30 రోజులు అసెంబ్లీ
బీజేఎల్పీ డిమాండ్
సమస్యల పరిష్కారం దిశగా చర్చలు ఉండాలని సూచన
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను 30 రోజులపాటు నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. బీజేఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన బుధవారం అసెంబ్లీలోని కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. గురువారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. అనంతరం లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.వి.ఎస్,ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిపై ఆషామాషీగా కాకుండా పరిష్కారం దిశగా చర్చలు జరగాలన్నారు.
దీనికోసం సభాకాలాన్ని పొడిగించాలని కోరారు. అన్ని బిల్లులపై సమగ్రంగా చర్చకోసం కోరుతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడానికి బడ్జెట్‌లో కేటాయింపులుండాలని లక్ష్మణ్ సూచించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, విద్యుత్ చార్జీలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, బీసీలకు కళ్యాణలక్ష్మి, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు, దళితులకు మూడెకరాల భూమి, రైతులకు రుణమాఫీ, పెండింగు ప్రాజెక్టులు, నిరుద్యోగం, కేజీ నుంచి పీజీదాకా ఉచితవిద్య వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వానికి మెజారిటీ ఉందనే సాకుతో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. దీనికోసం అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకుంటూ ప్రభుత్వంపై పోరాడుతామన్నారు.
మహిళలకు పెద్దపీట : లక్ష్మణ్
కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భేటీ బచావో-భేటీ పడావో, సుకన్య యోజన, గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటివాటి కోసం బడ్జెట్‌లో వేలకోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ సమావేశానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, జి.మనోహర్ రెడ్డి, వై.గీత, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.