బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
చీకటి ఒప్పందాలతో కావాల్సిన కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు
రహస్య జీవోలతో సర్కారు నడుస్తోంది
సీఎం తమ్ముడు, బావమరిది భాగస్వామ్యంతో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు .. ఈ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ కోరుతాం
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వంలో కంటే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఎక్కువ అవినీతి, చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. రహస్య జీవోలతో సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఓ బడా కాంట్రాక్టర్‌కు రూ.1,100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకం అమృత్ స్కీమ్‌లో కూడా రూ.3 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.
గురువారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బావమరిదికి చెందిన ఓ కంపెనీకి రూ.400 వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చా రని తెలిపారు. ఆయా పనులను 30 నుంచి 35 శాతం తక్కువకు చేసేందుకు ఇతర కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా ఇష్టారీతిన అంచనాలు పెంచి, కావాల్సిన వారికి కాంట్రాక్ట్‌లు ఇచ్చారని విమర్శించారు. ఇటీవల వివిధ పనుల్లో రూ.1,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ్ముడు, బావమరిది భాగస్వామ్యంతో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ధారాదత్తం చేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే కరీంనగర్‌లో వివిధ కాంట్రాక్ట్‌లలో సీఎం తమ్ముడు భాగస్వామిగా ఉన్నట్టు చెబుతున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో త్వరలో పిలిచే టెండర్లలో కూడా ఓ బడా కంపెనీకి పెద్దపీట వేయబోతున్నారన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతి వ్యవహారాలపై ఈడీ, సీబీఐ విచారణ కోరతామని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment