బీజేఎల్పీ డిమాండ్
వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఆర్థిక సాయం చేయాలి
రైతు భరోసా, పూర్తి రుణమాఫీ డిమాండ్‌పై 20న రైతు దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష సమావేశం డిమాండ్ చేసింది. రైతు భరోసా, రుణ మాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న బీజేఎల్పీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేసింది.
గురువారం అసెంబ్లీ ఆవరణలోని బీజేఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీలు డా.కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, అర్వింద్, డీకే అరుణ, గోడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, డా.పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పాటిల్, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అర్హులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని, అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించాలని, ‘హైడ్రా’నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే డిమాండ్లను ఈ సమావేశం ఫ్రభుత్వం ఎదుట పెట్టింది. దీంతో పాటు పార్టీపరంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, దేవాలయ భూముల రక్షణకు పోరాడాలని, బీజేపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
వరద నిధుల వ్యయంపై శ్వేతపత్రం: ఏలేటి డిమాండ్
వరద నష్టానికి సంబంధించి ఇప్పటివరకు చేసి న పనులు, ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరద సహాయంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేఎల్పీ భేటీ అనంతరం ఎంపీ అ ర్వింద్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వరద సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.
కాగా, అరికెపూడి గాం«దీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వలసదారుడు, పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు పాతబస్తీకి వెళ్లడానికి భయపడుతున్నారని, మూసీ నది పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను దమ్ముంటే కూల్చాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment