నేనే సీఎం అభ్యర్థి
- అన్భుమణి స్పష్టీకరణ
పీఎంకే ఇప్పటికే తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు... తానే తమిళనాడు సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ యువజన నేత అన్భుమణి రాందాసు స్పష్టం చేశారు. పీఎంకే ఎన్నికల వ్యూహాలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకేలతో చేతులు కలిపే ప్రసక్తే లేదన్న నిర్ణయానికి పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు వచ్చిన విషయం తెలిసిందే. తమ నేతృత్వంలోనే కూటమి అని ప్రకటించి, తమ సీఎం అభ్యర్థిగా తనయుడు, యువజన నేత అన్భుమణి రాందాసు పేరును ప్రకటించేశారు.
ప్రజాకర్షణ దిశగా అన్భుమణి రాష్ర్టంలో ఉరుకలు పరుగులు తీస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పీఎంకే మనసు మార్చుకోవచ్చన్న సంకేతాలు బయల్దేరాయి. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలన్నీ ఒకే కూటమి ఏర్పాటుతో ఎన్నికల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం బయల్దేరింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రజా కూటమి ఆవిర్భవించినా, అటు వైపుగా రాందాసు తొంగి చూడ లేదు.
ఈ పరిస్థితుల్లో పీఎంకే ప్రజా కూటమి వైపుగా తొంగి చూసే అవకాశాలు కన్పిస్తున్నాయని, డిప్యూటీ ఇచ్చినా సర్దుకునే పరిస్థితులు ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఓ మీడియాకు అన్భుమణి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ ప్రచారానికి బలం చేకూర్చేట్టుగా మారింది. దీంతో మేల్కొన్న అన్భుమణి రాందాసు తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేనే లేదన్న సంకేతాల్ని పార్టీ వర్గాలకు, ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను ప్రజా కూటమితో కలసి పనిచేయడానికి సిద్ధం అన్నట్టుగా వచ్చిన వార్తల్ని ఖండించారు. కూటమి పాలనకు సిద్ధం అన్నామే గానీ, కూటమిగా ఇతరులతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అని చెప్పలేదని స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న తపనతో తమ పయనం సాగుతోందని, అంతే గానీ ఇతరులతోకలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, పీఎంకే నేతృత్వంలో పనిచేయడానికి వచ్చే పార్టీలను ఆహ్వానిస్తామని, ఆ కూటమికి తానే సీఎం అభ్యర్థి అని తెలిపారు.