరం వైద్యుడి అవతారం ఎత్తి ఉన్నారు. తెల్ల కోటు ధరించి, చేతిలో స్టెతస్కోప్‌ను పట్టుకుని, రోగుల నాడి పట్టి వైద్య సేవల్ని అందించే పనిలో పడ్డారు. పీఎంకే యువజన విభాగం నేతృత్వంలో చెన్నైలోని వరద బాధిత ప్రాంతాల్లో బుధవారం నుంచి వైద్య శిబిరాల ఏర్పాటు మీద దృష్టి పెట్టారు. ఈ శిబిరాల్లో ఇతర వైద్యులతో పాటుగా తాను సైతం అంటూ అన్భుమణి రోగుల్ని పరీక్షించే పనిలో పడ్డారు. వైద్య సలహాలు ఇస్తూ, మందులు, మాత్రల్ని అందించే పనిలో పడటం గమనార్హం. చాలా కాలం తర్వాత నాడి పట్టి వైద్య సేవల్ని అందిస్తున్న అన్భుమణిని మీడియా కదిలించగా, ప్రజల్ని ఆదుకునేందుకు తాము సైతం అంటూ వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేసి ఉన్నామని వివరించారు. జ్వరం, దగ్గు తీవ్రత ఉంటే, తక్షణం వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. బాగా వేడి చేసిన నీటినే తాగాలని, గంజి స్వీకరించాలంటూ వైద్య సలహాలను అందించారు. ప్రభుత్వం బాధితులకు ప్రకటించిన వరద సాయం కంటి తుడుపు చర్యగా పేర్కొన్నారు. రైతులకు ప్రకటించిన నష్టపరిహారం కూలీలకు ఇవ్వడానికే చాలదని వివరించారు. వరికి రూ. 25 వేలు, చెరకు, అరటి పంటకు రూ. 75 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారానే సహాయకాలను బాధితులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ప్రస్తుతం ప్రకటించిన రూ. ఐదు వేలు నష్టపరిహారం మళ్లీ టాస్మాక్లకే చేరడం ఖాయం అన్నారు. బాధితులకు ఇచ్చే ఈ నగదును మందు బాబులు మళ్లీ టాస్మాక్ మద్యం దుకాణాలకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వరద బాధిత ప్రాంతాల్లోని పేద కుటుంబాలు కుదట పడాలంటే తాత్కాలికంగా టాస్మాక్ మద్యం దుకాణాలను మూసి వేయాలని , కనీసం పదిహేను రోజు పాటైనా మూత వేయడంటూ ప్రభుత్వాన్ని విన్నవించారు. -
కరువైన కొత్త విద్యుత్ పథకాలు
వేలూరు: అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఎటువంటి నూతన విద్యుత్ పథకాలు లేవని పార్లమెంట్ సభ్యులు అన్బుమణి రామదాస్ తెలిపారు. శుక్రవారం వేలూరు జిల్లా పాట్టాలి మక్కల్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఫిబ్రవరి 15న సేలంలో జరిగిన పామాక పార్టీ సర్వసభ్య సమావేశంలో తనను 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్ ప్రకటించారన్నారు. తాము అధికారానికి వచ్చిన ఆరు నెలల్లోనే సేవా హక్కు చట్టం, లోకాయుక్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఉచిత విద్యతో పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి సంతకంగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామన్నారు. మద్యం వల్లనే తమిళనాడులో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని 32 జిల్లాలో మెడికల్ కళాశాలలు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా వేలూరు జిల్లాను రెండుగా చేసి వేలూరు కేంద్రంగా ఒక జిల్లాగాను, తిరుపత్తూరు కేంద్రంగా మరో జిల్లాను విభజిస్తామన్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు జన్మదినోత్సవం కోసం ఆలయాల్లో పూజలు, యాగా లు చేసుకుంటూ కాలం గడుపుతున్నారే తప్పా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. 50 సంవత్సరాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పాలించాయని వీటితో ప్రజలు విసిగి వేసారి పోయారని ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారన్నారు. ఈ రెండు పార్టీలు మినహా ఇతర పార్టీలను పామాకలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీకే మణి, మాజీ కేంద్ర మంత్రులు ఎన్టీ షణ్ముగం, వేలు, జిల్లా కార్యదర్శి గుణశేఖరన్, మాజీ ఎమ్మెల్యే ఇళవయగన్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్బుమణికి అవకాశం
సాక్షి, చెన్నై:పీఎంకే సీఎం అభ్యర్థిగా అన్బుమణి రాందాసు పేరును ఆ పార్టీ మహానాడులో ప్రకటించారు. ఆయన నేతృత్వంలో ఎస్డీఏ కూటమి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. పార్టీ పరంగా తన కు బాధ్యతలు పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు, ప్రజల్ని కలుసుకునేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు అన్బుమణి రాందాసు సిద్ధం అవుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కూటముల్ని మార్చి మార్చి డిపాజిట్లు గల్లంతు చేసుకోవడంతో పాటుగా తన వన్నియర్ సామాజిక వర్గం చేత కూడా చీదరించుకోవాల్సిన పరిస్థితి పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుకు ఏర్పడింది. ఇక ఎవరి గొడుగు నీడన చేరకుండా, తన నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ మేరకు సమూహ జననాయగ కూట్టని (సోషల్ డెమోక్రటిక్ అలయన్స్-ఎస్డీఏ)ను ఏర్పాటు చేశారు. చిన్నా చితకా పార్టీలను కలుపుకుంటూనే, రాష్ర్టంలో మా ర్పు తమ ద్వారానే సాధ్యం అన్న నినాదాన్ని అందుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా తమ నేతృత్వంలో ఏర్పడే కూటమికి సీఎం అభ్యర్థిగా అన్బుమణి పేరును ప్రకటిస్తూ రాందాసు నిర్ణయం తీసుకున్నారు. తీర్మానం : సేలంలో ఆదివారం రాత్రి పీఎంకే మహానాడు జరిగింది. బ్రహ్మాండ వేదికపై జరిగిన ఈ మహానాడుకు తమ బలాన్ని చాటే రీతిలో పీఎంకే వర్గాలు తరలి వచ్చాయి. ఇందులో రాందాసు ప్రసంగిస్తూ, రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని శివాలెత్తారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా పీఎంకే ఉద్యమిస్తోందని, అధికారంలోకి రాగానే, తొలి సంతకం మద్య నిషేధం మీదే ఉంటుందని ప్రకటించారు. ఒకరి గొడుగు నీడ చేరాల్సిన అవసరం ఇక పీఎంకేకు లేదని, రాష్ట్రంలో మార్పు లక్ష్యంగా పీఎంకే ముందుకు సాగుతున్నదన్నారు. తమ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తమ పార్టీ సీఎం అభ్యర్థిగా అన్బుమణి రాందాసు పేరును పార్టీ నిర్ణయించిందని, పీఎంకే సీఎం అభ్యర్థి అన్బుమణి రాందాసు అని ప్రకటిస్తూ తీర్మానం చేశారు. తన పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో అన్భుమణి ఆనందానికి అవధులు లేవు. ఆయనను పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, అధ్యక్షుడు జీకే మణి, వన్నియర్ సంఘం నేత కాడు వెట్టి గుర్రు అభినందనలతో ముంచెత్తారు. తన పై బాధ్యతలు పెరగడంతో ఇక పార్టీ బలోపేతం లక్ష్యంగా రాష్ర్టవ్యాప్తంగా పర్యటించనున్నట్టు, అన్ని సామాజిక వర్గాల్ని కలుపుతూ బలోపేతం ధ్యేయంగా, ప్రభుత్వ ఏర్పాటు కాంక్షతో ముందుకు సాగుతున్నట్టు అన్బుమణి రాందాసు ప్రకటించారు. -
డాడీ కన్నా మోడీపైనే మోజు
పీఎంకే నేత అన్భుమణికి డాడీ రాందాస్ కన్నా మోడీపైనే ఎక్కువ మోజు ఉందని ప్రముఖ సినీ నటి వింధ్య ఆరోపించారు. తిరువళ్లూరు అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్‌కు మద్దతుగా సినీ నటి వింధ్య మంగళవారం రాత్రి తిరువళ్లూరులోని బజా రు వీధిలో ప్రచారం నిర్వహించారు. హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినవింధ్య పీఎంకే నేత అన్భుమణి రాందాస్ తీరుపై నిప్పులు చెరిగా రు. అన్భుమణికి డాడీ కన్నా మోడీపైనే ఎక్కువ మోజు ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించే సత్తా అన్నాడీఎంకేకు మాత్రమే ఉంద ని ఆమె వివరించారు. రాష్టంలో ప్రతి పక్షంలో ఉన్న డీఎంకేలో నిజమైన కార్యకర్తలకు, పార్టీకి సేవ చేసిన వారికి న్యాయం జరగటం లేదని ఆరోపించిన ఆమె సినీ నటి ఖుష్బుకు సరైన స్థానం ఇవ్వలేదన్న కారణంగా కరుణానిధి అలిగారని వ్యంగ్యంగా విమర్శించారు. శ్రీలంకలోని తమిళుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్‌ను, మతతత్వ పార్టీ బీజేపీని దళితుల అభివృద్ధి కోసం ఏనాడూ శ్రమించని వీసీకే పార్టీ నేతలను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కూటమి ఖరారు
బీజేపీ జాబితా విడుదల 25 స్థానాలు ఖాయమని పార్టీ ధీమా ఒకే వేదికపై రాజ్‌నాథ్, విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్ చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీలో సీట్ల కేటాయింపులో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి ఎట్టకేలకు కూటమి ఖరారైంది. సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగడంతో అభ్యర్థుల జాబితా గురువారం విడుదలైంది. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడింది. అయితే అదే స్థాయిలో తలనొప్పులకు కారణమైంది. ఎవరికి వారు ప్రతిపక్ష పార్టీలుగా చలామణి అవుతున్న డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మిత్రపక్షాలుగా మారిపోక తప్పలేదు. కూటమి ధర్మం ప్రకారం మిత్రులైనా పాత వైరుధ్యాలను పక్కన పెట్టలేకపోయిన ఆ పార్టీ నేతలంతా సీట్ల కోసం పట్టుపట్టారు. ఒకరు కోరిన స్థానాన్ని మరొకరు కోరడమే కాదు, చివరికి బీజేపీ ఎంచుకున్న స్థానాల కోసం సైతం పట్టుపట్టారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కూటమిలో చేరడానికే ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై సీట్ల కోసం పట్టుబట్టారు. ఒక దశలో కూటమి చీలిపోతుందని, పీఎంకే,కూటమి ఖరారు డీఎండీకేలు వైదొలగిపోతాయనే ప్రచారం జరిగింది. మిత్రులకు నచ్చజెప్పేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర రావు, జాతీయ నేత ఇల గణేశన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 10 రోజుల క్రితమే వెల్లడి కావాల్సిన జాబితా వాయిదాపడుతూనే వచ్చింది. సారొచ్చారు పోలింగ్‌కు నెల రోజులుండగా బీజేపీ కూటమి జాబితాలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్న రాజ్‌నాథ్ వచ్చీ రాగానే మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడ్డారు. విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. స్వల్ప వ్యవధిలోనే అందరి మధ్య సఖ్యత సాధ్యమవుతుందని ఆశించిన రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి మిత్రులు చుక్కలు చూపించారు. సీట్ల ఖరారు చేసుకుని 12 గంటలకు ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో వెల్లడి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. మీడియా వారు అరగంట ముందుగానే అంటే 11.30 గంటలకే చేరుకోగా ప్రతి అరగంటకు ఒకసారి పొడిగిస్తూ వచ్చారు. ఆ తరువాత అందరూ భోజనాలు చేసి రండని ప్రకటించారు. మిత్రులతో చర్చలు కొలిక్కిరాకపోవడమే మీడియా సమావేశం గంటలకొద్దీ వాయిదాకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. సాయంత్రం 4 గంటలు దాటుతుండగా రాజ్‌నాథ్ సింగ్ వచ్చి మీడియాతో మాట్లాడారు. 25 స్థానాల్లో గెలుపు ఖాయం బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏర్పడిన బలమైన కూటమి అభ్యర్థులు 25 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మరో రెండుసార్లు తమిళనాడులో పర్యటిస్తారని చెప్పారు. తమిళనాడు ప్రజల సమస్యలను, ముఖ్యంగా శ్రీలంక, తమిళ జాలర్ల వివాదాన్ని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ పాలనలో ఒక్క తమిళనాడు మాత్రమే కాదు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీరుతాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద కూటమిగా ఏర్పడటం వల్ల మిత్రపక్షాల్లో కొన్ని అసంతృప్తులు సహజమని అన్నారు. అయితే అవన్నీ వైదొలిగాయని, కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి పార్టీ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుందని చెప్పారు. డీఎండీకే 14, బీజేపీ 8, పీఎంకే 8, ఎండీఎంకే 7, ఐజేకే, కేఎండీకే ఒక్కో స్థానం కేటారుుస్తూ జాబితా ఖరారైందని ఆయన తెలిపారు. తమిళనాడు జాబితాను అధికారికంగా ఆయన విడుదల చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన బావమరిది సుదేష్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ రాజ్నాథ్తోపాటూ వేదికకెక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు.