'విద్యార్థులు లేరని పాఠశాలల మూసివేత సరికాదు'
హైదరాబాద్ : విద్యార్థుల సంఖ్యలేదని పాఠశాలల మూసివేత సరికాదని బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాలలో శుక్రవారం ఉపాధ్యాయ క్రమబద్దీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు తక్కువగా ఉన్నారని ఉపాధ్యాయులను మరోచోటికి బదిలీ చేయటం సరికాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్కూల్కు 10మంది విద్యార్థులు రావడం కష్టమే అని, అలాంటి ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేత ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు.
పాఠశాల మూసివేత నిర్ణయంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతారన్నారు. తెలంగాణలో నిరక్షరాశ్యత ఎక్కువగా ఉందని, బాలలకు విద్యాహక్కును కల్పించాలన్నారు. ఒక్క హైదరాబాద్లోనే 38 లక్షల బాల కార్మికులు ఉన్నారని ఆయన తెలిపారు.