మీకో నమస్కారం.. మరి రావద్దు!
పలాస : ‘పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజన పాపం మూటకట్టుకుంది.. దీనివల్ల మేం ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం.. కార్యకర్తలు కూడా సహకరించటం లేదు.. ఈ పరిస్థితుల్లో పోలింగ్ ఏజెంట్లను పెట్టమంటున్నారు.. మా వల్ల కాదు.. దీనికోసమైతే మీరు మళ్లీ రావద్దు.. మీకో నమస్కారం..’ అని పలాస-కాశీబుగ్గ పట్టణ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి స్పష్టం చేశారు. ఊహించని చేదు అనుభవం ఎదురుకావటం తో ఆమె కంగుతిన్నారు. కళతప్పిన ముఖంతో వెనుదిరిగారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజులే సమయం ఉండటంతో కృపారాణి, ఆమె భర్త కిల్లి రామ్మోహనరావు, పలాస నియోజకవర్గ అభ్యర్థి వంక నాగేశ్వరరావులు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోట్ని లక్ష్మి నివాసానికి వెళ్లారు. మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు పార్టీ ఏజెంట్లను నియమించాలని లక్ష్మి, ఆమె భర్త దుర్గాప్రసాద్‌లను కృపారాణి కోరారు. బూత్ ఖర్చులు తాను భరిస్తానని చెప్పారు. కనీసం ఏజెంట్లను పెట్టుకోకపోతే పరువుపోతుందని వాపోయారు.
దీనిపై దుర్గాప్రసాద్ ఘాటుగా స్పందిస్తూ, మున్సిపాలిటీ లో ఇప్పటివరకు ప్రచారమే చేయలేకపోయామని.. ఇప్పటికిప్పుడు ఏజెంట్లను పెట్టమంటే ఎలాగని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న కృపారాణి ముఖం చిన్నబుచ్చుకుని వెళ్లిపోయారు. తర్వాత వంక నాగేశ్వరరావు తన ముఖ్య అనుచరుడిని ప్రత్యేకంగా పంపి రాయబారం నడిపినా ప్రయోజనం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను నియమించుకోలేని దయనీయ పరిస్థితి ఒక్క మున్సిపాలిటీకే పరిమితం కాలేదు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.