అన్బుమణికి అవకాశం
సాక్షి, చెన్నై:పీఎంకే సీఎం అభ్యర్థిగా అన్బుమణి రాందాసు పేరును ఆ పార్టీ మహానాడులో ప్రకటించారు. ఆయన నేతృత్వంలో ఎస్‌డీఏ కూటమి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. పార్టీ పరంగా తన కు బాధ్యతలు పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు, ప్రజల్ని కలుసుకునేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు అన్బుమణి రాందాసు సిద్ధం అవుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కూటముల్ని మార్చి మార్చి డిపాజిట్లు గల్లంతు చేసుకోవడంతో పాటుగా తన వన్నియర్ సామాజిక వర్గం చేత కూడా చీదరించుకోవాల్సిన పరిస్థితి పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుకు ఏర్పడింది. ఇక ఎవరి గొడుగు నీడన చేరకుండా, తన నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ మేరకు సమూహ జననాయగ కూట్టని (సోషల్ డెమోక్రటిక్ అలయన్స్-ఎస్‌డీఏ)ను ఏర్పాటు చేశారు. చిన్నా చితకా పార్టీలను కలుపుకుంటూనే, రాష్ర్టంలో మా ర్పు తమ ద్వారానే సాధ్యం అన్న నినాదాన్ని అందుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా తమ నేతృత్వంలో ఏర్పడే కూటమికి సీఎం అభ్యర్థిగా అన్బుమణి పేరును ప్రకటిస్తూ రాందాసు నిర్ణయం తీసుకున్నారు.
తీర్మానం : సేలంలో ఆదివారం రాత్రి పీఎంకే మహానాడు జరిగింది. బ్రహ్మాండ వేదికపై జరిగిన ఈ మహానాడుకు తమ బలాన్ని చాటే రీతిలో పీఎంకే వర్గాలు తరలి వచ్చాయి. ఇందులో రాందాసు ప్రసంగిస్తూ, రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని శివాలెత్తారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా పీఎంకే ఉద్యమిస్తోందని, అధికారంలోకి రాగానే, తొలి సంతకం మద్య నిషేధం మీదే ఉంటుందని ప్రకటించారు. ఒకరి గొడుగు నీడ చేరాల్సిన అవసరం ఇక పీఎంకేకు లేదని, రాష్ట్రంలో మార్పు లక్ష్యంగా పీఎంకే ముందుకు సాగుతున్నదన్నారు. తమ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తమ పార్టీ సీఎం అభ్యర్థిగా అన్బుమణి రాందాసు పేరును పార్టీ నిర్ణయించిందని, పీఎంకే సీఎం అభ్యర్థి అన్బుమణి రాందాసు అని ప్రకటిస్తూ తీర్మానం చేశారు. తన పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో అన్భుమణి ఆనందానికి అవధులు లేవు. ఆయనను పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, అధ్యక్షుడు జీకే మణి, వన్నియర్ సంఘం నేత కాడు వెట్టి గుర్రు అభినందనలతో ముంచెత్తారు. తన పై బాధ్యతలు పెరగడంతో ఇక పార్టీ బలోపేతం లక్ష్యంగా రాష్ర్టవ్యాప్తంగా పర్యటించనున్నట్టు, అన్ని సామాజిక వర్గాల్ని కలుపుతూ బలోపేతం ధ్యేయంగా, ప్రభుత్వ ఏర్పాటు కాంక్షతో ముందుకు సాగుతున్నట్టు అన్బుమణి రాందాసు ప్రకటించారు.