BJLP
-
రేవంత్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి హనీమూన్ పీరియడ్ ముగిసి కౌంట్‌డౌన్ మొదలైందని... వచ్చే ఏడాది జూన్–డిసెంబర్ల మధ్య ఆయన పదవి పోవడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం చూస్తోందని..కొత్త సీఎంగా ఎవరిని పెట్టాలనే దానిపై రహస్యంగా ఓ కమిటీ అన్వేషణ సాగిస్తోందన్నారు. సీఎం రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారని చెప్పారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయం ఒకేసారి రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్లకు పెంచి భారీగా అవినీతికి ప్లాన్ చేశారని, ఏకపక్షంగా సొంత ఎజెండాతో సెలక్షన్, కరప్షన్, బ్లాక్‌మెయిలింగ్ వంటి వాటికి దిగడం దీనికి కారణమని ఆరోపించారు.మూసీ, హైడ్రా కూల్చివేతలతో పేదల్లో కాంగ్రెస్ అభాసుపాలు కావాల్సి వస్తోందని హైకమాండ్ ఆందోళన చెందుతోందన్నారు. శుక్రవారం మహేశ్వర్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొందరు సీనియర్ మంత్రులు హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్మెంట్ల మీద రేవంత్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు తమకు సమాచారం ఉందన్నారు. మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని మూడొంతులు పెంచి తన స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నారని, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని చెప్పారు. రేవంత్ ఏకపక్ష ధోరణిని కూడా పలువురు నేతలు అంగీకరించడం లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాకుండా రేవంత్‌రెడ్డి తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా హైకమాండ్‌కు చేరాయని తెలిపారు.కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు కూడా సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారని, కూల్చివేతలపై నివేదిక సమర్పించారని చెప్పారు. దీనిపై పరిశీలనకు సోనియా సూచనలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఫోన్ చేస్తే రేవంత్ స్పందించలేదన్నారు. ఫోన్ ఎత్తకపోగా హైకమాండ్‌కు తాను స్పందించలేదని రేవంత్‌రెడ్డి పేర్కొనడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. సీనియర్ మంత్రులు, పార్టీ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉందని తెలుస్తోందన్నారు. రేవంత్ వ్యతిరేకవర్గం ఢిల్లీలో అధిష్టానం వద్ద గట్టిగా లాబీయింగ్ నిర్వహిస్తోందన్నారు.ఈ కారణంగానే ఇప్పటికే ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లినా, రేవంత్‌కు రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణ వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామంటూ ఫిరాయింపులకు రేవంత్‌రెడ్డి తెరతీశారని తెలిపారు. అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు మళ్లీ కేసీఆర్‌తో టచ్‌లోకి వెళ్లారన్నారు. దీంతో పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశానికి భిన్నంగా ఫిరాయింపులు చేపట్టడంపై హైకమాండ్ ఆగ్రహంతో ఉందని చెప్పారు. ఈ పరిణామాల నుంచి బీఆర్ఎస్ లాభపడుతుందా అనే ప్రశ్నకు లోక్‌సభ ఎన్నికల్లో డకౌట్ అయ్యి ఏం చేయగలుగుతుందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్–బీఆర్ఎస్ ఒక్కటైనా.. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. -
17ను విమోచన దినంగా నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష సమావేశం డిమాండ్ చేసింది. రైతు భరోసా, రుణ మాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న బీజేఎల్పీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేసింది. గురువారం అసెంబ్లీ ఆవరణలోని బీజేఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీలు డా.కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, అర్వింద్, డీకే అరుణ, గోడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, డా.పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పాటిల్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అర్హులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని, అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించాలని, ‘హైడ్రా’నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే డిమాండ్లను ఈ సమావేశం ఫ్రభుత్వం ఎదుట పెట్టింది. దీంతో పాటు పార్టీపరంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, దేవాలయ భూముల రక్షణకు పోరాడాలని, బీజేపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వరద నిధుల వ్యయంపై శ్వేతపత్రం: ఏలేటి డిమాండ్ వరద నష్టానికి సంబంధించి ఇప్పటివరకు చేసి న పనులు, ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరద సహాయంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేఎల్పీ భేటీ అనంతరం ఎంపీ అ ర్వింద్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వరద సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. కాగా, అరికెపూడి గాం«దీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వలసదారుడు, పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు పాతబస్తీకి వెళ్లడానికి భయపడుతున్నారని, మూసీ నది పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను దమ్ముంటే కూల్చాలని అన్నారు. -
ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము రేవంత్ సర్కార్‌కు లేదా?: ఏలేటి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా పేరుతో లేనిపోని హైక్‌ను సృష్టిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని.. రంగనాథ్ కమిషనరా..? పొలిటికల్ లీడరా..? అంటూ ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారా..?. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.‘‘హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సల్కం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు, పల్ల రాజేశ్వర్ రెడ్డి, మర్తి రాజేశ్వర్‌రెడ్డికి వర్తించవా..?. ఓవైసీకీ ఆరు నెలలు సమయం ఇస్తున్నప్పుడు, మిగతా వారికి, ఎన్ కన్వెన్షన్‌కు ఎందుకు సమయం ఇవ్వలేదు..?. ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి లేదా..?. ఓ వైసీని ఢీకొట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా..?. ఆయన ఇనిస్టిట్యూషన్‌లో మాత్రమే విద్యార్థులున్నారా..?. రంగనాథ్‌కు ఆఫర్ ఇచ్చారేమో అందుకే ఓల్డ్ సిటీలోకి వెళ్లడం లేదు. కేవలం టార్గెట్ చేసి నిర్మాణాలను కుల్చుతున్నారా అనే అనుమానం కలుగుతుంది’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.‘‘కాంగ్రెస్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. వంద శాతం చెరువు కబ్జా అయితే ముట్టుకోమని రంగనాథ్ చెబుతున్నారు. రంగనాథ్ ఏం పొడిచారని ఆయనకు హై సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఈ హైక్ ఏంది..? ఈ హైడ్రా ఏంది అర్థం కావడం లేదు. తీవ్రవాదులను, టెర్రరిస్టులను పట్టుకున్న పోలీస్ అధికారులు ఎంతో మంది ఉన్నారు. వారికిలేని సెక్యూరిటీ రంగనాథ్‌కు ఎందుకు..?. కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే టార్గెట్ పెట్టుకుంటే ఊరుకునేది లేదు. ఓల్డ్ సిటీలోకి వెళ్లేందుకు హైడ్రాకు దారి తెలవడం లేదా..?. డిస్క్రిమినేషన్ పద్ధతి మంచిది కాదు. ఇలాంటి పద్ధతులతో వెళ్తే రంగనాథ్ పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం’’ అంటూ ఏలేటి హెచ్చరించారు.‘‘రంగనాథ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చుకోండి, రాజ్యసభ ఇచ్చుకోండి, కానీ ఇంత హైక్ ఎందుకు చేస్తున్నారు?. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓవైసీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఓవైసీ నిర్మాణాలను ముట్టుకోలేకపోతున్నారు. సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చిన తరువాతే ఇతర చెరువులకు వెళ్ళాలి. పాతబస్తీలో ఎన్ని చెరువులున్నాయి. ఎన్ని ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయినేది డేటా ప్రభుత్వం సేకరించాలి’’ అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
గత ప్రభుత్వంకంటే ఇప్పుడే ఎక్కువ అవినీతి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వంలో కంటే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఎక్కువ అవినీతి, చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. రహస్య జీవోలతో సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఓ బడా కాంట్రాక్టర్‌కు రూ.1,100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకం అమృత్ స్కీమ్‌లో కూడా రూ.3 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బావమరిదికి చెందిన ఓ కంపెనీకి రూ.400 వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చా రని తెలిపారు. ఆయా పనులను 30 నుంచి 35 శాతం తక్కువకు చేసేందుకు ఇతర కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా ఇష్టారీతిన అంచనాలు పెంచి, కావాల్సిన వారికి కాంట్రాక్ట్‌లు ఇచ్చారని విమర్శించారు. ఇటీవల వివిధ పనుల్లో రూ.1,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ్ముడు, బావమరిది భాగస్వామ్యంతో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ధారాదత్తం చేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే కరీంనగర్లో వివిధ కాంట్రాక్ట్‌లలో సీఎం తమ్ముడు భాగస్వామిగా ఉన్నట్టు చెబుతున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో త్వరలో పిలిచే టెండర్లలో కూడా ఓ బడా కంపెనీకి పెద్దపీట వేయబోతున్నారన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతి వ్యవహారాలపై ఈడీ, సీబీఐ విచారణ కోరతామని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
రేవంత్ రెడ్డిపై ఫైర్
-
రేవంత్‌ది ఒకే మాట..నా వంతు ఎంత అనే!
సాక్షి, హైదరాబాద్: అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. కానీ వాస్తవానికి ఎవరైనా రేవంతూ అని మాట్లాడిస్తే తన వంతు ఎంత అని అడుగుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన వాళ్లు కూడా రేవంత్‌ని నీ రేటెంతరెడ్డి అని అడుగుతున్నారంట అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ముందు పెట్టుకొని సెటి ల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. గురువారం పార్టీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న లోలోపల సెటిల్మెంట్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దాని కంటే కూడా కాంగ్రెస్ హయాంలోనే అవినీతి, అరాచకాలు ఎక్కువ జరుగుతున్నా యని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమా లపై నాలుగు నెలలు దాటినా ఒక్కదాని మీద ఎంక్వైరీ పూర్తి అవ్వలేదన్నారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి సెటిల్మెంట్లు చేస్తున్నారని, ఆ క్రమంలోనే కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పజెప్పడం లేదని నిందించారు. రాహుల్ ట్యాక్స్ వసూలు ఎలాగంటే.. రాహుల్‌గాంధీ ట్యాక్స్ వసూలుకు సంబంధించి అనుసరిస్తున్న ఒక విధానాన్ని తాను బయట పెడుతున్నానని మహేశ్వర్‌రెడ్డి వివరించారు. ’’గత ప్రభుత్వం ఓ సంస్థకు నగరం నడిబొడ్డున రూ.1,500 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకు (నెలకు ఎకరానికి రూ.2లక్షల లీజ్‌కు) ఇస్తే దానిని కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రద్దు చేసి అది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మరో జీవో ద్వారా అదే భూమిని అదే సంస్థకు రేవంత్‌రెడ్డి కేటాయించారు.’’ అని ఆరోపించారు ఇందులో భాగంగా రూ.300 కోట్లు తీసుకుని ఢిల్లీకి పంపించిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే వీటికి సంబంధించిన అంశాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ భూమికి సంబంధించే ఇంత కుంభకోణం చేస్తే.. కాళేశ్వరం, ధరణిల్లో ఇంకా ఎంత కుంభకోణం చేస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో ఇంకో అవినీతి బయటపెడతా మరో రెండు రోజుల్లో మరో అవినీతి అంశంపై ఆధారాలతో సహా మీడియా ముందుకి వస్తా నని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. మహేశ్వర్ రెడ్డికి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న భయంతో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయం ఆరో ఫ్లోర్‌లోకి ఎవరినీ రానివ్వకుండా సెక్యూ రిటీ పెంచారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ సెక్యూరిటీ పెంచి ఎవరినీ అనుమతించడం లేదన్న సమాచారం తనకు అందిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భయం పట్టుకుందన్నారు. -
పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదు
సాక్షి హైదరాబాద్: తనపై క్రమశిక్షణా చర్య తీసుకుంటూ పంపించిన నోటీస్‌లో పేర్కొన్నట్లు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ సమాధానమిచ్చారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించనందున తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. సోమవారం ఈ మేరకు పార్టీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సభ్యకార్యదర్శి ఓం పాథక్‌కు లేఖ రాశారు. ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆగస్ట్ 23న రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. 10 రోజుల్లో నోటీస్‌కు సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీ ఆదేశించింది. పీడీయాక్ట్పై అరెస్టయి జైలులో ఉన్నందున సోమవారం నోటీస్‌కు సమాధానమిస్తూ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే.. ‘మతప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్న ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాపై.. ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం సాగిస్తున్న అరాచకాలనే ప్రశ్నించాను తప్ప ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేయలేదు. నేను పంపిన వీడియోలోనూ ఏ మతాన్ని కించపరచలేదు. పార్టీ ఎమ్మెల్యేగా 8 ఏళ్ల కాలంలో ఏనాడూ పార్టీ లైన్ దాటి ప్రవర్తించలేదు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నా. మునావర్ ఫారుఖీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్లను కించపరచలేదు’అని ఈ లేఖలో పేర్కొన్నారు. -
ఆ అవకాశం ఎవరికో? పోటీలో రఘునందన్ రావు, ఈటల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్షనేత(బీజేఎల్పీ)గా ఎవరిని ఎన్నుకుంటారనేది చర్చనీయాంశమవుతోంది. బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. రాజాసింగ్‌తో పాటు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ పార్టీ ఎమ్మెల్యేలు గా ఉన్నారు. పార్టీలో సీనియర్‌గా ఉన్న రఘునందన్‌రావుకు ఈ అవకాశం లభిస్తుందా? లేదా మంత్రిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవమున్న ఈటలకు దక్కుతుందా? అని పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడిగా ఈటలకు మంచి ప్రాధాన్యం లభించడం, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించినందున రఘునందన్ వైపు రాష్ట్ర నాయకత్వం మొగ్గుచూపొచ్చుననే వాదన పార్టీలో వినిపిస్తోంది. చదవండి: ‘సిట్టింగులందరికీ సీట్లు’ -
బడ్జెట్‌పై చర్చను ప్రతిపక్షం ప్రారంభించదా?
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విస్మయం సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌పై చర్చను ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రారంభించాల్సి ఉన్నా, బుధవారం శాసనసభలో చర్చ జరిగిన తీరుపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసంతృప్తిని వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టగా, బుధవారంనాడు దీనిపై చర్చ ప్రారంభమైంది. బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ చర్చను ప్రారంభించడం ఇప్పటిదాకా ఆనవాయితీ. దీని ప్రకారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు చర్చను ప్రారంభించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి బుధవారం సభకు హాజరుకాకపోవడం వల్లనే బీజేపీ సభ్యులు చర్చను ప్రారంభిం చినట్టుగా కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు. కీలకమైన బడ్జెట్ ప్రారంభ చర్చ అవకాశా న్ని మరో పార్టీకి వదిలివేయడంపై ఆ పార్టీ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
అరిగిపోయిన రికార్డు: బీజేఎల్పీ
సాక్షి, హైదరాబాద్: ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అరిగిపోయిన రికార్డులా ఉందని బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని సమస్యలు, ప్రజల ఆకాంక్షలను ఈ ప్రసంగం ప్రతిబింబించలేదని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన విలేకరులో మాట్లాడుతూ ఈ ప్రసంగం మేడిపండు చందంగా ఉందని, కాకిలెక్కలతో కూడుకుని ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికల హామీల అమలుపై కార్యాచరణ గవర్నర్ ప్రసంగంలో లేదని అన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం ఏమి సాధించిందో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు ప్రగతిభవన్‌ను దాటడం లేదని ఎద్దేవా చేశారు. -
సీఎం అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరన్నారు: బీజేఎల్పీ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని తప్పుదోవ పట్టించేలా సమాధానం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌పై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ డిమాండ్ చేసింది. గత నెల 5న అసెంబ్లీలో బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు, సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరంటూ కేసీఆర్ సభను తప్పుదోవ పట్టించారని బీజేఎల్పీ ఆరోపించింది. ఈ మేరకు సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం అసెంబ్లీ కార్యదర్శికి బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్ నోటీసు అందజేశారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల తరహాలోనే 25వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. -
30 రోజులు అసెంబ్లీ
బీజేఎల్పీ డిమాండ్ సమస్యల పరిష్కారం దిశగా చర్చలు ఉండాలని సూచన సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను 30 రోజులపాటు నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. బీజేఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన బుధవారం అసెంబ్లీలోని కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. గురువారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. అనంతరం లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.వి.ఎస్,ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిపై ఆషామాషీగా కాకుండా పరిష్కారం దిశగా చర్చలు జరగాలన్నారు. దీనికోసం సభాకాలాన్ని పొడిగించాలని కోరారు. అన్ని బిల్లులపై సమగ్రంగా చర్చకోసం కోరుతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడానికి బడ్జెట్లో కేటాయింపులుండాలని లక్ష్మణ్ సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, విద్యుత్ చార్జీలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, బీసీలకు కళ్యాణలక్ష్మి, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు, దళితులకు మూడెకరాల భూమి, రైతులకు రుణమాఫీ, పెండింగు ప్రాజెక్టులు, నిరుద్యోగం, కేజీ నుంచి పీజీదాకా ఉచితవిద్య వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వానికి మెజారిటీ ఉందనే సాకుతో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. దీనికోసం అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకుంటూ ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. మహిళలకు పెద్దపీట : లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భేటీ బచావో-భేటీ పడావో, సుకన్య యోజన, గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటివాటి కోసం బడ్జెట్లో వేలకోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ సమావేశానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, జి.మనోహర్ రెడ్డి, వై.గీత, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
'విద్యార్థులు లేరని పాఠశాలల మూసివేత సరికాదు'
హైదరాబాద్ : విద్యార్థుల సంఖ్యలేదని పాఠశాలల మూసివేత సరికాదని బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాలలో శుక్రవారం ఉపాధ్యాయ క్రమబద్దీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు తక్కువగా ఉన్నారని ఉపాధ్యాయులను మరోచోటికి బదిలీ చేయటం సరికాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్కూల్‌కు 10మంది విద్యార్థులు రావడం కష్టమే అని, అలాంటి ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేత ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు. పాఠశాల మూసివేత నిర్ణయంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతారన్నారు. తెలంగాణలో నిరక్షరాశ్యత ఎక్కువగా ఉందని, బాలలకు విద్యాహక్కును కల్పించాలన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 38 లక్షల బాల కార్మికులు ఉన్నారని ఆయన తెలిపారు. -
31న మహా సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించిన గవర్నర్ విద్యాసాగర్ రావు బలనిరూపనకు 15 రోజులు గడువు ఇచ్చారు. ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షనేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసన సభ నేత ఎంపిక కోసం ముంబైలో మంగళవారం సాయంత్రం బీజేపీ లెజిస్టేచర్ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి రాజ్ నాథ్, జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలావుండగా, ప్రభుత్వంలో చేరేందుకు శివసేన మంతనాలు సాగిస్తోంది. -
మహారాష్ట్ర బీజేపీ నేతగా దేవేంద్ర ఫడ్నవిస్!
ముంబై: మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షనేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసన సభ నేత ఎంపిక కోసం ముంబైలో మంగళవారం సాయంత్రం బీజేపీ లెజిస్టేచర్ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి రాజ్ నాథ్, జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత కేంద్ర పరిశీలకుడు రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫడ్నవిస్ పేరు తప్పా ఎవరి పేరు చర్చకు రాలేదు అని అన్నారు. నాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ విజయం సాధించారు. ఈ సాయంత్రం గవర్నర్ సి. విద్యాసాగర్ రావు ను ఎమ్మెల్యేలు కలుసుకోనున్నారు.