సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల పీఆర్సీ కోసం త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాటలకు, టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు పొంతనే లేదన్నారు. నిలువెల్లా అబద్ధాలతో కూడిన మోసపూరిత బడ్జెట్‌గా అభివర్ణించారు. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, బీసీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుత బడ్జెట్ ‘బడ్జెట్ బారెడు – ఖర్చు జానెడు, పేరు గొప్ప – ఊరు దిబ్బ’అన్న చందంగా ఉందని విమర్శించారు. తలసరి ఆదాయం చెప్పిన ప్రభుత్వం అప్పును ఎందుకు చెప్పడం లేదు? లోటును ఎలా పూడ్చుతారో చెప్పలేదేంటని ప్రశ్నలు సంధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. వంటి కీలకమైనవాటిని గాలికొదిలేశారన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.ఒక్కొక్కరి తలపై రూ.91వేలు అప్పు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని విమర్శించారు. ‘నిరుద్యోగ భృతి అని చెప్పి ఏడాదిన్నర కావొస్తున్నా అతీగతి లేదన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకుండా, తాజాగా డబ్బులు ఇస్తామని కొత్త మోసం చేయబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలో ఉన్నందునే నగరానికి రూ.పది వేల కోట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంపై సాకు వేసి తమ అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఏమైందని ప్రశ్నించారు. కరోనాకు పారాసిటమాల్ మందును డాక్టర్ కేసీఆర్ కనుగొన్నారా? అని ప్రశ్నించారు. ఎంఐఎంకు తలొగ్గి సీఏఏపై తీర్మానం చేస్తామంటున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment