అవకాశం ఇవ్వండి...50 ఏళ్ల అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపిస్తా
పీఎంకే పార్టీకి అధికారం ఇవ్వండి
హొసూరు :50 ఏళ్ల అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తా, కేంద్రమంత్రిగా పలు దేశాలలో పర్యటించా, తనకు అవకాశమిస్తే రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తా ఆదరించండి అంటూ పీఎంకే పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు, ధర్మపురి ఎం.పి. పీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రామదాస్ కోరారు. మీ ఊరు, మీ అన్బుమణి పేరుతో రాష్ట్రంలోని 32 జిల్లాలో పర్యటిస్తూ వివిద ప్రముఖులతో, పార్టీ నాయకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి మీనాక్షి మహాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రాభివృద్దిపై, జిల్లా సమస్యలపై మాట్లాడారు. క్రిష్ణగిరి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్, జిల్లాలో సెజ్‌లను తీసుకువస్తానని, జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల పాలనలో క్రిష్ణగిరి జిల్లాలో ప్రాథమిక అవసరాలను కూడా తీర్చలేదని, ఈ రెండు ద్రవిడ పార్టీల వల్ల మంచి జరుగలేదని పేర్కొన్నారు. 50 ఏళ్ల ద్రవిడ పార్టీల పాలనలో అవినీతి, లంచగొండితనం వేళ్లూనిందన్నారు. మద్యం ఏరులైపారుతోందన్నారు.
తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తామన్నారు. కేంద్ర మంత్రిగా దేశంలో పలు పథకాలను ప్రవేశపెట్టి దేశాధ్యక్షుల మన్ననలు పొందామని, ఇదే తరహాలో రాష్ట్ర అభివృద్ధికి మంచి పథకాలు రూపొందిస్తానని తెలిపారు. క్రిష్ణగిరి జిల్లాలో బడేదలావ్ చెరువు కాల్వ ఏర్పాటు చేసి అన్ని చెరువులకు నీరందిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని ఆరు మండలాలుగా విభజించి అభివృద్ధిని కేంద్రీకరణ చేస్తామని, నాణ్యమైన విద్య అందిస్తామని, రాష్ట్రంలో ఉచిత పథకాలను రద్దు చేస్తామని తెలిపారు. తమిళనాడుకు ద్రవిడ పార్టీల నుంచి మార్పు అవసరముందని, ప్రజలు మార్పును ఆశిస్తున్నారని సూచించారు. కార్యక్రమంలో పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు జీ.కే.మణి తదితరులు పాల్గొన్నారు.