![Telangana Congress Lp Leader Selection Postponed - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/4/TS-CM-01.jpg.webp?itok=oZvwGpq7)
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.దీంతో ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లేనని సమాచారం.
కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల(సీఎల్పీ)సమావేశం సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఎల్లాహోటల్‌లో జరిగింది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎల్పీ నేతల ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత పేరుపై క్లారిటీ వస్తుందని అంతా ఎదురు చూశారు. కానీ చివరకు డీకే శివకుమార్ సహా నలుగురు ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక వాయిదా పడింది.
మరోపక్క తెలంగాణ రెండవ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ మూడో శాసనసభను గెజిట్‌లో నోటిఫై చేశారు. జీఏడీ అధికారులు కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ని కూడా రెడీ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎల్పీ నేత ఎవరో వెల్లడించిన వెంటనే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావించారు. చివరకు పరిశీలకులు ఢిల్లీ వెళ్లడంతో సీఎల్పీనేత ఎంపికతో పాటు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ లేనట్లేనని తేలిపోయింది. సీఎం ప్రమాణ స్వీకారం వాయిదాపడిందని తెలియడంతో రాజ్‌భవన్ నుంచి పోలీసులు, అధికారులు వెళ్లిపోయారు.
ఇదీచదవండి..తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment