సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ మార్కు రాజకీయం మళ్లీ స్టార్టయింది. ఎన్నికల ఫలితాల్లో పార్టీ గెలిచిన వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక తంతు వాయిదాపడింది. సీఎం పదవి ఎవరికివ్వాలనే పంచాయితీ అంత ఈజీగా తేలేలా కనిపించడం లేదు. సీఎం ఎంపిక కోసం సోమవారం హైదరాబాద్‌లో జరగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో జరిగిన ఎమ్మెల్యేల మీటింగ్‌లో సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాలేదు.
ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఎం ఎవరనేది నిర్ణయించే బాధ్యతను ఎమ్మెల్యేలలంతా కలిసి ఏకవాక్య తీర్మానం ద్వారా అధిష్టానానికి అప్పగించారు. దీంతో సీన్ ఒక్కసారిగా ఢిల్లీకి మారిపోయింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్యేల సమావేశం నుంచి అలిగి బయటికి వెళ్లిన భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ వెళ్లి లాబీయింగ్..?
సీఎం పదవిపై ఇప్పటికే రేసులో ఉన్న అగ్రనేతలెవరూ పట్టు వీడటం లేదని తెలుస్తోంది. తామూ పదవికి అర్హులమేనని ఢిల్లీ వెళ్లి హై కమాండ్‌కు మొర పెట్టుకోనున్నట్లు సమాచారం. దీంతో రేసులో ఉన్నవారందరి పేర్లు పరిగణలోకి తీసుకుని త్వరలో ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందనుకుని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ అధికారులు, పోలీసులు పార్టీ నుంచి ఏ నిర్ణయం రాకపోవడంతో రాజ్‌భవన్ నుంచి ఇవాళ సాయంత్రం వెళ్లిపోయారు.
ఎల్లా హోటల్‌లోనే ఎమ్మెల్యేలు..
అయితే సీఎం ఎవరనేదానిపై మంగళవారం క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశమై చర్చించనున్నారు. భేటీ తర్వాత సీఎం ఎవరనే నిర్ణయాన్ని ఖర్గే వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సోమవారం సమావేశమైన గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బస చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఫైనలయ్యేదాకా వారంతా అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం.
ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment