వైఎస్ పాలనే ఆదర్శం
సాక్షితో పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్
సాక్షి, చెన్నై: ‘అందరికీ అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందరికీ ఆదర్శనీయుడు. అందుకే తమిళనాడు రైతులకూ అటువంటి పాలనను అందించేందుకు వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని అసెంబ్లీకి పోటీ చేస్తున్నా’ అని పాట్టాలిమక్కల్ కట్చి (పీఎంకే) యువజన విభాగ అధ్యక్షుడు, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో రాందాస్‌ను ‘సాక్షి’ కలిసింది. ఐదు దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్బుమణి అన్నారు.
ఈ రెండు పార్టీలు ఎంతటి దుర్భరమైన పాలన అందించినా భరించాల్సిందేనా, తమకు మరో గత్యంతరం లేదా అనేంతగా ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు పీఎంకే ముందుకొచ్చిందన్నారు. రైతన్నలను అక్కున చేర్చుకోవడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఆదర్శమని చెప్పారు. రైతు సంక్షేమం కోసం ఆయన అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఏపీ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.18వేల కోట్లు కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పీఎంకే అధికారంలోకి వస్తే ఇదే పద్ధతిని అనుసరిస్తానని రైతులకు చెప్పినట్లు పేర్కొన్నారు.