కరువైన కొత్త విద్యుత్ పథకాలు | droughted new power scheme | Sakshi
Sakshi News home page

కరువైన కొత్త విద్యుత్ పథకాలు

Published Sat, Mar 7 2015 2:12 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM

droughted new power scheme

వేలూరు: అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఎటువంటి నూతన విద్యుత్ పథకాలు లేవని పార్లమెంట్ సభ్యులు అన్బుమణి రామదాస్ తెలిపారు. శుక్రవారం వేలూరు జిల్లా పాట్టాలి మక్కల్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఫిబ్రవరి 15న సేలంలో జరిగిన పామాక పార్టీ సర్వసభ్య సమావేశంలో తనను 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్ ప్రకటించారన్నారు.

తాము అధికారానికి వచ్చిన ఆరు నెలల్లోనే సేవా హక్కు చట్టం, లోకాయుక్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఉచిత విద్యతో పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి సంతకంగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామన్నారు. మద్యం వల్లనే తమిళనాడులో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని 32 జిల్లాలో మెడికల్ కళాశాలలు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.

అదే విధంగా వేలూరు జిల్లాను రెండుగా చేసి వేలూరు కేంద్రంగా ఒక జిల్లాగాను, తిరుపత్తూరు కేంద్రంగా మరో జిల్లాను విభజిస్తామన్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు జన్మదినోత్సవం కోసం ఆలయాల్లో పూజలు, యాగా లు చేసుకుంటూ కాలం గడుపుతున్నారే తప్పా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.  

50 సంవత్సరాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పాలించాయని వీటితో ప్రజలు విసిగి వేసారి పోయారని ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారన్నారు. ఈ రెండు పార్టీలు మినహా ఇతర పార్టీలను పామాకలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీకే మణి, మాజీ కేంద్ర మంత్రులు ఎన్‌టీ షణ్ముగం, వేలు, జిల్లా కార్యదర్శి గుణశేఖరన్, మాజీ ఎమ్మెల్యే ఇళవయగన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement