ఆహా.. ఏమి కృప! | municipality House track Scandal | Sakshi
Sakshi News home page

ఆహా.. ఏమి కృప!

Published Mon, Feb 24 2014 2:56 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM

municipality House track Scandal

 పలాస మున్సిపాలిటీలో  ఇళ్ల పట్టాల కుంభకోణం
 2003
 అప్పటి పలాస ఎమ్మెల్యే రేవతీపతి మున్సిపాలిటీ పరిధిలోని నర్సిపురంలో 620 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
 
 2004
 అప్పటి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర అదే నర్సిపురం పేదలకు పట్టాలు ప్రసాదించారు.
 
 2012 
 తహశీల్దార్‌గా వచ్చిన పార్వతీశ్వరరావు పాత వారి పట్టాలు రద్దు చేసి కొత్తవారికి ఇస్తామని ప్రకటించారు.
 
 2 నెలల క్రితం: కేంద్రమంత్రి కృపారాణి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. 
 .. ఏమిటీ?.. నర్సిపురం పేదలపై ఇంత మంది ప్రేమ కురిపించారా?!.. అలా అయితే అక్కడ స్థలాలు లేని పేదలంటూ ఉండరని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. స్థలం ఒకటే.. లబ్ధిదారులే మారారు. నేతలు, అధికారులు మారినప్పుడల్లా జాబితాలు మారిపోయాయి. ఒకే స్థలంలో ఇద్దరు ముగ్గురికి పట్టాలు ఇచ్చేయడంతో వారు కొట్టుకునే పరిస్థితి దాపురించింది.
 
 పలాస, న్యూస్‌లైన్: తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు.. నేతలు, అధికారులు కలిసి పేదల ఆశలతో ఆడుకున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పదో వార్డు పరిధిలోని నర్సిపురంలో ఒకే స్థలంలో వందల మందికి మళ్లీ మళ్లీ పట్టాలు ఇచ్చి వారిలో వారు తన్నుకునే పరిస్థితి కల్పించి.. చోద్యం చూస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ పట్టాల ప్రహాసనం అటు తిరిగి.. ఇటు తిరిగి కేంద్ర మంత్రి కృపారాణి జోక్యంతో కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లోకి వెళ్లిపోయింది. తమ నాయకులు సూచించిన వారికే పట్టాలు ఇవ్వాలని సాక్షాత్తు కేంద్రమంత్రే అధికారులను ఆదేశించారు. ఇంకేముంది రొట్టె విరగి నేతిలో పడిందని స్థానిక నాయకులు, అధికారులు సంబరపడ్డారు. పేదల నుంచి వేలకు వేలు దండుకొని పట్టాలు ఇచ్చేశారు. దీంతో పాత, కొత్త లబ్ధిదారులు పట్టాలు చేత పట్టుకొని, తమ స్థలాల వద్ద పడిగాపులు పడుతున్నారు. స్థలం తమదంటే తమదని ఘర్షణలకు దిగుతున్నారు. ఫలితంగా గత కొద్దిరోజులుగా ఆ ప్రాంతం ఘర్షణలు, వాగ్వాదాలకు నిలయంగా మారింది. బలమున్న వారు ఇష్టారాజ్యంగా పునాదులు వేస్తుంటే.. బలహీనులు లబోదిబోమంటున్నారు.
 
 అసలు విషయమేటంటే..
 పదో వార్డు నర్సిపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 187లో 5.78 ఎకరాలు, సర్వే నెంబరు 188లో 3.89 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. మొత్తం 9.67 ఎకరాల ఈ స్థలంలో 620 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి అధికారులు లే అవుట్ వేశారు. ఆ మేరకు 2003లో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ రేవతిపతి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. తర్వాత 2004లో ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతు అప్పయ్యదొర కూడా అదే స్థలంలో మళ్లీ పట్టాలు పంపిణీ చేశారు. కాగా ఆ స్థలంలో ఇప్పటి వరకు ఎనిమిది కుటుంబాలే ఇళ్లు కట్టుకొని ఉంటున్నాయి. పట్టాలు ఇచ్చినా అధికారులు స్థలాలు చూపకపోవడం వల్లే ఇళ్లు కట్టుకోలేకపోయామని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం పలాస తహశీల్దారుగా వచ్చిన ఎల్.పార్వతీశ్వరరావు స్థలాలు చూపాల్సిన బాధ్యతను విస్మరించి ఇళ్లు కట్టుకోనందున పాత పట్టాలు రద్దు చేసి కొత్త వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు చర్యలు ప్రారంభించారు. 
 
 కేంద్రమంత్రి జోక్యంతో మారిన సీను
 ఈ వ్యవహారం ఇంకా నలుగుతుండగానే.. సుమారు రెండు నెలల క్రితం పలాస పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కృపారాణికి ఈ విషయం తెలిసింది. ఎన్నికల ముందు ఈ పట్టాల పంపిణీని రాజకీయంగా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. అధికారులను పిలిచి తమ నాయకులు ఇచ్చే జాబితాల ప్రకారం పట్టాలు మంజూరు చేయాలని హుకుం జారీచేశారు.ఇంకేముంది.. మాజీమున్సిపల్ కౌన్సిలర్లు, అధి కారులు కుమ్మక్కయ్యారు. పట్టాలను అమ్ముకున్నారు. స్థలానికి రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసి నచ్చినవారిని లబ్ధిదారులజాబితాలో చేర్చేశారు. ఇలా సుమా రు రూ. కోటి వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. 
 
 అక్కడంతా గందరగోళం
 మూడు నాలుగుసార్లు పట్టాలు పంపిణీ చేయడంతో అసలు పట్టాదారులెవరో.. ఎవరి స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా పాత, కొత్త లబ్ధిదారులు ఆ స్థలం వద్దకు తరలివచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రయత్నించడం, దాన్ని కొందరు అడ్డుకోవడం వంటి సంఘటనలతో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కనీసం చిన్న రోడ్డుకు కూడా స్థలం విడిచిపెట్టకుండా ఎవరికి వారు నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నర్సిపురం గ్రామానికి చెందిన ఎందరో ఇళ్లు లేని పేదలు, పలాస రైల్వే కాలనీలో గుడిసెల్లో ఉండి నిర్వాసితులైన వందలాది కుటుంబాలు తమ పాత పట్టాలు పట్టుకొని వచ్చినా స్థలం దొరక్క భోరున విలపిస్తున్నారు. కొంతమంది తమ స్థలాలు వద్ద పునాదులు తవ్వుతుంటే నేతల పేర్లు చెప్పి కొందరు బెదిరించి, పంపేస్తున్నారు. ఇదంతా మంత్రి కృపారాణి పుణ్యమేనని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. 
 
 రోడ్డు ఆక్రమణ
 పదేళ్ల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉంటున్న బచ్చల చంద్రావతి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ సొంత డబ్బులతో రోడ్డు వేయించానని, ఇప్పుడు ఆ రోడ్డును కూడా ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట ట్రాక్టర్లతో మెటీరియల్ తీసుకొచ్చి విద్యుత్ స్తంభాన్ని కూడా విరగ్గొట్టేశారని, తమ ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయిందన్నారు. ఇదేమిటని అడిగితే కొట్టడానికి వస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని అక్కడ నివాసం ఉంటున్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు. 
 
 
 అర్హులమైనా పట్టా ఇవ్వలేదు
 రైల్వేకాలనీలో జూబిడీలో ఉండేవారం. దాన్ని రైల్వే అధికారులు ఖాళీ చేయమన్నారు. దాంతో అద్దె ఇంట్లో చేరాం. నెలకు రూ.2 వేల అద్దె చెల్లించుకోలేక ఇబ్బంది పడుతున్నాం. నా భర్త టీవీ మెకానిక్. స్థలం ఇప్పించమని మంత్రి కృపారాణి దగ్గరకి పదిసార్లు వెళ్లాం. కలెక్టర్‌నూ కలిశాం. ఎవరెవరికో పట్టాలు ఇచ్చారు గానీ మాకు ఇవ్వలేదు.
 -ఆర్.భారతి, నర్సిపురం 
 
 పట్టా ఉంది.. స్థలం లేదు
 నా భర్త వికలాంగుడు. నేను సిమెంటు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మాకు ఇల్లు కట్టుకోవడానికి పదేళ్ల క్రితం స్థలం ఇచ్చారు. పునాదులు వేద్దామని అక్కడికి వెళితే 10 మంది వచ్చి అడ్డుకున్నారు. ప్రతి ఒక్కరు ‘ఇది మా స్థలం’ అని గొడవ పెడుతున్నారు. దాంతో రాత్రీపగలు మిగతా పనులు మానేసి స్థలం వద్దే ఉంటున్నాను.
 -బమ్మిడి సరస్వతి, నర్సిపురం
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement