జై కొట్టేదెవరికి
- రేపే పోలింగ్ పార్టీలకు అగ్ని పరీక్ష
- అతిరథుల దృష్టి ఇక్కడే
- అన్ని చోట్ల ఉత్కంఠ పోరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రధాన పార్టీలన్నీ తెలంగాణ అభివృద్ధి.. రాష్ట్ర వికాసమే ఏకైక ఎజెండాగా ఎంచుకోవటంతో జిల్లా ఓటర్లు ఎవరిని విశ్వసిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే సంక్షేమ పథకాలు తమ మేనిఫెస్టోలో పొందుపరిచాయి. అన్ని పార్టీల అతిరథ నేతలు ప్రచారంలో భాగంగా తొలి అడుగు ఇక్కడే వేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యమ ఖిల్లాగా పేరొందిన జిల్లాలో ఫలితమెలా ఉంటుందనేది రాష్ట్రమందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఘనత తమదేనని.. వికాసం కూడా తమ వల్లనే సాధ్యమవుతుందని ప్రచారం హోరెత్తించింది. స్వయానా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జిల్లా వేదికగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. ఆ పార్టీ తరఫున కేంద్రమంత్రులు జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్ రోడ్‌షోలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఛాంపియన్‌షిప్ తమదేనని.. ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ఆశలన్నీ నెరవేరాలంటే తమకే పట్టం కట్టాలని టీఆర్‌ఎస్ ప్రచారంలో ముందంజ వేసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో ప్రచారసభలు నిర్వహించారు. తమ మద్దతుతోనేతెలంగాణ వచ్చిందని.. అభివృద్ధి చేసే బాధ్యతను తమకే అప్పగించాలని బీజేపీ సైతం ప్రచారంలో దూసుకెళ్లింది. ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ భారత విజయయాత్రలో భాగంగా కరీంనగర్ సభలో పాల్గొన్నారు.
జనసేన పార్టీ నేత పవన్‌కల్యాణ్ హుస్నాబాద్, కోరుట్లలో మిత్రపక్షాల తరఫున ప్రచారం చేపట్టారు.ఊగిసలాట అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు జగిత్యాల నియోజకవర్గంలో ప్రచారసభలో పాల్గొన్నారు. ఎండలు లెక్క చేయకుండా.. అన్ని పార్టీల అతిరథ నేతలు జిల్లాకు తరలిరావటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
హోరెత్తిన ప్రచారం
ప్రధానపార్టీల అభ్యర్థులు ఎవరికివారుగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తించారు. సకుటుంబ సపరివారంగా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. గతంతో పోలిస్తే ఎన్నికల ఖర్చులోనూ అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో ప్రధాన పార్టీల అతిరథ నేతల సభలకు జనం భారీగా తరలిరావటం... పల్లెపల్లెనా అభ్యర్థుల ప్రచారానికి స్పందన కనిపించింది.
టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీకి దిగింది. జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. కరీంనగర్ ఎంపీ సీటుకు పాత కాపును.. పెద్దపల్లిలో విద్యార్థి ఉద్యమ నేతను ప్రయోగించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం అన్నిచోట్ల పోటీకి నిలిచింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు సామాజిక న్యాయం ఎజెండాగా టిక్కెట్లు పంపిణీ చేసింది. ఫలితంగా ఎక్కువ చోట్ల బలహీనమైన అభ్యర్థులు పోటీకి దిగారు. రామగుండం, కోరుట్లలో టిక్కెట్లు రాని అభ్యర్థులు తిరుగుబాటు జెండా ఎగరేశారు.
రెండు ఎంపీ స్థానాల్లోనూ బలంగా ఉన్న సిట్టింగ్‌లకు కాంగ్రెస్ అవకాశమిచ్చింది. పొత్తు విషయంలోనే మల్లగుల్లాలు పడ్డ టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు జిల్లాలో 12 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపాయి. చెరిసమంగా ఆరు స్థానాల్లో బీజేపీ, ఆరుచోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. కేడర్ లేకపోవటం టీడీపీని వెంటాడుతుండగా.. కొత్త జోష్ బీజేపీ అభ్యర్థులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. నామినేషన్ల పర్వంలో దొర్లిన తప్పుతో హుస్నాబాద్‌లో మిత్రపక్షాలు పోటీకి దూరమయ్యాయి.
తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్‌సీపీ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు, కరీంనగర్ ఎంపీ సీటుకు పోటీ పడుతోంది. మంథని, రామగుండం మినహా అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు.
మహానేత వైఎస్ అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారులు.. ఆయన అభిమానులు.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఉన్న జనాదరణను ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రచారం హోరెత్తించారు. పొత్తులు.. సీట్ల సర్దుబాటులో భంగపడటంతో జిల్లాలో సీపీఐ పోటీకి దూరమైంది. కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించింది. ఎంఐఎం స్థానికంగా ఉన్న అవగాహన మేరకు అభ్యర్థులకు మద్దతు ప్రకటించి రెండు ఓట్ల విధానానికి తెరలేపింది.