సిగపట్ల సంబరం
Published Wed, Jan 29 2014 2:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా సాంస్కృ తిక వైభవాన్ని చాటి చెప్పాల్సిన సిక్కోలు సంబరాలు.. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తున్నాయి. అసలే జిల్లాపై పెత్తనం కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్న రాష్ట్ర మంత్రి కోండ్రు మురళి, కేంద్ర మంత్రి కృపారాణి చివరికీ సంబరాలనూ విడిచిపెట్టలేదు. ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఈ ఉత్సవాలు ఇప్పటికే వాయిదా పడగా.. తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై వీరిద్దరి పట్టుదల కారణంగా పీటముడి పడింది. మింగమంటే కప్పకు కోపం... వదలమంటే పాముకు కోపం అన్న చం దంగా ఉన్నతాధికారులు ఇరకాటంలో పడ్డారు. దాంతో అసలు సంబరాల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది.
ఫిబ్రవరి రెండో వారంలోనే:కోండ్రు
అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సిక్కోలు సంబరాలు నిర్వహించడమేమిటని మంత్రి కోండ్రు ఆగ్రహించినట్లు తెలుస్తోంది. తామం తా హైదరాబాద్‌లో ఉన్న సమయంలో జిల్లాలో మీరు సంబరాలు చేసుకుంటారా అని ఆయన అధికార యంత్రాంగాన్ని నిలదీశారని సమాచారం. నెలాఖరు వరకు అసెంబ్లీ ఉంటుంది.. తర్వాత రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 7న ఉన్నందున తాము రాలేమని ఆయన తేల్చిచెప్పారు. అందువల్ల ఫిబ్రవరి రెండో వారంలో సంబరాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ప్రజాప్రతినిధుల తరపున తానీ మాటలు చెబుతున్నానని, పాటించాల్సిందేనని హుకుం జారీ చేశారు. తద్వారా తన మాటే వినాలన్న సంకేతాన్ని ఆయనఅధికారులకు పంపించారు. దాంతోపాటే ఉత్సవాలను కృపారాణి హైజాక్ చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఆయన ఆదేశాలకు జిల్లా యంత్రాంగం తలొగ్గింది. సంబరాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు.
కృపారాణి కస్సుబుస్సు
కాగా సంబరాలు వాయిదా పడటం, దాని వెనుక పరిణామాలు కేంద్రమంత్రి కృపారాణిని అసంతృప్తికి, ఆగ్రహానికి గురి చేశాయి. ఉత్సవాలను వాయిదా వేయడం కంటే, మంత్రి కోండ్రు ఆదేశాల మేరకు ఫిబ్రవరి రెండోవారంలో నిర్వహించడానికి అధికారులు సమ్మతించడం ఆమెకు మింగుడు పడటం లేదు. ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. దాంతో మంత్రి కృపారాణి ఢిల్లీలో ఉండాల్సిందే. తాను లేకుండా సంబరాలు ఎలా నిర్వహిస్తారని ఆమె అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాష్ట్రమంత్రి చెబితే వాయిదా వేశారు సరే.. మరి కేంద్ర మంత్రిగా ఉండాల్సిన అవసరం లేదా అని ఆమె నిలదీస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తన ఆమోదంతోనే సిక్కోలు సంబరాల తేదీలను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసే ఫిబ్రవరి 25 వరకు జరపరాదని ఆమె చెప్పకనే చెప్పారు.
సంకటంలో అధికార యంత్రాంగం
ఈ పరిణామం జిల్లా అధికార యంత్రాంగాన్ని సంకట స్థితిలోకి నెట్టేసింది. రాష్ట్ర మంత్రి చెప్పినట్లు సిక్కోలు సంబరాలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలా?... కేంద్ర మంత్రి చెప్పినట్లు ఏకంగా ఫిబ్రవరి చివరి వారానికి వాయిదా వేయాలా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. కాగా ఫిబ్రవరి చివరివారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే మంత్రుల ఆధ్వర్యంలో సంబరాల నిర్వహణ సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో ఉన్నతాధికారులకు పాలుపోవడం లేదు.
Advertisement