సీఎంను కలిసి ఏ పని అడిగినా అదే ప్రశ్న
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణ
ఓ డీల్‌లో రూ.300 కోట్లు తీసుకుని ఢిల్లీకి పంపించిన మాట వాస్తవమా కాదా?
గత ప్రభుత్వ లొసుగులు తెలుసుకుని సెటిల్మెంట్లు చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. కానీ వాస్తవానికి ఎవరైనా రేవంతూ అని మాట్లాడిస్తే తన వంతు ఎంత అని అడుగుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన వాళ్లు కూడా రేవంత్‌ని నీ రేటెంతరెడ్డి అని అడుగుతున్నారంట అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ముందు పెట్టుకొని సెటి ల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
గురువారం పార్టీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న లోలోపల సెటిల్మెంట్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన దాని కంటే కూడా కాంగ్రెస్ హయాంలోనే అవినీతి, అరాచకాలు ఎక్కువ జరుగుతున్నా యని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమా లపై నాలుగు నెలలు దాటినా ఒక్కదాని మీద ఎంక్వైరీ పూర్తి అవ్వలేదన్నారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి సెటిల్మెంట్‌లు చేస్తున్నారని, ఆ క్రమంలోనే కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పజెప్పడం లేదని నిందించారు.
రాహుల్ ట్యాక్స్ వసూలు ఎలాగంటే..
రాహుల్‌గాంధీ ట్యాక్స్ వసూలుకు సంబంధించి అనుసరిస్తున్న ఒక విధానాన్ని తాను బయట పెడుతున్నానని మహేశ్వర్‌రెడ్డి వివరించారు. ’’గత ప్రభుత్వం ఓ సంస్థకు నగరం నడిబొడ్డున రూ.1,500 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకు (నెలకు ఎకరానికి రూ.2లక్షల లీజ్‌కు) ఇస్తే దానిని కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రద్దు చేసి అది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మరో జీవో ద్వారా అదే భూమిని అదే సంస్థకు రేవంత్‌రెడ్డి కేటాయించారు.’’ అని ఆరోపించారు ఇందులో భాగంగా రూ.300 కోట్లు తీసుకుని ఢిల్లీకి పంపించిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే వీటికి సంబంధించిన అంశాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ భూమికి సంబంధించే ఇంత కుంభకోణం చేస్తే.. కాళేశ్వరం, ధరణిల్లో ఇంకా ఎంత కుంభకోణం చేస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు.
మరో రెండు రోజుల్లో ఇంకో అవినీతి బయటపెడతా
మరో రెండు రోజుల్లో మరో అవినీతి అంశంపై ఆధారాలతో సహా మీడియా ముందుకి వస్తా నని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. మహేశ్వర్ రెడ్డికి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న భయంతో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయం ఆరో ఫ్లోర్‌లోకి ఎవరినీ రానివ్వకుండా సెక్యూ రిటీ పెంచారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ సెక్యూరిటీ పెంచి ఎవరినీ అనుమతించడం లేదన్న సమాచారం తనకు అందిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భయం పట్టుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment