వచ్చే జూన్–డిసెంబర్ మధ్యలో సీఎం మార్పు ఖాయం
ఏడుసార్లు వెళ్లినా రేవంత్‌కు.. రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు
రేవంత్ ప్రత్యామ్నాయానికి కాంగ్రెస్ అధిష్టానం చూస్తోంది
సీఎం ఏకపక్ష ధోరణిని చాలామంది నేతలు ఒప్పుకోవడం లేదు
సీఎం రేసులో ఉత్తమ్, భట్టి, వెంకట్‌రెడ్డి పోటీ పడుతున్నారు
మీడియాతో ఇష్టాగోష్టిలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి హనీమూన్ పీరియడ్ ముగిసి కౌంట్‌డౌన్ మొదలైందని... వచ్చే ఏడాది జూన్–డిసెంబర్‌ల మధ్య ఆయన పదవి పోవడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం చూస్తోందని..కొత్త సీఎంగా ఎవరిని పెట్టాలనే దానిపై రహస్యంగా ఓ కమిటీ అన్వేషణ సాగిస్తోందన్నారు. సీఎం రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారని చెప్పారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయం ఒకేసారి రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్లకు పెంచి భారీగా అవినీతికి ప్లాన్ చేశారని, ఏకపక్షంగా సొంత ఎజెండాతో సెలక్షన్, కరప్షన్, బ్లాక్‌మెయిలింగ్ వంటి వాటికి దిగడం దీనికి కారణమని ఆరోపించారు.
మూసీ, హైడ్రా కూల్చివేతలతో పేదల్లో కాంగ్రెస్ అభాసుపాలు కావాల్సి వస్తోందని హైకమాండ్ ఆందోళన చెందుతోందన్నారు. శుక్రవారం మహేశ్వర్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొందరు సీనియర్ మంత్రులు హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్‌మెంట్ల మీద రేవంత్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు తమకు సమాచారం ఉందన్నారు. మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని మూడొంతులు పెంచి తన స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నారని, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని చెప్పారు. రేవంత్ ఏకపక్ష ధోరణిని కూడా పలువురు నేతలు అంగీకరించడం లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాకుండా రేవంత్‌రెడ్డి తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా హైకమాండ్‌కు చేరాయని తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు కూడా సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారని, కూల్చివేతలపై నివేదిక సమర్పించారని చెప్పారు. దీనిపై పరిశీలనకు సోనియా సూచనలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఫోన్ చేస్తే రేవంత్ స్పందించలేదన్నారు. ఫోన్ ఎత్తకపోగా హైకమాండ్‌కు తాను స్పందించలేదని రేవంత్‌రెడ్డి పేర్కొనడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. సీనియర్ మంత్రులు, పార్టీ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉందని తెలుస్తోందన్నారు. రేవంత్ వ్యతిరేకవర్గం ఢిల్లీలో అధిష్టానం వద్ద గట్టిగా లాబీయింగ్ నిర్వహిస్తోందన్నారు.
ఈ కారణంగానే ఇప్పటికే ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లినా, రేవంత్‌కు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణ వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. మొత్తం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామంటూ ఫిరాయింపులకు రేవంత్‌రెడ్డి తెరతీశారని తెలిపారు. అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు మళ్లీ కేసీఆర్‌తో టచ్‌లోకి వెళ్లారన్నారు. దీంతో పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశానికి భిన్నంగా ఫిరాయింపులు చేపట్టడంపై హైకమాండ్ ఆగ్రహంతో ఉందని చెప్పారు. ఈ పరిణామాల నుంచి బీఆర్‌ఎస్ లాభపడుతుందా అనే ప్రశ్నకు లోక్‌సభ ఎన్నికల్లో డకౌట్ అయ్యి ఏం చేయగలుగుతుందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్–బీఆర్‌ఎస్ ఒక్కటైనా.. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment