
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు కొన్ని గంటల్లో తెరపడనుంది. సీఎం ఎవరన్నది ఖరారు చేసేందుకు బుధవారం(ఫిబ్రవరి 19) ఉదయం ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. సీఎం ఎవరన్నది ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. ఖరారు తర్వాత సీఎం ఎవరన్నది సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు.
అనంతరం రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోనున్నారు. బీజేఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, ఓపి దంకర్‌ను అధిష్టానం నియమించింది. బీజేఎల్పీ నేతను ఎన్నుకునేందుకుగాను వీరు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతారు. బీజేఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత పార్టీ ముఖ్య నేతలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు.
సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ),రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్),అజయ్ మహావార్ (ఘోండా) ఉన్నారు. అయితే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందున్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పర్వేష్‌వర్మకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని సమాచారం.ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన వారిలో పదిమంది జాట్ ఎమ్మెల్యేలుండడం పర్వేష్‌కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
కాగా గురువారం 11 గంటలకు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు.రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రమాణ స్వీకారం కోసం రామ్‌లీలా మైదానంలో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. మొత్తం 150 మంది ముఖ్య అతిథులకు ఆహ్వానం పలికారు.ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. ప్రమాణస్వీకారానికి లక్ష మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment