సాక్షి హైదరాబాద్: తనపై క్రమశిక్షణా చర్య తీసుకుంటూ పంపించిన నోటీస్‌లో పేర్కొన్నట్లు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ సమాధానమిచ్చారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించనందున తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. సోమవారం ఈ మేరకు పార్టీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సభ్యకార్యదర్శి ఓం పాథక్‌కు లేఖ రాశారు.
ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆగస్ట్ 23న రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. 10 రోజుల్లో నోటీస్‌కు సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీ ఆదేశించింది. పీడీయాక్ట్‌పై అరెస్టయి జైలులో ఉన్నందున సోమవారం నోటీస్‌కు సమాధానమిస్తూ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే.. ‘మతప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్న ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాపై.. ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ మద్దతుతో ఎంఐఎం సాగిస్తున్న అరాచకాలనే ప్రశ్నించాను తప్ప ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేయలేదు. నేను పంపిన వీడియోలోనూ ఏ మతాన్ని కించపరచలేదు. పార్టీ ఎమ్మెల్యేగా 8 ఏళ్ల కాలంలో ఏనాడూ పార్టీ లైన్ దాటి ప్రవర్తించలేదు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నా. మునావర్ ఫారుఖీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్లను కించపరచలేదు’అని ఈ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment