లక్షా 70 వేలకు... 20 వేల పోస్టులే భర్తీనా !!
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువతను మోసగించారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. సోమవారం శ్రీకాకుళంలో ఆమె మాట్లాడుతూ... అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా యువతకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకపోగా..ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తున్నారని మండిపడ్డారు.
గృహనిర్మాణ రంగంలో 6వేల మందిని, ఇరిగేషన్ శాఖలో 7వేల మందిని, ఆశావర్కర్లను ఉద్యోగాల నుంచి తొలగించారని అన్నారు. విద్యుత్‌శాఖలో 21 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగాల ఖాళీల సంఖ్యను లెక్కించేందుకు కమలనాథన్ కమిటీ వేసిందని, ఈ కమిటీ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్‌లో రిటైరయ్యే 30 వేల మందితో కలిపి 1,72, 825 ఖాళీలు ఉన్నట్లు నివేదిక తెలిపిందని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 20 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డోల జగన్‌మోహనరావు, డాక్టర్ కిల్లి రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద పాల్గొన్నారు.