Killi Kruparani
-
వధూవరుల్ని ఆశీర్వదించిన ముఖ్యమంత్రి జగన్
సాక్షి, విశాఖ: కేంద్ర మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కిల్లి కృపారాణి కుమారుడి వివాహం బుధవారం విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు క్రాంతికుమార్, అలేఖ్యలను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు, వైఎస్సార్ శ్రీకాకుళం జిల్లా నాయకులు పిరియా సాయిరాజ్, పేరాడ తిలక్ వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. -
‘అది ఎవరికీ సాధ్యం కాలేదు’
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటం చారిత్రక ఘట్టమని వైఎస్సార్ సీపీ నాయకురాలు కిల్లి కృపారాణి వ్యాఖ్యానించారు. 50శాతం ఓట్ షేర్ సాధించటం ఎవరికీ సాధ్యంకాలేదని పేర్కొన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కుటుంబం పట్ల ఉన్న జనాధరణకు ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ రోగులకు 10వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం హర్షణీయమన్నారు. మద్యం అమ్మకాల నియంత్రణకు, బెల్ట్ షాప్‌ల నిర్మూలన పట్ల ప్రకటన చేయడం అభినందనీయమన్నారు. అవినీతి రహిత సమాజానికి సీఎం వైస్ జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని కోరారు. జన్మభూమి కమిటీల మాఫీయాకు చరమగీతం పాడి, సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇస్తామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల నియామకం ద్వారా లక్షా అరవైవేల మందికి ఉపాధి లభించనున్నదని పేర్కొన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఏపీ ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి బుద్ధి చెప్పారన్నారు. -
జగన్ సీఎం కాకుంటే రాజకీయ సన్యాసం
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఈ నెల 23వ తేదీన రానున్న ఫలితాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా సీట్లు గెలుచుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. అలా జరగకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఈ సవాలుకు టీడీపీ నాయకులు సిద్ధమా అని శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఈవీఎంల పనితీరు అమోఘమని, ఇంతకు మంచిన టెక్నాలజీ ఎక్కడా లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకుని ఏమి చేయాలో తెలియక ఓటింగ్ యంత్రాలను తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ఎలాగూ ఓడిపోతామని.. ఉన్నంతకాలమైనా పాలించేద్దామని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, ఎన్నికల అధికారులపై, సీఎస్‌పై ఇష్టం వచ్చినట్లు పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. దీన్నిబట్టి చూస్తే బాబుకి మతి భ్రమించిందని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు చరమగీతం జిల్లాలో 10 ఎమ్మెల్యే స్ధానాలతోపాటు జిల్లా పరిధిలో ఉన్న 3 ఎంపీ స్థానాలు వైఎస్సార్సీపీవేనని కృపారాణి చెప్పారు. టీడీపీ అరాచక పాలనతో విసుగు చెందిన ప్రజలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పు కావాలని కోరుకుంటున్నారన్నారు. టీడీపీకి, చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడేందుకు మరో నాలుగు రోజులే మిగిలున్నాయన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్లలో ప్రజా సమస్యలపై నిలదీస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారన్నారు. చంద్రబాబు బోగస్ సర్వేలతో ప్రజలకు మభ్యపెడుతున్న తీరు హాస్యాస్పదమన్నారు. కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అల్లర్లు సృష్టించడంలో నేరుగా చంద్రబాబే టీడీపీ నేతలకు శిక్షణ ఇచ్చిఉన్నారన్నారు. పోలింగ్ జరిగిన నాడే అనేక ప్రాంతాల్లో గొడవలు సృష్టించారని, ఈసీ ముందుజాగ్రత్త చర్య వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. మరో నాలుగు రోజుల్లో టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజ యరావు, శిమ్మ రాజశేఖర్, కె.ఎల్.ప్రసాద్, కోరాడ రమేష్, టి.కామేశ్వరి, పి.సుగుణారెడ్డి, గుంట జ్యోతి, పి.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన కిల్లి కృపారాణి
-
జగన్ అజెండా సెట్ చేస్తే..చంద్రబాబు రియాక్షన్..
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత కిల్లి కృపారాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆమె గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సమావేశం అయ్యారు. అనంతరం వైఎస్ జగన్... కిల్లి కృపారాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కిల్లి కృపారాణి మీడియాతో మాట్లాడుతూ...‘నిబద్ధత ఉన్న నాయకుడు వైఎస్ జగన్. రాటుదేలిన రాజకీయ నాయకుడు వైఎస్ జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశంపై వైఎస్ జగన్ ఓ అజెండా సెట్ చేస్తున్నారు. చంద్రబాబు దానికి రియాక్ట్ అవుతున్నారు. అజెండాను సెట్ చేసే వారే నాయకుడు అవుతారు. ప్రత్యేక హోదా నినాదం ఇంకా సజీవంగా ఉండటానికి కారణం వైఎస్ జగన్. వైఎస్సార్ సీపీ పోరాటాల వల్లే ఇప్పటికీ హోదా సజీవంగా ఉంది. చంద్రబాబుకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే యూపీఏలో ఎందుకు చేరలేదు?. చంద్రబాబు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు పప్పుఉ బెల్లంలా ఏదో ఇస్తున్నారు. డబ్బుతో ఓటర్లను చంద్రబాబు కొనాలనుకుంటున్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు దెబ్బతీశారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, ప్రత్యేక హోదాను తీసుకురాలేదు. హోదాను మోదీ కాళ్ల కింద తాకట్టు పెట్టారు. సంతలో పశువుల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. నీచమైన రాజకీయాలకు చరమగీతం పాడాలి. చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’ అని అన్నారు. -
బడ్జెట్లో ఏపీని విస్మరించిన కేంద్రం
శ్రీకాకుళం సిటీ: విభజన చట్టంలో హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, దీనికి కేంద్ర బడ్జెట్ అద్దం పడుతోందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని అన్నారు. ఓటుకు నోటు కేసును ఎదుర్కొంటామనే భయంలో సీఎం చంద్రబాబు ఉన్నారని, అందుకే కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత నాలుగు బడ్జెట్లలోనూ ఏపీకి అన్యాయమే జరిగిందన్నారు. ఆఖరి బడ్జెట్లోనైనా కనికరం, దయ చూపిస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారన్నారు. విభజన చట్టంలోని ఒక్క హామీని ప్రస్తావించకుండా బడ్జెట్ ముగించడం.. ఏపీపై ప్రధాని చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఈ బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపులు పెంచుతారని ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూశారని కానీ అవన్నీ అడియాశలయ్యాయని కృపారాణి విమర్శించారు. ఎంపీల జీతాలు పెంచడం హాస్యాస్పదమన్నారు. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. హోదా కోసం పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటయితే ఇది సాధ్యమన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు డోల జగన్, కాంగ్రెస్ నాయకులు కిల్లి రామ్మోహనరావు, చౌదరి సతీష్, రత్నాల నరసింహమూర్తి, ఎంఏ బేగ్, గోవిందమల్లిబాబు, కేఎల్ఆర్ ఈశ్వరి, అల్లిబిల్లి రాధ తదితరులు పాల్గొన్నారు. -
లక్షా 70 వేలకు... 20 వేల పోస్టులే భర్తీనా !!
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువతను మోసగించారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. సోమవారం శ్రీకాకుళంలో ఆమె మాట్లాడుతూ... అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా యువతకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకపోగా..ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తున్నారని మండిపడ్డారు. గృహనిర్మాణ రంగంలో 6వేల మందిని, ఇరిగేషన్ శాఖలో 7వేల మందిని, ఆశావర్కర్లను ఉద్యోగాల నుంచి తొలగించారని అన్నారు. విద్యుత్‌శాఖలో 21 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగాల ఖాళీల సంఖ్యను లెక్కించేందుకు కమలనాథన్ కమిటీ వేసిందని, ఈ కమిటీ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్‌లో రిటైరయ్యే 30 వేల మందితో కలిపి 1,72, 825 ఖాళీలు ఉన్నట్లు నివేదిక తెలిపిందని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 20 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డోల జగన్మోహనరావు, డాక్టర్ కిల్లి రామ్మోహన్రావు, మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ర్ట మంత్రి కిమిడి మృణాళిని, కన్నడ నటుడు సుదీప్ లు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరు ఉదయం వీఐపీ ప్రారంభదర్శనంలో స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం సుదీప్ మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో ఎంతో ప్రశాంతత ఉంటుందని అన్నారు. -
'బాబు ప్రచార ఆర్భాటంతోనే 30 మంది బలి'
శ్రీకాకుళం అర్బన్: గోదావరి పుష్కరాల్లో సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటమే 30 మందిని పొట్టన పెట్టుకుందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే అంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కొండ్రు మురళీమోహన్, ఎమ్మెల్సీ పీరుకట్ల పాల్గొన్నారు. -
వాస్తవాలు వెలుగు చూస్తాయనే విపక్ష నేత మైక్ కట్
కేంద్ర మాజీ మంత్రి కృపారాణి శ్రీకాకుళం: వాస్తవాలు వెలుగు చూస్తాయనే భయంతోనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడే సమయంలో సీఎం ఆదేశాలతోనే స్పీకర్ మైక్ కట్ చేశారని కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమలపై జగన్ మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేయడం ప్రతిపక్షం గొంతు నొక్కడమేనన్నారు. రుజువులతో సహా ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే అదికారపక్షం వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. స్పీకర్ కోడెల సభానాయకుని చేతిలో కీలుబొమ్మలా మారడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష నేత మైక్ క ట్ చేయడం ఎన్నడూ చూడలేదన్నారు. -
మీకో నమస్కారం.. మరి రావద్దు!
పలాస : ‘పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజన పాపం మూటకట్టుకుంది.. దీనివల్ల మేం ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం.. కార్యకర్తలు కూడా సహకరించటం లేదు.. ఈ పరిస్థితుల్లో పోలింగ్ ఏజెంట్లను పెట్టమంటున్నారు.. మా వల్ల కాదు.. దీనికోసమైతే మీరు మళ్లీ రావద్దు.. మీకో నమస్కారం..’ అని పలాస-కాశీబుగ్గ పట్టణ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి స్పష్టం చేశారు. ఊహించని చేదు అనుభవం ఎదురుకావటం తో ఆమె కంగుతిన్నారు. కళతప్పిన ముఖంతో వెనుదిరిగారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజులే సమయం ఉండటంతో కృపారాణి, ఆమె భర్త కిల్లి రామ్మోహనరావు, పలాస నియోజకవర్గ అభ్యర్థి వంక నాగేశ్వరరావులు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్ని లక్ష్మి నివాసానికి వెళ్లారు. మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు పార్టీ ఏజెంట్లను నియమించాలని లక్ష్మి, ఆమె భర్త దుర్గాప్రసాద్‌లను కృపారాణి కోరారు. బూత్ ఖర్చులు తాను భరిస్తానని చెప్పారు. కనీసం ఏజెంట్లను పెట్టుకోకపోతే పరువుపోతుందని వాపోయారు. దీనిపై దుర్గాప్రసాద్ ఘాటుగా స్పందిస్తూ, మున్సిపాలిటీ లో ఇప్పటివరకు ప్రచారమే చేయలేకపోయామని.. ఇప్పటికిప్పుడు ఏజెంట్లను పెట్టమంటే ఎలాగని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న కృపారాణి ముఖం చిన్నబుచ్చుకుని వెళ్లిపోయారు. తర్వాత వంక నాగేశ్వరరావు తన ముఖ్య అనుచరుడిని ప్రత్యేకంగా పంపి రాయబారం నడిపినా ప్రయోజనం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను నియమించుకోలేని దయనీయ పరిస్థితి ఒక్క మున్సిపాలిటీకే పరిమితం కాలేదు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. -
కాంగ్రెస్ మార్కు దౌర్జన్యకాండ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు ఎలాగూ ఓట్లేయరు.. కనీసం పోస్టల్ బ్యాలెట్నయినా మేనేజ్ చేయాలి.-ఇదీ జిల్లా కాంగ్రెస్ పెద్దల పన్నాగం.దీనికోసం ఏం చేయాలి!? ఉద్యోగులను టార్గెట్ చేద్దాం! ముందు సామాదానభేదోపాయాలు ప్రయోగిద్దాం. వింటే సరే సరి. లేకుంటే దండోపాయమే!-ఇదీ కాంగ్రెస్ నేతల వ్యూహంమరి ఈ పని ఎవరు చేస్తారు!? ఇంకెవరు మన పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాల పెద్దలు ఇద్దరు ఉన్నారు కదా! వారినే ప్రయోగిద్దాం!-ఇదీ వారి కార్యాచరణ. కేంద్రమంత్రి కృపారాణి సూత్రధారిగా, ఆమెకు సన్నిహితులైన ఇద్దరు ఉద్యోగ సంఘాల పెద్దలు పాత్రధారులుగా ప్రణాళికను అమలు చేసేస్తున్నారు. కుతంత్రం కథా కమామిషు.. చరిత్రలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓటమి ఎలాగూ తప్పదని తేలిపోయింది. కనీసం పరువు దక్కించుకోవాలంటే డిపాజిట్లు దక్కాలి కదా అని కాంగ్రెస్ అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. దీనిపై కేంద్రమంత్రి కృపారాణితోసహా ఆ పార్టీ అభ్యర్థులు కొన్ని రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ క్రమంలో వారి దృష్టి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లపై పడింది. ఉద్యోగులు ఎలాగూ కొన్ని రోజులు ముందే పోస్టల్ బ్యాలెట్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి వారిని మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రి కృపారాణి వర్గంలో శ్రీకాకుళం పట్టణంలో ఉండే ఉద్యోగ సంఘాల కీలక నేతలు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరి కుటుంబ సభ్యుడు ఆ పార్టీ అభ్యర్థి కూడా కావడం గమనార్హం. దాంతో ఆ ఉద్యోగ సంఘాల నేతల ద్వారా ఉద్యోగులను మేనేజ్ చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఎంతైనా ఖర్చుచేసేందుకు, వినకుంటే బెదిరించేందుకు కూడా సన్నద్ధమయ్యారు. ఏం చేస్తున్నారంటే... ఉద్యోగ సంఘాల నేతలిద్దరూ ఉద్యోగుల జాబి తాతో సహా రంగంలోకి దిగారు. మొదట వాణిజ్య పన్నుల శాఖ, వైద్యఆరోగ్య శాఖలో ఉద్యోగులను టార్గెట్ చేసుకున్నారు. ఉద్యోగుల ఇళ్లకు వెళుతూ పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వేయాలని చెబుతున్నారు. ఆ బ్యాలెట్ తమకు చూపించి పంపాలని షరతు విధిస్తున్నారు. అం దుకు ఇంత ఇస్తామని చెబుతున్నారు. సహచర ఉద్యోగుల బ్యాలెట్ ఓట్లను కూడా కూడగడితే భారీగా ముట్టచెబుతామని ఆశ చూపిస్తున్నారు. అందుకు సదరు ఉద్యోగి సరేనంటే సరే. లేకపోతే ఆయన్ని బెదిరిస్తున్నారు. ‘నీకు సర్వీసులో ఇబ్బం ది వస్తే మేం కావాలా? ఇప్పుడు మా వాడికి ఓటు వేయమంటే నాన్చుతావా? మాకు చూపించి పోస్టల్ బ్యాలెట్ వేయ్.. లేకపోతే తర్వాత సర్వీసు లో నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలో మాకు తెలుసు’ అని హెచ్చరిస్తున్నారు. ‘ప్రభుత్వం ఏ పార్టీది వచ్చినా సరే యూనియన్‌లో మేమే ఉంటాం కదా! మా అవసరం రాదనుకుంటున్నావా? నీ సంగతి తేలుస్తాం..’అని సూటిగానే బెదిరిస్తున్నా రు. దాంతో కొంతమంది ఉద్యోగుల భయంతో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా బ్యాలెట్ ఓటు వేస్తున్నారు. ఒక్కసారి చెబితే మాట వినని ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. శ్రీకాకుళం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఉద్యోగికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. మాట వినకపోవడంతో ఆయన్ని తీవ్రస్థాయిలో బెదిరిం చారు. దాంతో ఆయన ఒకానొక దశలో హడలిపోయారు. దాదాపు ఆయనతో బలవంతంగా పోస్ట ల్ బ్యాలెట్ తమకు అనుకూలంగా వేయించారు. శ్రీకాకుళంలో మరికొందరు ఉద్యోగులకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. దాంతో ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ ఉద్యోగుల్లో గుబులు పట్టుకుంది. వారిద్దరు ఎన్నికల విధులకు మినహాయింపా! ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలిద్దరికి మాత్రం జిల్లా ఉన్నతాధికారులు ఎందుకనో మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్రమంత్రి కృపారాణి ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. దాంతో ఆ ఉద్యోగ సంఘాల నేతలు ఇద్దరు చెలరేగిపోతున్నారు. ఉద్యోగులను ఒక్కొక్కరిగా టార్గెట్ చేసుకుని పోస్టల్ బ్యాలెట్ కోసం వేధిస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు ఉద్యోగ సంఘాల నేతల బెదిరింపులపై కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు. వారిద్దరిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ సౌరభ్ గౌర్‌కు విజ్ఞప్తి చేశారు. వారిద్దరికీ ఎన్నికల విధులు కేటాయించాలని కోరారు. లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ను తమ అభిమతం ప్రకారం వినియోగించుకోలేక ఉద్యోగుల హక్కుకు భంగం వాటిల్లుతోందని చెప్పుకొచ్చారు. మరి దీనిపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే! -
రక్షమాం.. పాహిమాం
ఏలూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు పూనుకుని కష్టాల్లో మునిగిపోరుున కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే ఆదుకోవాలని కేంద్ర మంత్రి, పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు కొణిదల చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునే చర్యల్లో భాగంగా బస్సుయూత్ర చేపట్టిన సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రులు జేడీ శీలం, ఎంఎం పళ్లంరాజు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి ఆదివారం ఉదయం ఏలూరు చేరుకున్నారు. స్థానిక మర్చంట్ చాంబర్ కల్యాణ మండపం వద్ద చిరంజీవికి, కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రఘువీరారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో సభ వెలవెలబోరుుంది. అతికొద్ది మంది కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు హాజరుకాగా, వారితోనే సభ నడిపించారు. చిరంజీవి అభిమానులు ‘సీఎం చిరంజీవి, జై చిరంజీవా’ అంటూ నినాదాలు చేయడంతో అలా అనొద్దని చిరంజీవి సైగలతో వారిని వారించారు. ఈ నినాదాల మధ్య సభను నడ పలేక మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఒకానొక దశలో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా మీకిది మర్యాద కాదంటూ చిరంజీవి అభిమానులను హెచ్చరించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతుండగా, ఉంగుటూరు నుంచి వసంత్‌కుమార్ పోటీ చేయాలని పలువురు కేకలు వేశారు. కాంగ్రెస్‌కు శీల పరీక్ష కేంద్ర మంత్రులు చిరంజీవి, రఘువీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ విభజన పాపం కాంగ్రెస్‌ది కాదని చెప్పుకొచ్చారు. దీనికి టీడీపీ సహా పలు పార్టీలు మద్దతు పలకడం వల్లే సీడబ్ల్యుసీ తీర్మానం చేసిందన్నారు. విభజన భాధాకరమని.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శీఘ్రంగా కోలుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మబలికారు. పాతనీరు పోతే పోయిందని.. కొత్త వారికి అవకాశాలు వస్తాయన్నారు. చంద్రబాబు వలసలను ప్రోత్సహించడం.. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా అందులో చేరిపోవడం వారి అనైతికతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సమైక్య చాంపియన్ అయిపోదామనుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం విడిపోయూక కొత్తపార్టీ పెట్టి నవ్వుల పాలయ్యూరని రఘువీరా నిప్పులు చెరిగారు. బస్సు యాత్ర ద్వారా పార్టీల కుతంత్రాలను ప్రజలకు వివరిస్తున్నామని, రథయూత్ర తరహాలో సాగుతున్న దీని చక్రాల కింద ఇతర పార్టీలు నలిగిపోరుు నాశనం అవుతాయని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ శీల పరీక్ష ఎదుర్కొంటోందని, ఈ గండం నుంచి పార్టీని గట్టెక్కించి నవ్యాంధ్రప్రదేశ్ కోసం అందరూ పనిచేయాలని కోరారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర రంగాల్లో సీమాంధ్రను దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని వివరించారు. కేంద్ర మంత్రులు ఎంఎం పళ్లంరాజు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, రాష్ట్ర తాజా మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్, కొండ్రు మురళి, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయూలని కోరారు. ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మల్లిపూడి కనకదుర్గ, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గద్దె వెంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఆర్‌కే చౌదరి, పీసీీసీ ప్రధాన కార్యదర్శి రాజనాల రామ్మోహన్రావు, అలగా రవికుమార్, బీవీ రాఘవయ్య చౌదరి, బద్దా ఆనంద్‌కుమార్, కమ్ముల కృష్ణ, చిట్టిబొమ్మ వెంకటస్వామి పాల్గొన్నారు. సభ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ శ్రేణులకు వీడ్కోలు పలికిన చిరంజీవి బస్సుయాత్ర విజయవాడకు బయల్దేరింది. -
నువ్వే.. నువ్వే!
మరణానికి ముందే పోస్టుమార్టం మొదలైపోయింది. ఆ మరణానికి కారణం మీరంటే.. మీరనే నిందారోపణలు, పరస్పర ఫిర్యాదులు ఊపందుకున్నాయి. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజల చేతుల్లో ఎలాగూ మరణం(ఓటమి) తప్పదని గ్రహించినట్లున్నారు జిల్లా కాంగ్రెస్ భారాన్ని ప్రస్తుతం మోస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు. దానికి బాధ్యులెవరన్న చర్చ వచ్చి తీరుతుంది. ఆ మచ్చ తమపై పడకుండా అప్రమత్తమవుతున్నారు. అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికలు పూర్తికాకముందే.. ఆ ఎన్నికల్లో ఎదుర్కోబోయే పరాజయానికి బాధ్యత ఎవరన్నదానిపై కేంద్రమంత్రి కృపారాణి, రాష్ట్రమాజీ మంత్రి కోండ్రు మురళీ పరస్పర ఫిర్యాదులకు తెరతీశారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా పార్టీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోండ్రు అధిష్టానం ప్రతినిధులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన వర్గీయులతో కూడా ఫిర్యాదులు చేయించాలని భావిస్తున్నారు. మరోవైపు కృపారాణి కూడా కోండ్రు మురళీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కనీసం సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దర్పం తప్ప బాధ్యత ఏదీ? కృపారాణిపై ఫిర్యాదు జిల్లాలో అధికార స్థానంలో ఉన్న ఏకైక నేత అయినప్పటికీ కృపారాణి పార్టీని పట్టించుకోవడం లేదని కోండ్రు వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆమె ఇంతవరకు పార్టీ నేతలతో చర్చించలేదని ఈ వర్గం ఆరోపిస్తోంది. జిల్లా కేంద్రానికి రావడం లేదు.. కనీసం పార్టీ జిల్లా అధ్యక్షుడు డోల జగన్‌తో కూడా చర్చించనే లేదని కృపారాణికి వ్యతిరేకంగా ఫిర్యాదులు గుప్పిస్తోంది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే సత్యవతితోగానీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్తోగానీ మాట్లాడటానికి కేంద్రమంత్రి ఇష్టపడటం లేదని కూడా కోండ్రు వర్గం చెప్పుకొచ్చింది. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో అభ్యర్థులను కూడా పోటీ పెట్టలేని దుస్థితికి పార్టీని దిగజార్చారని ఆరోపిస్తోంది. కృపారాణి ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు.. అయినా తన భర్త, పార్టీ నాయకుడైన కిల్లి రామ్మోహన్రావుకైనా బాధ్యతలు అప్పగించకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనే పార్టీ పరిస్థితి ఇంతగా దిగజారితే.. ఇక జిల్లా, మండల పరిషత్తు ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని కోండ్రు అధిష్టానానికి స్పష్టం చేశారు. కృపారాణి తీరు ఇలాగే కొనసాగితే పార్టీ ఉనికే ప్రశ్నార్థంగా మారిపోతుందని తేల్చిచెప్పేశారు. అసలు కోండ్రు ఎక్కడున్నారు? కేంద్రమంత్రి ఎదురుదాడి కృపారాణి కూడా అంతే దీటుగా కోండ్రు మురళీపై ఎదురుదాడి చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిని గుప్పిట్లో పెట్టుకుని కూడా పార్టీని ఆయన పట్టించుకోవడం మానేశారని అధిష్టానం ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. డోల జగన్ ఇంతవరకు పార్టీ సమావేశం నిర్వహించకపోవడాన్ని కోండ్రు వైఫల్యంగానే ఆమె చెప్పుకొస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం ఎచ్చెర్ల, ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాంలలోనే అత్యధికంగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్న విషయాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలతో సామరస్యంగా మాట్లాడకుండా కోండ్రు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. అందువల్లే పార్టీలో ఉండాల్సిన కొంతమంది కూడా రాజీనామా బాట పడుతున్నారని కృపారాణి అధిష్టానం ప్రతినిధులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందుకు పాలకొండ సీనియర్ నేత సామంతుల దామోదర రావు పార్టీ మారడాన్ని ఆమె ఉదాహరణగా చూపుతున్నారు. కోండ్రు మురళి ఇటీవల పాలకొండ వెళ్లినప్పుడు సామంతుల వర్గీయులతో సామరస్యంగా చర్చించకుండా హెచ్చరిక స్వరంతో మాట్లాడారని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాకుళం నియోజకవర్గంతోపాటు మరికొన్ని చోట్ల ఏమాత్రం స్థాయిలేని నేతలకు టిక్కెట్లు ఇప్పిస్తామని ఆయన హామీలు ఇచ్చేస్తుండటంతో పార్టీ మరింతగా దిగజారుతోందని కృపారాణి ఆరోపిస్తున్నారు. ఇలా కోండ్రు, కృపారాణి పరస్పరం ఆరోపణలతో కాంగ్రెస్‌లో విభేదాల కుంపటి రాజుకుంది. రాబోయే పార్టీ ఓటమికి కారణమంటూ ముందస్తుగానే పరస్పరం ఆరోపణలతో కాంగ్రెస్వర్గ విభేదాలు రక్తి కడుతున్నాయి. -
మేడమ్.. కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదు
పలాస, న్యూస్‌లైన్ : ‘నమ్ముకున్నవారు నట్టేట ముంచారు.. కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఉన్న కొద్దిమంది పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకురావడం లేదు. పార్టీ పరిస్థితి బాగోలేదు.. చాలా కష్టంగా ఉంది.. నామినేషన్లు వేయడానికి ఒక్కరోజే సమయముంది.. ఏం చేయమంటారు..’ అని కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న కేంద్ర మంత్రి సమావేశంలో కొద్దిసేపు మాత్రమే ఉండి.. కొన్ని సూచనలిచ్చి వెళ్లిపోయారు. కాశీబుగ్గలోని మున్సిపల్ మాజీ చైరపర్సన్ కోట్ని లక్ష్మి భర్త దుర్గాప్రసాద్ కార్యాలయంలో గురువారం ఉదయం, సాయంత్రం కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఉదయం జరిగిన సమావేశానికి హాజరైన మంత్రి కృపారాణి మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు తీవ్ర నిస్సహాయత వ్యక్తం చేశారు. మొన్నటివరకు కేంద్రమంత్రి వెంట తిరిగిన పలువురు మాజీ కౌన్సిలర్లు ముఖం చాటేయ గా కర్రి మాధవరావు, అట్టాడ మాధవరావు, రేగి గవరయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ మూడవ వార్డులో రేగి గవరయ్యను పోటీకి పెడతామని, ఆయనకు మద్దతు ఇవ్వాలని కర్రి మాధవరావును కోరారు. అందుకు ఆయన ససేమిరా అనటంతో కంగుతిన్నారు. ఈసారి వార్డు రిజర్వేషన్ తనకు వర్తించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మీసాల సురేష్‌కు మద్దతు ఇస్తానని మాధవరావు స్పష్టం చేశారు. గతంలో ఆయన తనకు మద్దతు ఇచ్చారని, ఈసారి ఆయనకు మద్దతి స్తానని మాటిచ్చానని, ఇచ్చిన మాట తప్పలేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పోటీ చేయలేమని అట్టాడ మాధవరావు, రేగి గవరయ్య చెప్పినట్టు తెలిసింది. దీంతో అన్ని వార్డులకు పోటీ చేయాలని, పాతవారు లేకపోతే కొత్తవారిని ప్రోత్సహించి శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కృపారాణి నిష్ర్కమించారు. సమావేశం లో మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద, హనుమంతు వెంకట రావు, వంక నాగేశ్వరరావు, కోట్ని దుర్గాప్రసాద్, పుక్కళ్ల గురయ్యనాయుడు, తిమడాన కృష్ణారావు, ఉర్నాన అప్పలరాజు తదితరులు పాల్గొన్నా రు. సాయంత్రం డీసీసీ అధ్యక్షుడు డోల జగన్ సమక్షంలో సమావేశమైన నేతలు పరిస్థితి ఆశాజనకంగా లేదన్న అంచనాకు వచ్చినట్టు తెలిసింది. కనీసం పార్టీ పరువు దక్కించుకోవటానికైనా అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. -
కిల్లీ .. ఢిల్లీ ..!
-
ఆహా.. ఏమి కృప!
పలాస మున్సిపాలిటీలో ఇళ్ల పట్టాల కుంభకోణం 2003 అప్పటి పలాస ఎమ్మెల్యే రేవతీపతి మున్సిపాలిటీ పరిధిలోని నర్సిపురంలో 620 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 2004 అప్పటి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర అదే నర్సిపురం పేదలకు పట్టాలు ప్రసాదించారు. 2012 తహశీల్దార్‌గా వచ్చిన పార్వతీశ్వరరావు పాత వారి పట్టాలు రద్దు చేసి కొత్తవారికి ఇస్తామని ప్రకటించారు. 2 నెలల క్రితం: కేంద్రమంత్రి కృపారాణి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. .. ఏమిటీ?.. నర్సిపురం పేదలపై ఇంత మంది ప్రేమ కురిపించారా?!.. అలా అయితే అక్కడ స్థలాలు లేని పేదలంటూ ఉండరని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. స్థలం ఒకటే.. లబ్ధిదారులే మారారు. నేతలు, అధికారులు మారినప్పుడల్లా జాబితాలు మారిపోయాయి. ఒకే స్థలంలో ఇద్దరు ముగ్గురికి పట్టాలు ఇచ్చేయడంతో వారు కొట్టుకునే పరిస్థితి దాపురించింది. పలాస, న్యూస్‌లైన్: తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు.. నేతలు, అధికారులు కలిసి పేదల ఆశలతో ఆడుకున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పదో వార్డు పరిధిలోని నర్సిపురంలో ఒకే స్థలంలో వందల మందికి మళ్లీ మళ్లీ పట్టాలు ఇచ్చి వారిలో వారు తన్నుకునే పరిస్థితి కల్పించి.. చోద్యం చూస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ పట్టాల ప్రహాసనం అటు తిరిగి.. ఇటు తిరిగి కేంద్ర మంత్రి కృపారాణి జోక్యంతో కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లోకి వెళ్లిపోయింది. తమ నాయకులు సూచించిన వారికే పట్టాలు ఇవ్వాలని సాక్షాత్తు కేంద్రమంత్రే అధికారులను ఆదేశించారు. ఇంకేముంది రొట్టె విరగి నేతిలో పడిందని స్థానిక నాయకులు, అధికారులు సంబరపడ్డారు. పేదల నుంచి వేలకు వేలు దండుకొని పట్టాలు ఇచ్చేశారు. దీంతో పాత, కొత్త లబ్ధిదారులు పట్టాలు చేత పట్టుకొని, తమ స్థలాల వద్ద పడిగాపులు పడుతున్నారు. స్థలం తమదంటే తమదని ఘర్షణలకు దిగుతున్నారు. ఫలితంగా గత కొద్దిరోజులుగా ఆ ప్రాంతం ఘర్షణలు, వాగ్వాదాలకు నిలయంగా మారింది. బలమున్న వారు ఇష్టారాజ్యంగా పునాదులు వేస్తుంటే.. బలహీనులు లబోదిబోమంటున్నారు. అసలు విషయమేటంటే.. పదో వార్డు నర్సిపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 187లో 5.78 ఎకరాలు, సర్వే నెంబరు 188లో 3.89 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. మొత్తం 9.67 ఎకరాల ఈ స్థలంలో 620 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి అధికారులు లే అవుట్ వేశారు. ఆ మేరకు 2003లో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ రేవతిపతి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. తర్వాత 2004లో ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతు అప్పయ్యదొర కూడా అదే స్థలంలో మళ్లీ పట్టాలు పంపిణీ చేశారు. కాగా ఆ స్థలంలో ఇప్పటి వరకు ఎనిమిది కుటుంబాలే ఇళ్లు కట్టుకొని ఉంటున్నాయి. పట్టాలు ఇచ్చినా అధికారులు స్థలాలు చూపకపోవడం వల్లే ఇళ్లు కట్టుకోలేకపోయామని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం పలాస తహశీల్దారుగా వచ్చిన ఎల్.పార్వతీశ్వరరావు స్థలాలు చూపాల్సిన బాధ్యతను విస్మరించి ఇళ్లు కట్టుకోనందున పాత పట్టాలు రద్దు చేసి కొత్త వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు చర్యలు ప్రారంభించారు. కేంద్రమంత్రి జోక్యంతో మారిన సీను ఈ వ్యవహారం ఇంకా నలుగుతుండగానే.. సుమారు రెండు నెలల క్రితం పలాస పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కృపారాణికి ఈ విషయం తెలిసింది. ఎన్నికల ముందు ఈ పట్టాల పంపిణీని రాజకీయంగా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. అధికారులను పిలిచి తమ నాయకులు ఇచ్చే జాబితాల ప్రకారం పట్టాలు మంజూరు చేయాలని హుకుం జారీచేశారు.ఇంకేముంది.. మాజీమున్సిపల్ కౌన్సిలర్లు, అధి కారులు కుమ్మక్కయ్యారు. పట్టాలను అమ్ముకున్నారు. స్థలానికి రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసి నచ్చినవారిని లబ్ధిదారులజాబితాలో చేర్చేశారు. ఇలా సుమా రు రూ. కోటి వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. అక్కడంతా గందరగోళం మూడు నాలుగుసార్లు పట్టాలు పంపిణీ చేయడంతో అసలు పట్టాదారులెవరో.. ఎవరి స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా పాత, కొత్త లబ్ధిదారులు ఆ స్థలం వద్దకు తరలివచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రయత్నించడం, దాన్ని కొందరు అడ్డుకోవడం వంటి సంఘటనలతో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కనీసం చిన్న రోడ్డుకు కూడా స్థలం విడిచిపెట్టకుండా ఎవరికి వారు నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నర్సిపురం గ్రామానికి చెందిన ఎందరో ఇళ్లు లేని పేదలు, పలాస రైల్వే కాలనీలో గుడిసెల్లో ఉండి నిర్వాసితులైన వందలాది కుటుంబాలు తమ పాత పట్టాలు పట్టుకొని వచ్చినా స్థలం దొరక్క భోరున విలపిస్తున్నారు. కొంతమంది తమ స్థలాలు వద్ద పునాదులు తవ్వుతుంటే నేతల పేర్లు చెప్పి కొందరు బెదిరించి, పంపేస్తున్నారు. ఇదంతా మంత్రి కృపారాణి పుణ్యమేనని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. రోడ్డు ఆక్రమణ పదేళ్ల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉంటున్న బచ్చల చంద్రావతి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ సొంత డబ్బులతో రోడ్డు వేయించానని, ఇప్పుడు ఆ రోడ్డును కూడా ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట ట్రాక్టర్లతో మెటీరియల్ తీసుకొచ్చి విద్యుత్ స్తంభాన్ని కూడా విరగ్గొట్టేశారని, తమ ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయిందన్నారు. ఇదేమిటని అడిగితే కొట్టడానికి వస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని అక్కడ నివాసం ఉంటున్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అర్హులమైనా పట్టా ఇవ్వలేదు రైల్వేకాలనీలో జూబిడీలో ఉండేవారం. దాన్ని రైల్వే అధికారులు ఖాళీ చేయమన్నారు. దాంతో అద్దె ఇంట్లో చేరాం. నెలకు రూ.2 వేల అద్దె చెల్లించుకోలేక ఇబ్బంది పడుతున్నాం. నా భర్త టీవీ మెకానిక్. స్థలం ఇప్పించమని మంత్రి కృపారాణి దగ్గరకి పదిసార్లు వెళ్లాం. కలెక్టర్‌నూ కలిశాం. ఎవరెవరికో పట్టాలు ఇచ్చారు గానీ మాకు ఇవ్వలేదు. -ఆర్.భారతి, నర్సిపురం పట్టా ఉంది.. స్థలం లేదు నా భర్త వికలాంగుడు. నేను సిమెంటు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మాకు ఇల్లు కట్టుకోవడానికి పదేళ్ల క్రితం స్థలం ఇచ్చారు. పునాదులు వేద్దామని అక్కడికి వెళితే 10 మంది వచ్చి అడ్డుకున్నారు. ప్రతి ఒక్కరు ‘ఇది మా స్థలం’ అని గొడవ పెడుతున్నారు. దాంతో రాత్రీపగలు మిగతా పనులు మానేసి స్థలం వద్దే ఉంటున్నాను. -బమ్మిడి సరస్వతి, నర్సిపురం -
సిగపట్ల సంబరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా సాంస్కృ తిక వైభవాన్ని చాటి చెప్పాల్సిన సిక్కోలు సంబరాలు.. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తున్నాయి. అసలే జిల్లాపై పెత్తనం కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్న రాష్ట్ర మంత్రి కోండ్రు మురళి, కేంద్ర మంత్రి కృపారాణి చివరికీ సంబరాలనూ విడిచిపెట్టలేదు. ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఈ ఉత్సవాలు ఇప్పటికే వాయిదా పడగా.. తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై వీరిద్దరి పట్టుదల కారణంగా పీటముడి పడింది. మింగమంటే కప్పకు కోపం... వదలమంటే పాముకు కోపం అన్న చం దంగా ఉన్నతాధికారులు ఇరకాటంలో పడ్డారు. దాంతో అసలు సంబరాల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది. ఫిబ్రవరి రెండో వారంలోనే:కోండ్రు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సిక్కోలు సంబరాలు నిర్వహించడమేమిటని మంత్రి కోండ్రు ఆగ్రహించినట్లు తెలుస్తోంది. తామం తా హైదరాబాద్‌లో ఉన్న సమయంలో జిల్లాలో మీరు సంబరాలు చేసుకుంటారా అని ఆయన అధికార యంత్రాంగాన్ని నిలదీశారని సమాచారం. నెలాఖరు వరకు అసెంబ్లీ ఉంటుంది.. తర్వాత రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 7న ఉన్నందున తాము రాలేమని ఆయన తేల్చిచెప్పారు. అందువల్ల ఫిబ్రవరి రెండో వారంలో సంబరాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ప్రజాప్రతినిధుల తరపున తానీ మాటలు చెబుతున్నానని, పాటించాల్సిందేనని హుకుం జారీ చేశారు. తద్వారా తన మాటే వినాలన్న సంకేతాన్ని ఆయనఅధికారులకు పంపించారు. దాంతోపాటే ఉత్సవాలను కృపారాణి హైజాక్ చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఆయన ఆదేశాలకు జిల్లా యంత్రాంగం తలొగ్గింది. సంబరాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. కృపారాణి కస్సుబుస్సు కాగా సంబరాలు వాయిదా పడటం, దాని వెనుక పరిణామాలు కేంద్రమంత్రి కృపారాణిని అసంతృప్తికి, ఆగ్రహానికి గురి చేశాయి. ఉత్సవాలను వాయిదా వేయడం కంటే, మంత్రి కోండ్రు ఆదేశాల మేరకు ఫిబ్రవరి రెండోవారంలో నిర్వహించడానికి అధికారులు సమ్మతించడం ఆమెకు మింగుడు పడటం లేదు. ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. దాంతో మంత్రి కృపారాణి ఢిల్లీలో ఉండాల్సిందే. తాను లేకుండా సంబరాలు ఎలా నిర్వహిస్తారని ఆమె అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాష్ట్రమంత్రి చెబితే వాయిదా వేశారు సరే.. మరి కేంద్ర మంత్రిగా ఉండాల్సిన అవసరం లేదా అని ఆమె నిలదీస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తన ఆమోదంతోనే సిక్కోలు సంబరాల తేదీలను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసే ఫిబ్రవరి 25 వరకు జరపరాదని ఆమె చెప్పకనే చెప్పారు. సంకటంలో అధికార యంత్రాంగం ఈ పరిణామం జిల్లా అధికార యంత్రాంగాన్ని సంకట స్థితిలోకి నెట్టేసింది. రాష్ట్ర మంత్రి చెప్పినట్లు సిక్కోలు సంబరాలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలా?... కేంద్ర మంత్రి చెప్పినట్లు ఏకంగా ఫిబ్రవరి చివరి వారానికి వాయిదా వేయాలా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. కాగా ఫిబ్రవరి చివరివారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే మంత్రుల ఆధ్వర్యంలో సంబరాల నిర్వహణ సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో ఉన్నతాధికారులకు పాలుపోవడం లేదు. -
గన్మెన్లు ‘పాద’ రక్షకులా?
శ్రీకాకుళం: వీఐపీల రక్షణకు నియమించిన సిబ్బంది అనుక్షణం డేగకన్నుతో విధి నిర్వహణ చేయాలి. అయితే కొంతమంది ఈ విషయాన్ని మరుస్తుండడమే కాకుండా అతిగా కూడా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలే శ్రీకాకుళంలో జరిగాయి. వివరాల్లోకి వెళితే... అరసవల్లిలో జరుగుతున్న సౌరయాగానికి విజయనగరం ఎంసీ బొత్స ఝాన్సి వచ్చారు. ఆమెకు బందోబస్తు ఏర్పాటుకు శ్రీకాకుళం డీఎస్పీ శ్రీనివాసరావు ఆలయానికి వచ్చారు. ఆలయం బయట బందోబస్తును పర్యవేక్షిస్తున్న డీఎస్పీ వెనుక ఓ గన్‌మన్ ఉన్నాడు. అయితే ఆయన విధి నిర్వహణను మరిచి ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులపై ప్రశ్నల వర్షం కురిపించి ఇబ్బందులపాలు చేశారు. ఆఖరికి విధినిర్వహణలో ఉన్న ప్రెస్ ఫొటోగ్రాఫర్లను సైతం వదిలిపెట్టలేదు. ఓ దశలో ఆయన ఆక్రోశాన్ని వ్యక్తం చేశాడు. ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చిందో ఎవరికీ తెలియలేదు. ఇదిలా ఉండగా క్రిస్మస్ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న చర్చికి కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వచ్చారు. అక్కడ ఆమె గన్‌మన్ కేవలం చెప్పులకు కాపాలా కాస్తూ కనిపించాడు. దీనిని కొందరు వింతగా చూశారు. -
కృపారాణి ఇల్లు ముట్టడికి యత్నం
టెక్కలి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడానికి నిరసనగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం టెక్కలిలోని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో 12 మంది టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు, కె.రామ్మోహన్‌నాయుడుల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. స్థానిక ఆర్టీసి డిపో ఎదురుగా బైఠాయించి బస్సులను నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా మంటలు వేసి నిరసన తెలిపారు. కేంద్రమంత్రి ఫ్లెక్సీలను మంటల్లో వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పట్టణంలో ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుతో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రులు దిగ్విజయ్‌సింగ్, చిరంజీవి, పనబాక లక్ష్మీ, కృపారాణి, బొత్స సత్యనారాయణ, పల్లంరాజు, సోనియాగాంధీ తదితర దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్.ఎల్.నాయుడు, హనుమంతు రామకృష్ణ, చాపరా గణపతి, పి.అజయ్‌కుమార్, శేషు, కాళీ, రాము, బి.తవిటయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ముక్కలుకాకతప్పదన్న కిల్లి కృపారాణి
-
'రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోను'
-
'రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోను'
న్యూఢిల్లీ : రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోనని కిల్లి కృపారాణి మళ్లీ పాత పాటే పాడారు. ఆమో గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కృపారాణి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రజలను మభ్య పెట్టడం సమంజసం కాదన్నారు.రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటే తాను రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి లోబడే వ్యవహరించాలని ఆమె అన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో జీవోఎంను కలుస్తామని కిల్లి కృపారాణి తెలిపారు. తుపాను బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సోనియా గాంధీని కోరినట్లు ఆమె తెలిపారు. -
సోనియాతో కిల్లి కృపారాణి సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గురువారం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. కాగా రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వేసుకొన్న సమైక్య ముసుగు క్రమేణా తొలగిపోతోంది. అధిష్టానం రూపొందించిన వ్యూహంలో భాగంగా వారంతా ఇపుడు రెండో అంకానికి తెరలేపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు, సీమాంధ్ర ఎంపీలు సమైక్యస్వరాన్ని మార్చి విభజన వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. మిగతావారు కూడా అదే బాటపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొనేందుకు నేడు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ తొలిభేటీ అవుతోంది. -
కేంద్ర మంత్రి కృపారాణి కార్యాలయం ముట్టడి
రాష్ట్ర విభజనను నిరసిస్తూ కేంద్రమంత్రి, శ్రీకాకుళం లోక్‌సభ సభ్యురాలు కిల్లి కృపారాణి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని మంత్రి కిల్లి క్యాంప్ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోన్న కిల్లి కృపారాణి రాజీనామా చేయకపోవడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారన్న సమాచారంతో అందుకున్న ఉన్నతాధికారులు భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం విద్యార్థులను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల ప్రయత్నాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో కొద్ది పాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.