
శ్రీకాకుళం సిటీ: విభజన చట్టంలో హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, దీనికి కేంద్ర బడ్జెట్ అద్దం పడుతోందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని అన్నారు. ఓటుకు నోటు కేసును ఎదుర్కొంటామనే భయంలో సీఎం చంద్రబాబు ఉన్నారని, అందుకే కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత నాలుగు బడ్జెట్‌లలోనూ ఏపీకి అన్యాయమే జరిగిందన్నారు. ఆఖరి బడ్జెట్‌లోనైనా కనికరం, దయ చూపిస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారన్నారు.
విభజన చట్టంలోని ఒక్క హామీని ప్రస్తావించకుండా బడ్జెట్ ముగించడం.. ఏపీపై ప్రధాని చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఈ బడ్జెట్‌లో ఆదాయపన్ను మినహాయింపులు పెంచుతారని ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూశారని కానీ అవన్నీ అడియాశలయ్యాయని కృపారాణి విమర్శించారు. ఎంపీల జీతాలు పెంచడం హాస్యాస్పదమన్నారు. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. హోదా కోసం పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటయితే ఇది సాధ్యమన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు డోల జగన్, కాంగ్రెస్ నాయకులు కిల్లి రామ్మోహనరావు, చౌదరి సతీష్, రత్నాల నరసింహమూర్తి, ఎంఏ బేగ్, గోవిందమల్లిబాబు, కేఎల్‌ఆర్ ఈశ్వరి, అల్లిబిల్లి రాధ తదితరులు పాల్గొన్నారు.