సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరన్నారు: బీజేఎల్పీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని తప్పుదోవ పట్టించేలా సమాధానం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌పై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ డిమాండ్ చేసింది. గత నెల 5న అసెంబ్లీలో బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు, సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరంటూ కేసీఆర్ సభను తప్పుదోవ పట్టించారని బీజేఎల్పీ ఆరోపించింది.
ఈ మేరకు సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం అసెంబ్లీ కార్యదర్శికి బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్ నోటీసు అందజేశారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల తరహాలోనే 25వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.