ఒంటరేనా?
సాక్షి, చెన్నై :గతం నేర్పిన గుణపాఠంతో ద్రవిడ పార్టీలకు దూరంగా ఉండేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇక తమది ఒంటరి సమ రం అని చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో తన నేతృత్వంలో సమూహ జననాయగ కూట్టని (సోషియల్ డెమోక్రటిక్ అలయన్స్)ను అక్టోబరులో ప్రకటించారు. తమ కూటమిలో పోటీ చేయనున్న పదిహేను మంది అభ్యర్థుల చిట్టాను తొలి విడతగా విడుదల చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించే కార్యక్రమా ల్ని వేగవంతం చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు పీఎంకే నిర్ణయించింది. దీంతో బీజేపీతో జత కట్టేందుకు మంతనాలు జరుగుతున్నట్టు, సీట్ల పందేరం ఒప్పందాలు ముగిసినట్టుగా ప్రచారం సాగింది.
అయితే, ఈ ప్రచారానికి బ్రేక్ వేస్తూ బుధవారం జరిగిన పీఎంకే సర్వసభ్య సమావేశంలో పార్టీ నాయకుల ద్వారా రాందాసు ప్రతిజ్ఞ చేయించడం గమనార్హం. సర్వ సభ్యసమావేశం: కామరాజర్ అరంగంలో ఉదయం సర్వ సభ్య సమావేశం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పీఎంకే వర్గాలు తరలి రావడంతో ఆ పరిసరాలు కోలాహలంతో నిండాయి. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, అధ్యక్షుడు జికే మణి, యువజన నేత అన్బుమణి రాందాసు, వన్నియర్ సంఘం నేత కాడు వెట్టి గురు, పార్టీ సీనియర్లు ఏకే మూర్తి తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల్ని రాందాసు స్వీకరించారు. కొందరు బీజేపీతో జత కడుదామని అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కూటమి అన్నది పార్టీ నేతృత్వంలోనే ఉంది కదా..! అన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరికొందరు సర్వ సభ్య సమావేశం దృష్టికి తెచ్చారు.
ఝలక్: అభిప్రాయ సేకరణానంతరం ప్రసంగించిన రాందాసు, కేంద్రంలో ఏర్పడ బోయే ప్రభుత్వానికి పీఎంకే మద్దతు తప్పని సరి అని, ఆ కేబినెట్లో పీఎంకేకు చోటు దక్కుతుందని పేర్కొనడం విశేషం. తమ మద్దతు కోసం మరొకరు ఎదురు చూడాలే గానీ, ఇతరుల మద్దతు కోసం తాము ఎదురు చూడాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీకి ఝలక్‌లు ఇచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. చివరగా 17 తీర్మానాలు చేశారు. సమూహ జననాయగ కూట్టని అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని, శ్రమిస్తామని నినదిస్తూ అందరి చేత పార్టీ అధ్యక్షుడు జికే మణి ప్రతిజ్ఞ చేయించడం గమనార్హం.
అయితే, ఈ ప్రతిజ్ఞ వెనుక ఆంతర్యం ఉందని పలువురు పీఎంకే నేతలు పేర్కొంటున్నారు. సీట్ల పందేరంలో బీజేపీ పట్టు వీడని దృష్ట్యా, వారికి ఝలక్ ఇవ్వడం లక్ష్యంగా ఈ ప్రతిజ్ఞ ఉండొచ్చంటున్నారు. అయితే, చివరి క్షణంలో మళ్లీ పునఃసమీక్ష జరిగేనా లేదా ఎస్డీఏ బరిలోకి దిగేనా, బీజేపీతో జత కట్టేనా..? అన్నది ఎన్నికల నాటి వరకు వేచి చూడాల్సిందే.తీర్మానాలు: అక్టోబరులో ప్రకటించిన మేరకు సమూహ జననాయగ కూట్టని అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలి. జాలర్లపై, ఈలం తమిళులపై శ్రీలంక పైశాచికత్వానికి నిరసన తెలుపుతూ తీర్మానం. రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణింపుపై ఆగ్రహం, విద్యుత్ కోతలపై మండి పాటు, ధరల పెంపుపై ఖండన. ఇసుక, గ్రానైట్ కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్. మద్య నిషేధం లక్ష్యంగా ఉద్యమం ఉధృతం. ఎస్సీ, ఎస్టీ చట్టంలో సవరణలకు డిమాండ్ వంటి తీర్మానాలు చేశారు.