విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఈ నెల 23వ తేదీన రానున్న ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా సీట్లు గెలుచుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. అలా జరగకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఈ సవాలుకు టీడీపీ నాయకులు సిద్ధమా అని శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఈవీఎంల పనితీరు అమోఘమని, ఇంతకు మంచిన టెక్నాలజీ ఎక్కడా లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకుని ఏమి చేయాలో తెలియక ఓటింగ్ యంత్రాలను తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ఎలాగూ ఓడిపోతామని.. ఉన్నంతకాలమైనా పాలించేద్దామని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, ఎన్నికల అధికారులపై, సీఎస్‌పై ఇష్టం వచ్చినట్లు పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. దీన్నిబట్టి చూస్తే బాబుకి మతి భ్రమించిందని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
చంద్రబాబుకు చరమగీతం
జిల్లాలో 10 ఎమ్మెల్యే స్ధానాలతోపాటు జిల్లా పరిధిలో ఉన్న 3 ఎంపీ స్థానాలు వైఎస్సార్‌సీపీవేనని కృపారాణి చెప్పారు. టీడీపీ అరాచక పాలనతో విసుగు చెందిన ప్రజలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పు కావాలని కోరుకుంటున్నారన్నారు. టీడీపీకి, చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడేందుకు మరో నాలుగు రోజులే మిగిలున్నాయన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్లలో ప్రజా సమస్యలపై నిలదీస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారన్నారు. చంద్రబాబు బోగస్ సర్వేలతో ప్రజలకు మభ్యపెడుతున్న తీరు హాస్యాస్పదమన్నారు.
కౌంటింగ్ సమయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అల్లర్లు సృష్టించడంలో నేరుగా చంద్రబాబే టీడీపీ నేతలకు శిక్షణ ఇచ్చిఉన్నారన్నారు. పోలింగ్ జరిగిన నాడే అనేక ప్రాంతాల్లో గొడవలు సృష్టించారని, ఈసీ ముందుజాగ్రత్త చర్య వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. మరో నాలుగు రోజుల్లో టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజ యరావు, శిమ్మ రాజశేఖర్, కె.ఎల్.ప్రసాద్, కోరాడ రమేష్, టి.కామేశ్వరి, పి.సుగుణారెడ్డి, గుంట జ్యోతి, పి.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment