చెన్నై : పీఎంకే యువజన నేత, ఆ కూటమి సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసు చాలా కాలం తర్వాత వైద్యుడి అవతారమెత్తారు. చేతిలో స్టెతస్కోప్ పట్టుకుని నాడి పట్టి వైద్యుడిగా మందులు, మాత్రుల్ని అందించే పనిలో పడ్డారు. చెన్నైలో తన నేతృత్వంలో పలు చోట్ల స్వయంగా వైద్య శిబిరాల్లో అన్భుమణి మునిగి ఉన్నారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు స్వతహాగా వైద్యుడే. అందుకే యూపీఏ హయంలో ఆయనకు కేంద్రంలో కేబినెట్ హోదాతో ఆరోగ్య శాఖను కట్టబెట్టారు. స్వతహాగా వైద్యుడైన అన్భుమణి ఆ శాఖ మీద పూర్తి పట్టు సాధించారని చెప్పవచ్చు.
ప్రస్తుతం రాజకీయ పయనంలో బిజీగా ఉన్న అన్భుమణి తదుపరి తమిళనాట సీఎం తానే అన్న ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. ప్రజాకర్షణ పయనంలో బిజీగా ఉన్న అన్భుమణి రాందాసు తాజాగా చాలా కాలం అనంతరం వైద్యుడి అవతారం ఎత్తి ఉన్నారు. తెల్ల కోటు ధరించి, చేతిలో స్టెతస్కోప్‌ను పట్టుకుని, రోగుల నాడి పట్టి వైద్య సేవల్ని అందించే పనిలో పడ్డారు. పీఎంకే యువజన విభాగం నేతృత్వంలో చెన్నైలోని వరద బాధిత ప్రాంతాల్లో బుధవారం నుంచి వైద్య శిబిరాల ఏర్పాటు మీద దృష్టి పెట్టారు. ఈ శిబిరాల్లో ఇతర వైద్యులతో పాటుగా తాను సైతం అంటూ అన్భుమణి రోగుల్ని పరీక్షించే పనిలో పడ్డారు.
వైద్య సలహాలు ఇస్తూ, మందులు, మాత్రల్ని అందించే పనిలో పడటం గమనార్హం. చాలా కాలం తర్వాత నాడి పట్టి వైద్య సేవల్ని అందిస్తున్న అన్భుమణిని మీడియా కదిలించగా, ప్రజల్ని ఆదుకునేందుకు తాము సైతం అంటూ వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేసి ఉన్నామని వివరించారు. జ్వరం, దగ్గు తీవ్రత ఉంటే, తక్షణం వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. బాగా వేడి చేసిన నీటినే తాగాలని, గంజి స్వీకరించాలంటూ వైద్య సలహాలను అందించారు.
ప్రభుత్వం బాధితులకు ప్రకటించిన వరద సాయం కంటి తుడుపు చర్యగా పేర్కొన్నారు. రైతులకు ప్రకటించిన నష్టపరిహారం కూలీలకు ఇవ్వడానికే చాలదని వివరించారు. వరికి రూ. 25 వేలు, చెరకు, అరటి పంటకు రూ. 75 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారానే సహాయకాలను బాధితులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, ప్రస్తుతం ప్రకటించిన రూ. ఐదు వేలు నష్టపరిహారం మళ్లీ టాస్మాక్‌లకే చేరడం ఖాయం అన్నారు. బాధితులకు ఇచ్చే ఈ నగదును మందు బాబులు మళ్లీ టాస్మాక్ మద్యం దుకాణాలకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వరద బాధిత ప్రాంతాల్లోని పేద కుటుంబాలు కుదట పడాలంటే తాత్కాలికంగా టాస్మాక్ మద్యం దుకాణాలను మూసి వేయాలని , కనీసం పదిహేను రోజు పాటైనా మూత వేయడంటూ ప్రభుత్వాన్ని విన్నవించారు.
వైద్యుడి ఆవతారం ఎత్తిన కేంద్ర మాజీ మంత్రి
Published Thu, Dec 10 2015 8:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM
Advertisement