Central Ex Minister
-
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి – ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సేవాదళ్ నిరాహార దీక్ష కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ బుధవారం స్థానిక కళావెంకట్రావ్ భవనం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద సేవాదళ్ విభాగం రాష్ట్ర చైర్మన్ భవానీ నాగేంద్ర ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజర్ చక్రపాణిరెడ్డి, జిల్లా చైర్మన్ సజ్జాద్హుసేన్, సేవాదళ్ నాయకులు నిఖిల్, సురేశ్‌లతో పాటు ఎస్సీసెల్‌కు చెందిన సత్యరాజు, నాగప్ప నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరాన్ని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు . ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్యాకేజీ ప్రకటించి రాష్ట్ర ప్రజలను మోసగించారని ఆరోపించారు. ప్యాకేజీ మంచు ముక్కలాంటిదని, అది రాష్ట్రానికి చేరేలోపు ఆవిరవుతుందని, ఉన్న కాస్తోకూస్తో నిధులు చంద్రబాబు, మంత్రులు, తెలుగు తమ్ముళ్ల చేతుల్లో నీరుగారిపోతాయని ఆరోపించారు. ప్యాకేజీతో పాటు హోదా తప్పనిసరన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చేపడుతున్నామని ఈ కార్యక్రమం వచ్చే నెల 7తో ముగుస్తుందని సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, డీసీసీ ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మజరుల్‌హక్, వై.వి.రమణ, కార్యదర్శులు నారాయణరెడ్డి, చున్నుమియ్య, ఎస్.ఖలీల్‌బాష, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్, మహిళా నేతలు సారమ్మ, సూర్యకాంతమ్మ పాల్గొన్నారు. -
లక్షా 70 వేలకు... 20 వేల పోస్టులే భర్తీనా !!
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువతను మోసగించారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. సోమవారం శ్రీకాకుళంలో ఆమె మాట్లాడుతూ... అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా యువతకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకపోగా..ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తున్నారని మండిపడ్డారు. గృహనిర్మాణ రంగంలో 6వేల మందిని, ఇరిగేషన్ శాఖలో 7వేల మందిని, ఆశావర్కర్లను ఉద్యోగాల నుంచి తొలగించారని అన్నారు. విద్యుత్‌శాఖలో 21 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగాల ఖాళీల సంఖ్యను లెక్కించేందుకు కమలనాథన్ కమిటీ వేసిందని, ఈ కమిటీ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్‌లో రిటైరయ్యే 30 వేల మందితో కలిపి 1,72, 825 ఖాళీలు ఉన్నట్లు నివేదిక తెలిపిందని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 20 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డోల జగన్మోహనరావు, డాక్టర్ కిల్లి రామ్మోహన్రావు, మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద పాల్గొన్నారు. -
వైద్యుడి ఆవతారం ఎత్తిన కేంద్ర మాజీ మంత్రి
చెన్నై : పీఎంకే యువజన నేత, ఆ కూటమి సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసు చాలా కాలం తర్వాత వైద్యుడి అవతారమెత్తారు. చేతిలో స్టెతస్కోప్ పట్టుకుని నాడి పట్టి వైద్యుడిగా మందులు, మాత్రుల్ని అందించే పనిలో పడ్డారు. చెన్నైలో తన నేతృత్వంలో పలు చోట్ల స్వయంగా వైద్య శిబిరాల్లో అన్భుమణి మునిగి ఉన్నారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు స్వతహాగా వైద్యుడే. అందుకే యూపీఏ హయంలో ఆయనకు కేంద్రంలో కేబినెట్ హోదాతో ఆరోగ్య శాఖను కట్టబెట్టారు. స్వతహాగా వైద్యుడైన అన్భుమణి ఆ శాఖ మీద పూర్తి పట్టు సాధించారని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజకీయ పయనంలో బిజీగా ఉన్న అన్భుమణి తదుపరి తమిళనాట సీఎం తానే అన్న ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. ప్రజాకర్షణ పయనంలో బిజీగా ఉన్న అన్భుమణి రాందాసు తాజాగా చాలా కాలం అనంతరం వైద్యుడి అవతారం ఎత్తి ఉన్నారు. తెల్ల కోటు ధరించి, చేతిలో స్టెతస్కోప్‌ను పట్టుకుని, రోగుల నాడి పట్టి వైద్య సేవల్ని అందించే పనిలో పడ్డారు. పీఎంకే యువజన విభాగం నేతృత్వంలో చెన్నైలోని వరద బాధిత ప్రాంతాల్లో బుధవారం నుంచి వైద్య శిబిరాల ఏర్పాటు మీద దృష్టి పెట్టారు. ఈ శిబిరాల్లో ఇతర వైద్యులతో పాటుగా తాను సైతం అంటూ అన్భుమణి రోగుల్ని పరీక్షించే పనిలో పడ్డారు. వైద్య సలహాలు ఇస్తూ, మందులు, మాత్రల్ని అందించే పనిలో పడటం గమనార్హం. చాలా కాలం తర్వాత నాడి పట్టి వైద్య సేవల్ని అందిస్తున్న అన్భుమణిని మీడియా కదిలించగా, ప్రజల్ని ఆదుకునేందుకు తాము సైతం అంటూ వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేసి ఉన్నామని వివరించారు. జ్వరం, దగ్గు తీవ్రత ఉంటే, తక్షణం వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. బాగా వేడి చేసిన నీటినే తాగాలని, గంజి స్వీకరించాలంటూ వైద్య సలహాలను అందించారు. ప్రభుత్వం బాధితులకు ప్రకటించిన వరద సాయం కంటి తుడుపు చర్యగా పేర్కొన్నారు. రైతులకు ప్రకటించిన నష్టపరిహారం కూలీలకు ఇవ్వడానికే చాలదని వివరించారు. వరికి రూ. 25 వేలు, చెరకు, అరటి పంటకు రూ. 75 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారానే సహాయకాలను బాధితులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ప్రస్తుతం ప్రకటించిన రూ. ఐదు వేలు నష్టపరిహారం మళ్లీ టాస్మాక్లకే చేరడం ఖాయం అన్నారు. బాధితులకు ఇచ్చే ఈ నగదును మందు బాబులు మళ్లీ టాస్మాక్ మద్యం దుకాణాలకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వరద బాధిత ప్రాంతాల్లోని పేద కుటుంబాలు కుదట పడాలంటే తాత్కాలికంగా టాస్మాక్ మద్యం దుకాణాలను మూసి వేయాలని , కనీసం పదిహేను రోజు పాటైనా మూత వేయడంటూ ప్రభుత్వాన్ని విన్నవించారు.