కుట్రతో ముంచేశారు!
టీనగర్: ఎన్నికల వ్యాపారంలో ఓడిపోయామని, రెండు ద్రావిడ పార్టీలు పథకం ప్రకారం ముంచేశాయని పీఎంకే యువజన సంఘం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల వ్యాపారంలో ఓడిపోయామని, ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచివున్నామన్నారు. లోకాయుక్త చట్టాన్ని ప్రవేశపెడతామని తాము ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని అన్నాడీఎంకే, డీఎంకేలు తమ మేనిఫెస్టోలోను పేర్కొన్నాయన్నారు. మద్యనిషేధాన్ని అమలు చేస్తామన్న నినాదాన్ని డిఎంకే కూడా ప్రకటించిందన్నారు.
దీంతో పథకం ప్రకారం ద్రావిడ పార్టీలు తనను ఓడించాయన్నారు. అయినప్పటికీ ప్రజల మనస్సుల్లో నిలిచివున్నామన్నారు. తాను కేంద్ర మంత్రిగా వున్న సమయంలో ధర్మపురి జిల్లాలో కొత్త రైల్వే పథకాలు ప్రవేశపెట్టానని అన్నారు. నగదు అందుకోకుండా పీఎంకేకు ఓటు వేసిన 23 లక్షల మంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని, మరికొన్ని రోజుల్లో పార్టీ నిర్వాహక కమిటీ సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
పీఎంకేకు పెరిగిన ఓట్ల శాతం: రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి పతనం కగా పీఎంకేకు ఇబ్బంది లేకుండా పోయింది. 2011 ఎన్నికల్లో పీఎంకే 5.23 శాతం ఓట్లు పొందింది. ఈ దపా పిఎంకేకు 5.30 శాతం ఓట్లు లభించాయి. పీఎంకే ఓటు బ్యాంకులో 0.07 ఓట్లు పెరిగాయి. ఉత్తర జిల్లాలలో పీఎంకే అభ్యర్థులు 88 శాతం వన్నియర్ల ఓట్లను పొందినట్లు పరిశీలనలో తేలింది.